
రావి కొండలరావుతో నాది దాదాపు 60 ఏళ్ల పరిచయం. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడే ఆయన తెలుసు. కొండలరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఆ రోజుల్లోనే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. నాటకాల్లో నటించడమే కాకుండా రచనలు కూడా చేసేవారు. కొండలరావుగారు, ఆయన భార్య రాధాకుమారి.. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంటికి వాళ్లు రావటం, వాళ్లింటికి మేం వెళ్లటం జరుగుతూ ఉండేది. నేను దర్శకుడైన తర్వాత దాదాపు ప్రతి సినిమాలోను ఆయన ఉన్నాడు. నా సినిమాల్లో ఆయన లేని సినిమా లేదు. ఆయన నా మనసుకి అంత దగ్గరివాడు. విజయావారి ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన సంపాదకునిగా చేసినప్పుడు కొన్ని ఆర్టికల్స్ రాసే విషయంలో నన్ను సంప్రదించేవారు. (పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి)
షూటింగ్‌లు ఉన్నప్పుడు రోజూ కలిసేవాళ్లం. లేకపోయినా కూడా విజయా స్టూడియోలో వారం వారం తప్పనిసరిగా కలిసేవాళ్లం. విజయా వాళ్లు మళ్లీ సినిమాలు తీస్తారు అనుకున్నప్పుడు కూడా ఆయనతో ‘బృందావనం’, ‘భైరవద్వీపం’ చిత్రాలకు కలిసి పని చేశాం. నటన విషయం పక్కన పెడితే మనిషిగా ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్ప మనిషంటే ఏదైనా విమర్శించాల్సి వచ్చినా సెన్సాఫ్ హ్యూమర్‌తో విమర్శించేవాడే కానీ, ఎవరినీ నొప్పించేవాడు కాదు. అది ఎంతో గొప్ప గుణం. అది అందరిలో ఉండదు. అతనికి వ్యక్తిగతంగా ఒక్క శత్రువు కూడా లేరంటే అందరూ నమ్మాల్సిందే. సినిమా పరిశ్రమలో అందరికీ పాలిటిక్స్ ఉంటాయి కానీ, ఆయనకు ఏ రాజకీయాలూ తెలియవు. అంత గొప్ప మనిషి. సినిమా పరిశ్రమ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయింది. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధకు గురి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment