ప్రతీకాత్మక చిత్రం
Cyber Crime: Woman Lost Lakhs Of Money By Invest In Virtual Company: గృహిణిగా ఇంటి బాగోగులు, పిల్లల చదువులను పట్టించుకోవడంలో ఏ చిన్న పొరపాటూ జరగనివ్వదు మంగ (పేరు మార్చడమైనది).. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. పిల్లలు డిగ్రీ స్థాయి చదువులకు వచ్చేశారు. మంగ పొదుపరితనాన్ని పాటించే మనిషి కావడంతో డబ్బు బాధ్యతను ఆమెకే అప్పగించేశాడు భర్త.
నెలనెలా వేలల్లో చేసిన పొదుపు ఇప్పుడు లక్షలు అయ్యింది. పిల్లల ఫీజుల సమయానికి తను పెట్టుబడి పెట్టిన వాటి లెక్కలు చూసింది. మంచి రిటర్న్స్ కనిపించాయి. చాలా ఆనందంగా అనిపించింది. కొంత మొత్తాన్ని డ్రా చేయాలని ప్రయత్నించింది. కానీ, డబ్బు విత్‌డ్రా అయినట్టు చూపించడం లేదు, అకౌంట్‌లో డబ్బు జమ కాలేదు. ఆందోళనగా అనిపించింది. తొమ్మిది లక్షల వరకు చేసిన పొదుపు మొత్తంలో నుంచి రూపాయి కూడా విత్‌డ్రా చేసే అవకాశం లేదు. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది ఆందోళనగా. మంగ పొదుపు మొత్తాలను వేటిలో పెట్టుబడిగా పెట్టిందో ఇద్దరూ కలిసి చెక్ చేశారు.
మంగ పొదుపు అనుకొని పెట్టుబడులు పెట్టింది ఒక వర్చువల్ సంస్థలో. ఆన్‌లైన్ వేదికగా జరిగే ఈ నగదు లావాదేవీలో మొదట్లో కొన్ని రోజుల్లోనే లాభాలు వచ్చాయి. దీంతో ఎంత మొత్తం పెట్టుబడిగా పెడితే, అంతకు రెట్టింపు రిటర్న్స్ వస్తాయని తను వివిధ రకాలుగా పొదుపు చేసిన మొత్తాలను ఆ కంపెనీలోనే పెట్టింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలో విఫలం కావడంతో తాను మోసపోయానని అర్ధమైంది.
∙∙
‘ప్రతీ నెల ఈ విధంగా వర్చువల్ పెట్టుబడులు పెట్టి, మోసపోతున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా వేలల్లో ఉంటుందని, వీరిలోనూ ఎక్కువ శాతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉంటున్నార’ని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
సోషల్ మీడియా ప్రకటనలు
►ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూప్స్‌లో ‘వెయ్యి రూపాయలు పెట్టండి, లక్షలు సంపాదించండి’ అనే యాప్ లింక్స్ ప్రకటనలు వస్తుంటాయి. యూ ట్యూబ్‌లో ‘ఒక్కరోజులోనే కారు కొనేశా!’‘ఒక్కరోజులోనే విల్లా కొనేశా!’ అనే తరహా ప్రచారాలతో ఊదరగొట్టేవారుంటారు. వాటిని చూసి మోసపోయేవాళ్లు ఒక కోవకు చెందితే, తమ డబ్బు రాబట్టుకోవడం కోసం ఇతరులను మోసపుచ్చేవాళ్లు మరోరకం.
►ఫలానా ‘యాప్’లో పెట్టుబడులు పెడితే మీకు రెట్టింపు లాభం అని చెబుతారు. దీనికి సంబంధించిన వాట్సప్ గ్రూప్ కూడా తయారు చేస్తారు. ఆ గ్రూప్‌లలోనూ ప్రచారం చేస్తారు. పదివేల రూపాయలు పెడితే ఇరవై వేల రూపాయల లాభం వచ్చిందని ప్రచారం చేస్తారు. ఆశ పడి వాటిలో చేరితే మన డబ్బూ ‘హాం ఫట్’ అయిపోతుంది.
రిఫర్ చేసినందుకు డబ్బు వస్తుందని..
ఆన్‌లైన్ పెట్టుబడులకు సంబంధించిన రెండు రకాల ఇన్వెస్ట్ ఫ్రాడ్స్ ఉంటారు. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టుగా చూపించి డబ్బులు లాగేసుకోవడం. యాప్‌లో డబ్బులు పెట్టమని ప్రోత్సహించి, రాబట్టడం. మనం ఆశపడిన యాప్ లింక్‌ను క్లిక్ చేసి, అందులో కొంత డబ్బు పెట్టి చూద్దాం అనుకున్నవారు ఉంటారు. వారికి ఆ యాప్ వాలెట్‌లో డబ్బు రోజు రోజుకూ రెట్టింపుగా కనబడుతుంటుంది.
దీంట్లో మరో ఇద్దరిని యాడ్ చేయించండి, మరిన్ని లాభాలు పొందండి.. అనే ప్రకటనలు వస్తుంటాయి. దాంతో మరికొందరికి ఈ యాప్ లింక్ షేర్ చేస్తారు. ‘మనకు తెలిసిన వాళ్లే పెట్టుబడి పెట్టారు, మనమూ పెడదాం’ అని.. మిగతా వాళ్లూ తమ డబ్బును సదరు యాప్‌లో పెట్టుబడిగా పెడతారు. ఇది కొన్ని రోజులు జరిగాక, అనుకున్న మొత్తం రాబట్టుకున్నాక వాట్సప్ గ్రూప్ నుంచి నిర్వాహకులు ఎగ్జిట్ అయిపోతారు. ఇంకొన్నాళ్లకు ఆ యాప్ కూడా కనిపించదు.
మోసపూరిత యాప్‌లలోని వాలెట్‌లో మీ నగదు మొత్తాన్ని చూపుతారు. కానీ, ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఇవ్వరు. అందుకు వారు మరికొందరిని చేర్చమని, లేదంటే డబ్బు కట్టాలనే రూల్స్ పెడతారు. లేదంటే ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ.. వంటివి చెల్లించమని కోరుతారు. అవన్నీ చెల్లించిన తర్వాత యాప్ పనిచేయడం మానేస్తుంది. కస్టమర్ సర్వీస్ యాక్సెస్ వంటివి ఏవీ పనిచేయవు.
సురక్షితమైనవేనా?!
►పెట్టుబడులు సురక్షితంగా ఉండే వ్యాపార సంస్థలనే ఎంచుకోవాలి.
►ట్రేడింగ్ కంపెనీల నేపథ్యం ధ్రువీకరించుకున్నాకే పెట్టుబడులు పెట్టాలి.
►యాప్‌స్టోర్, ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మోసపూరిత అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ ఫైల్స్, డిఎమ్‌జెడ్ ఫైల్స్ ఉంటాయని గమనించుకోవాలి. ►డబ్బుతో పాటు ఈ–కామర్స్ ఉత్పత్తులనూ అత్యంత తక్కువ ధరలో ఇస్తున్నట్టు ఎరగా వేస్తారు. అత్యాశకు లోనుకావద్దు.
►చాలా వరకు రూ.1000 కంటే తక్కువ మొత్తంతో పెట్టుబడి ప్రారంభమవుతుంది. మోసగాళ్లు ఒకట్రెండు సార్లు రాబడులు సకాలంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు. తక్కువ మొత్తం ఉన్నప్పుడు లాభాన్ని ఎరగా చూపి, ఎక్కువ మొత్తాన్ని రాబడతారు.
►నగదు లావాదేవీలన్నీ వర్చువల్ ఖాతాల ద్వారా జరుగుతాయి కాబట్టి బాధితులు మోసపోయినా తిరిగి తమ మొత్తాన్ని రాబట్టుకోలేరు.
►డబ్బు పెట్టుబడిగా పెట్టమని సూచించే లింక్స్‌పై గుడ్డిగా క్లిక్ చేయకూడదు. అన్నింటికీ మించి మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా, చట్టబద్ధంగా ఉన్నవాటినే ఎంచుకోవడం శ్రేయస్కరం.
-అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment