Raavi Kondala Rao
-
‘పెన్’ టాస్టిక్.. ‘ఫన్ టాస్టిక్.. రావి కొండలరావు
-
బాల్యమంతా శ్రీకాకుళంలోనే..
సింగీతం శ్రీనివాసరావు జానపదం అంటే ‘భైరవ ద్వీపం’ అని రాసిచ్చేశారు. మిస్సమ్మను చూసి తనివి తీరకుంటే ‘పెళ్లి పుస్తకం’ రాసి బాపూరమణలను ఆశ్చర్యపరిచారు. గురజాడ వారి కన్యాశుల్కాన్ని బుల్లితెరపైకి అలవోకగా తీసుకువచ్చారు. తూకం చెడకుండా హాస్యాన్ని రాసి, రక్తి కట్టించగలనని నిరూపించుకున్నారు. నాటకాల్లో ఆడ పాత్రలు వేయడానికంటూ విజయనగరం అమ్మాయిని వివాహం చేసుకుని ఆదర్శ దాంపత్యం అంటే ఏంటో చూపించారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అంత పెద్ద సినీ కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఇన్ని ఘనతలు సాధించిన రావి కొండలరావు సిక్కోలు గుండెలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీకాకుళంలోనే ఆయన బాల్యం గడిచింది. శ్రీకాకుళం కల్చరల్: ప్రముఖ రంగస్థల, సినీ, టీవీ నటులు, దర్శకులు, రచయిత, పాత్రికేయులు రావి కొండలరావు మృతిపై సిక్కోలు కళాకారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రావి కొండలరావు కుటుంబం శ్రీకాకుళంలోని పాండురంగవీధిలో నివాసముండేది. ఆయన సామర్లకోటలో జన్మించినా శ్రీకాకుళంతోనే అనుబంధం ఎక్కువ. కాకినాడలో ప్రాథమికంగా చదివినా ఆ తర్వాత శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు సాహిత్యంపై మక్కువ కలిగింది. నాటకాలపై ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 1956లో సుకుమార్ ఆర్కెస్ట్రాను మిత్రబృందంతో స్థాపించారు. మద్రాసు వైపు పయనం.. ఆ తర్వాత ఆయనకు మద్రాసు మీద గాలి మళ్లింది. చేతిలో విద్య ఉండడంతో అవకాశాలు వెతుక్కుంటూ మద్రాసులో వాలిపోయారు. రాత మీద మక్కువతో మొదట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభ, జ్యోతి, రచన, యువ, ఉదయం, విపుల మొదలైన పత్రికల్లో రచనలు చేశారు. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్గానూ పనిచేశారు. సుకుమార్ అనే కలం పేరుతో కొన్ని రచనలు చేశారు. అనురాగం, అభిప్రాయం, అభిమాన పుస్తకం, తదితర కథలు రాశారు. నీతి చంద్రిక, హ్యూమరథం(రెండు భాగాలు), మల్లీశ్వరి(సినీనవల), బ్లాక్ అండ్ వైట్, నాటికలు, కథలు నాగావళి నుంచి మంజీరా వరకు రచించారు. ఆ క్రమంలోనే సినిమా వాళ్లతో పరిచయాలు పెరిగాయి. ముఖ్యంగా ఆదుర్తి వారికి, విజ యా సంస్థలకు ఆయన ఇష్టుడిగా మారిపోయారు. బాపూరమణల మిత్రధ్వయానికి కూడా కుడి భుజంగా వ్యవహరించేవారు. సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుడికి బృందావనం, భైరవ ద్వీపం వంటి సినిమాలను రాసిచ్చారు. అయితే చాలా సినిమాలకు ఆయన ఘోస్ట్ రైటర్‌గానే పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వం తామ్ర నంది పురస్కారం 2004లో అందించింది. అ.జో.వి.భో కందాళం ఫౌండేషన్ వారు జీవత సాఫల్య పురస్కారం ఇచ్చారు. కళాకారుల సంతాపం రావి కొండలరావు గుండెపోటుతో మృతి చెందడంతో సిక్కోలు కళాకారులు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. శ్రీసుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తు చిన్నారావు, సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రావికొండలరావు మరణం నాటకరంగానికి తీరని లోటని శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతినిధులు పన్నాల నరసింహమూర్తి, చిట్టి వెంకటరావు, ఎల్.రామలింగస్వామి, బీఏ మోహనరావు, కలగ గణేష్, రామచంద్రదేవ్, వసంతకుమార్ తదితరులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అలాగే ఉపనిషత్ మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, కార్యదర్శి విశ్వనాథం కామేశ్వరరావు, సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. -
రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం
ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనాలు, పాతతరం నటన ఏ విషయంలోనైనాఆయనకు ఉన్న పట్టు ఉన్న వేరొకరికి లేదనేది సినీ ప్రముఖుల మాట.. అందుకే ఆయనను చాలా మంది సినీ ఎన్సైక్లోపీడియా అని అంటుంటారు. పాత్రికేయుడిగా, రచయితగా, సహాయ దర్శకుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే సీనియర్ నటుడు రావి కొండలరావు. మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆయనకు జిల్లాతో అనుబంధం ఉంది. ఇక్కడ చిత్రీకరించిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన జ్ఞాపకాలను పలువురు సినీప్రముఖులు, రచయితలు ‘సినీ జగత్తు నుంచి నింగికి చే‘రావి’లా అంటూ గుర్తు చేసుకున్నారు. రాజమహేంద్రవరం కల్చరల్: రావి కొండలరావు 1932 ఫిబ్రవరి11న జన్మించారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలో పెరిగి పెద్దయ్యారు. తన పదహారో ఏట చిల్లర డబ్బులు జేబులో వేసుకుని, నటుడు కావాలని రావి కొండలరావు మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగాడు. అప్పటికే, ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లి, సినిమాల్లో రాణించిన వారి చరిత్రలు ఆ అబ్బాయి కంఠస్థం చేశాడు. అక్కడి నుంచి పాత్రికేయుడిగా, రంగస్థల, సినీనటుడిగా, సినీ రచయితగా ఆయన జీవిత ప్రస్థానం సాగింది. నాగావళి నుంచి మంజీరా వరకు సాగిన ఆయన తన ప్రస్థానాన్ని ‘నాగావళి నుంచి మంజీరా వరకు’ పేరిట ఆత్మకథగా రచించారు. ఈ పుస్తక పరిచయ సభ కూడా రాజమహేంద్రవరంలో జరగడం విశేషం. హైదరాబాద్‌లో స్థిరపడి, అక్కడే మంగళవారం కన్ను మూశారు. బాల పత్రికతో అన్న ప్రాసన.. బాల పత్రికతో రావి కొండలరావు రచనా వ్యాసాంగం ప్రారంభమైంది. మద్రాసు నుంచి వెలువడే ఆనందవాణికి సంపాదకత్వం వహించారు. 1958లో శోభ సినిమాలో తొలి వేషం వేశారు. సుమారు 600 సినిమాల్లో నటించారు. అక్కినేనితో నటించిన ప్రేమించి చూడు, బ్రహ్మచారి, గృహలక్ష్మి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. బాపు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి పుస్తకానికి, రావి కొండలరావు రాసిన కథకు స్వర్ణ నంది బహుమతి లభించింది. సైలెన్స్.. సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై జరుగుతుండగా.. స్టేజీ మీదకు పేక బెత్తాం పట్టుకుని, హఠాత్తుగా ఎంటరై. సైలెన్స్ అని గద్దిస్తూ అందరినీ నవ్వించిన రావి కొండలరావు నటన, వ్యక్త్విత్వం అరుదైనవి. రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం – గోదావరితో అనుబంధం ఆరెస్సెస్‌లో ఉండి, సత్యాగ్రహంలో పాల్గొనడంతో రావి కొండలరావు చిన్నతనంలోనే రాజమండ్రి జైల్లో మూడు నెలల కఠిన జైలు శిక్ష అనుభవించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు డీవీ హనుమంతరావు, ఎంవీ అప్పారావు, విశ్రాంత పోస్టల్ ఉద్యోగి మహ్మద్ ఖాదర్‌ఖాన్ ఇతర మిత్రులు కలసి రాజమహేంద్రవరంలో ‘హాసం’ క్లబ్ ప్రారంభించినప్పుడు, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డీఎడ్ కళాశాలలో జరిగిన ముళ్లపూడి వెంకటరమణ జయంత్యుత్సవంలో ఆయన పాల్గొని తన బాల్యమిత్రడు ముళ్లపూడి గురించి ప్రసంగించారు. 2016లో ఆనం కళాకేంద్రంలో ఆయనను నటుడు, గాయకుడు జిత్ మోహన్ మిత్రా చేతుల మీదుగా సన్మానించారు. కళాకారులకు ఆదర్శప్రాయుడు ‘రావి’ కాకినాడ కల్చరల్: సీనియర్ నటుడు రావి కొండలరావు కళాకారులకు ఆదర్శప్రాయుడని నటుడు, దర్శకులు ప్రసాద్ అన్నారు. 2013లో సూర్యకళామందిర్‌లో తాను నిర్వహించిన మూర్తి కల్చరల్ అసోసియేషన్ 20 వార్షికోత్సవానికి రావి ముఖ్యఅతిథిగా హాజరయ్యారని తెలిపారు. రావి భార్య రాధాకుమారి కళాప్రాంగణాన్ని ప్రారంభించారని గుర్తు చేసుకొన్నారు. స్థానిక కళాకారులను, రావి కొండలరావును అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించామని నాటి అనుభూతులను ప్రసాద్ గుర్తు చేసుకొన్నారు. రావి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనతో కలసి నటించిన మదురక్షణాలు రావి కొండలరావుతో కలసి లోఫర్మామ–సూపర్ అల్లుడు, ప్రేమ చిత్రం–పెళ్లి విచిత్రం, స్నేహం సినిమాల్లో నటించాను. ఈ మూడు సినిమాలు రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఆయనతో నటిస్తుంటే, టైం తెలిసేది కాదు. మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. – శ్రీపాద జిత్ మోహన్ మిత్రా, నటుడు, గాయకుడు నాకు సన్నిహిత మిత్రుడు మేము ప్రారంభించిన హాసం క్లబ్ ప్రారంభోత్సవం ఆయన చేతులమీదుగా జరిగింది. ఆయన మాతో కలసి ఎంతో ఆత్మీయంగా ఉండే వారు. ఒక చిన్న పిల్లవాడైపోయేవారు. తెలుగు సినిమాల్లో సున్నితమైన హాస్యం ఆయనకే చెల్లింది. అక్కినేని నటించిన బ్రహ్మచారి సినిమాలో రక్త పరీక్ష చేసి, రిజల్టు చెప్పడానికి వచ్చిన పాత్రలో ఆయన కనిపించేది రెండే నిమిషాలైనా, చిరస్మరణీయమైన హాస్యాన్ని ఆయన పండించారు. – డీవీ హనుమంతరావు, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి, శతక రచయిత -
ఆయన నా మనసుకి అంత దగ్గర..
రావి కొండలరావుతో నాది దాదాపు 60 ఏళ్ల పరిచయం. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడే ఆయన తెలుసు. కొండలరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఆ రోజుల్లోనే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. నాటకాల్లో నటించడమే కాకుండా రచనలు కూడా చేసేవారు. కొండలరావుగారు, ఆయన భార్య రాధాకుమారి.. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంటికి వాళ్లు రావటం, వాళ్లింటికి మేం వెళ్లటం జరుగుతూ ఉండేది. నేను దర్శకుడైన తర్వాత దాదాపు ప్రతి సినిమాలోను ఆయన ఉన్నాడు. నా సినిమాల్లో ఆయన లేని సినిమా లేదు. ఆయన నా మనసుకి అంత దగ్గరివాడు. విజయావారి ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన సంపాదకునిగా చేసినప్పుడు కొన్ని ఆర్టికల్స్ రాసే విషయంలో నన్ను సంప్రదించేవారు. (పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి) షూటింగ్‌లు ఉన్నప్పుడు రోజూ కలిసేవాళ్లం. లేకపోయినా కూడా విజయా స్టూడియోలో వారం వారం తప్పనిసరిగా కలిసేవాళ్లం. విజయా వాళ్లు మళ్లీ సినిమాలు తీస్తారు అనుకున్నప్పుడు కూడా ఆయనతో ‘బృందావనం’, ‘భైరవద్వీపం’ చిత్రాలకు కలిసి పని చేశాం. నటన విషయం పక్కన పెడితే మనిషిగా ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్ప మనిషంటే ఏదైనా విమర్శించాల్సి వచ్చినా సెన్సాఫ్ హ్యూమర్‌తో విమర్శించేవాడే కానీ, ఎవరినీ నొప్పించేవాడు కాదు. అది ఎంతో గొప్ప గుణం. అది అందరిలో ఉండదు. అతనికి వ్యక్తిగతంగా ఒక్క శత్రువు కూడా లేరంటే అందరూ నమ్మాల్సిందే. సినిమా పరిశ్రమలో అందరికీ పాలిటిక్స్ ఉంటాయి కానీ, ఆయనకు ఏ రాజకీయాలూ తెలియవు. అంత గొప్ప మనిషి. సినిమా పరిశ్రమ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయింది. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధకు గురి చేస్తోంది. -
ప్రతి ఇంటి చావడిలో ఆయన నవ్వుంది
తరచి చూడాలేగాని నాలుగు సంసారాల చోటులో కూడా నవ్వు చూడొచ్చు. ఆ నవ్వుని పట్టుకుని నాలుగిళ్ల చావడి నాటికతో ప్రసిద్ధుడయ్యాడాయన. నటుడు, రచయిత, కాలమిస్ట్, జర్నలిస్ట్ రావికొండలరావు తెలుగు వారి సాంస్కృతిక పాయలో ఒక చిన్నచిర్నవ్వును నింపి మంగళవారం సెలవు తీసుకున్నారు. ఆయనకు నివాళి. ‘ప్రేమించి చూడు’లో రావి కొండలరావు అక్కినేని తండ్రి. ముక్కోపి అయిన తెలుగు మేస్టారు. అక్కినేనికి ఆ సినిమాలో పూటకు ఠికానా లేదు. ఎలాగో ఫ్రెండు జగ్గయ్య దగ్గర అప్పు చేసి ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నట్టు మనీఆర్డర్ చేస్తుంటాడు. ఆ నెల పోస్ట్‌మేన్ వస్తాడు కానీ మనీఆర్డర్ తేడు. తెలుగు మేస్టారుకు చిర్రెత్తుకొస్తుంది. ‘మనీఆర్డర్ ఏదోయ్’ అంటాడు. ‘రాలేదండీ’ అంటాడు పోస్ట్‌మేన్ భయంగా. ‘రాకపోయినా తెచ్చివ్వాలి. వచ్చాక తెస్తే నీ గొప్పతనం ఏముంది బోడి’ అని బెదరగొడతాడు. హాల్లో అందరూ నవ్వుతారు. రావి కొండలరావు అలా నవ్విస్తూ తెలుగువారి నవ్వులో ఒక భాగం అయ్యారు. ‘సామర్లకోట’ అంటే ఎస్.వి.రంగారావు గుర్తుకొస్తారు. రావి కొండలరావుది కూడా ఆ ఊరే. కాని బాల్యం శ్రీకాకుళంలో గడిచింది. వాళ్ల నాన్న పోస్ట్‌మాస్టర్ కనుక ఏ మెయిల్ అయినా చేతుల మీదుగా అందాలి కనుక సినిమా హాళ్ల వాళ్లు ఫ్రీగా ఫ్యామిలీని సినిమా చూడనిచ్చేవారు. రావి కొండలరావు అలా సినిమా అభిమాని అయ్యారు. ‘నా జీవితం ఇలా ఈ కొసన గడిచిపోవడానికి వీల్లేదు’ అని ఆయన పియుసి పాస్ అయిన వెంటనే నిర్ణయించుకున్నారు. మద్రాసు (ఇప్పుడు చెన్నై) నుంచి వచ్చే ‘ఆనందవాణి’ అనే పత్రికలో చిన్న ఉద్యోగం వస్తే చదివిన చదువు చాల్లే అనుకుని వెళ్లిపోయారు. ‘ఆనందవాణి’ పత్రికలో ఉద్యోగం ఉంది కాని జీతం లేదు. ‘ఇస్తాం ఇస్తాం’ అనే ఆ రాని జీతం కోసం ఎదురు చూసి చూసి మానేశాడాయన. అప్పుడే పరిచయం అయిన ముళ్లపూడి వెంకటరమణ అతన్ని ఇంటికి తీసుకువెళ్లి తన వద్దే ఉంచుకుని భోజనం పెట్టారు. రావి కొండలరావు చిన్నప్పుడే నాటకాలు వేశారు. ‘తెలుగు మేస్టారు’ అనే కేరెక్టరు ఆయన తయారు చేసుకున్నారు. ఎవరినైనా గద్దించి ఎవరిలోనైనా లోపం వెతికి సరి చేసే ముక్కోపి ఈ తెలుగు మేస్టారు. రూళ్లకర్రలో కూడా వంకలు వెతగ్గలడు. ఏదో ఒకటి చేసి ఎలాగోలా బతుకుదాం అనుకుంటున్న రావి కొండలరావు నటుడిగానే మద్రాసు మహానగరంలో మెరుగ్గా బతగ్గలరని కనిపెట్టినవాడు ముళ్లపూడి. బి.ఎన్.రెడ్డి దగ్గర ‘పూజాఫలం’ సినిమాకి, కమలాకర కామేశ్వరరావు దగ్గర ‘నర్తనశాల’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రావి కొండలరావును ‘మీరు నటుడిగా ప్రయత్నించండి’అని ‘దాగుడుమూతలు’ సినిమా కోసం ఓ పాత్ర రాసి ఆ పాత్ర ఆయనకొచ్చేలా చేశారు ముళ్లపూడి. రావికొండలరావు దర్శకుడు బాపు గారికి కూడా నచ్చారు. వారిదో స్నేహత్రయం. బాపూ తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా ‘ఏదీ, ఆ తెలుగు మేష్టారు ఓసారి చేయండ’ని అడిగేవారట. రావికొండలరావు తొలి తెలుగు సినిమా జర్నలిస్టులలో ఒకరు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వారానికి ఒకసారి సినిమా పేజీ తేవాలని నిర్ణయించినప్పుడు ఆ పేజీ మొత్తం వార్తలను చెన్నై నుంచి పంపి అందుకు పారితోషికంగా పదిహేను రూపాయలు పొందేవాడాయన. ఐదువారాలకు 75 రూపాయలు ముట్టేవి. ఈ అనుభవంతో పాటు ‘చందమామ’ పత్రికలో పని చేయడం వల్ల ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుతో పరిచయం పొంది ఆయన సిఫార్సు మేరకు ‘విజయచిత్ర’ మాసపత్రికకు ఎడిటర్ అయ్యారు. ‘మంచి మాత్రమే చెప్తాం. చెడు ఉన్నా చెప్పం’ అనే పాలసీ తో ఆరోగ్యకరమైన సినిమా వార్తలతో ఈ పత్రిక మూడో సంచికతోనే లక్ష కాపీల సర్క్యులేషన్‌కు వెళ్లింది. ఆ పత్రికకు ఆయన 26 ఏళ్లు ఎడిటర్‌గా పని చేశారు. సినిమాల్లో నటిస్తూనే ఆ ఉద్యోగం చేయడం వల్ల డెడ్‌లైన్‌ను అందుకోవడానికి షూటింగ్ నుంచి వచ్చి విగ్గుతోనే ఫ్రూఫులు చూసిన రోజులు ఉన్నాయని చెప్పుకున్నారు. ‘ప్రతిభ కంటే ప్రవర్తన ముఖ్యం’ అని నమ్మిన రావి కొండలరావు తన ప్రవర్తన వల్లే సినిమా రంగంలో సుదీర్ఘకాలం మనగలిగానని చెప్పుకున్నారు. ఎన్.టి.ఆర్ ఆయనను మెచ్చి ‘వరకట్నం’ నుంచి తన ప్రతి సొంత సినిమాలో తప్పక వేషం ఇచ్చేవారు. ఆయన రాసిన నాటకం ‘కథ కంచికి’లో రాజబాబుకు చిన్న పాత్ర ఇచ్చి ప్రోత్సహించడంతో ఆ పాత్ర కె.వి.రెడ్డి దృష్టిలో పడి రాజబాబు కెరీర్‌కు రాజమార్గం వేసింది. ఆయన రాసిన ‘నాలుగిళ్ల చావడి’,‘కుక్కపిల్ల దొరికింది’, ‘ప్రొఫెసర్ పరబ్రహ్మం’... నాటికలు తెలుగు నేలంతా విజయయాత్ర చేశాయి. మలినం, శ్లేష, వికారం లేని హాస్యం ఉన్న రచనలు అవి. ‘స్త్రీ పాత్ర రాస్తే పాతిక రూపాయలు పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని మగపాత్రలతోనే నాటికలు రాశాను. రాధాకుమారిని వివాహం చేసుకున్నాక ఆమె చేస్తుందనే ధైర్యంతో స్త్రీ పాత్ర నాటికలు రాశాను’ అని చెప్పాడాయన. రాధాకుమారి, రావికొండలరావు నిజ జీవితంలోనే కాక సినీ తెర మీద కూడా వందకు పైగా సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఇలా నటించడం ఒక రికార్డు కావచ్చు. రావికొండలరావు రాసిన కథ బాపూరమణ లు ‘పెళ్లి పుస్తకం’గా తీస్తే దానికి మూడు నంది పురస్కారాలు దక్కాయి. విజయ సంస్థ తిరిగి సినిమా నిర్మాణంలోకి వచ్చినప్పుడు ఆ సంస్థ తరఫున సమస్త బాధ్యతలు నిర్వహించారాయన. ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలు ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. ‘భైరవద్వీపం’ సినిమాకు కథ, మాటలు రావి కొండలరావు రాశారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాక ఆయన ఊరికే కూర్చోకుండా కామెడీ క్లబ్ నిర్వహణ చేస్తూ హాస్యం పంచారు. సినిమా జ్ఞాపకాలను ‘హ్యూమరథం’,‘బ్లాక్ అండ్ వైట్’ పేరుతో పుస్తకాలుగా వెలువరించారు. ‘మాయాబజార్’ సినిమాను నవలగా రాశారు. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ ఆయన ఆత్మకథ. రావికొండలరావు కథలు కూడా పఠనీయమైనవి. ‘నేను అరవై ఏళ్లు సినిమా పరిశ్రమలో పని చేశాను’ అని చెప్పుకున్నాడాయన. ఆరు దశాబ్దాల ఆయన కృషి బహుముఖీనమైనది. విశాలమైనది. అలసట, బద్దకం ఎరగనిది. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను నమ్ముకున్నది. కరోనా తెచ్చిన దేవుడిని నాలుగు చీవాట్లు పెట్టడానికి తెలుగు మేష్టారుగా ఆయన అమరపురిని చేరుకున్నాడు. ఆయనకు హాస్యశాంతి కలుగుగాక. – కె ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ సంతాపం.. బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని సీఎం జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ నటుడు, రచయిత, నాటక రంగ కళాకారుడు రావి కొండలరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన కాలానికి చెందిన గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొండలరావు అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఇకలేరు ప్రముఖ తెలుగు సినీ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు (88) మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నటుడిగా సినీ రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. సుమారు 600కు పైగా సినిమాల్లో నటించారాయన. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి సీనియర్ నటుల నుంచి ఇప్పటి నటీనటులతోనూ కలసి నటించారాయన. 1932, ఫిబ్రవరి 11న శ్రీకాకుళం లో జన్మించారు రావికొండలరావు. బాల్యంలోనే నాటికలు, సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. అదే ఆయన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది. 1958లో వచ్చిన ‘శోభ’ సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు రావికొండలరావు. ‘రాముడు భీముడు’, ‘తేనె మనసులు’, ‘ప్రేమించి చూడు’, ‘ఆలీ బాబా 40 దొంగలు’, ‘అందాల రాముడు’, ‘దసరా బుల్లోడు’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారాయన. రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘365 డేస్’ ఆయన ఆఖరి చిత్రం అనొచ్చు. సినిమాల్లోకి రాకముందు ఆనందవాణి, వనిత,జ్యోతి, విజయ చిత్ర వంటి పత్రికల్లో పని చేశారు. సినిమా మీద లెక్కలేనన్ని వ్యాసాలు, కొన్ని పుస్తకాలు రాశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. ‘పెళ్లి పుస్తకం’, ‘భైరవద్వీపం’ వంటి చిత్రాలకు కథను అందించారాయన. రావి కొండలరావు భార్య రాధాకుమారి కూడా సినిమా యాక్టరే. 2012లో రాధాకుమారి మరణించారు. వీరికి ఒక కుమారుడు (రావి వెంకట శశికుమార్) ఉన్నారు. రావి కొండలరావు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. -
పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి
‘నేను హీరోగా పరిచయం అయిన తొలి రోజుల నుంచి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా మా కాంబినేషన్లో వచ్చిన ‘చంటబ్బాయ్, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఆయన మరణం తీరని లోటు. కొండలరావు, ఆయన సతీమణి రాధాకుమారిగార్లు జంటగా ఎన్నో చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి, వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. రావి కొండలరావుగారి మరణంతో చిత్రపరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది’ అని నటుడు చిరంజీవి అన్నారు. నా కథలు కొండలరావుకి చెప్పేవాణ్ణి – నటుడు గిరిబాబు మద్రాసులో ఉన్నప్పటి నుంచి రావి కొండలరావుగారితో నాకు పరిచయం ఉంది. ఆయన చాలా గొప్పవారు.. మంచి మనిషి. స్నేహశీలి. చక్కని ప్రవర్తన ఉన్నవాడు. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయా ప్రొడక్షన్స్ సంస్థకు ఆయన ఎంతో నమ్మకస్తుడు. అందుకే ‘భైరవద్వీపం, బృందావనం, శ్రీకృష్ణార్జున విజయం’ వంటి చిత్రాలు కొండలరావుగారి నిర్మాణ నిర్వహణలోనే పూర్తి చేశారు. నేను, ఆయన కలిసి చాలా సినిమాలు చేశాం. నేను హీరోగా చేసిన ‘వధూవరులు’ చిత్రంలో మంజు భార్గవి తండ్రి పాత్ర చేశారాయన. నా సొంత సినిమా ‘సంధ్యారాగం’లోనూ ఆయనకు మంచి పాత్ర ఇచ్చా. నా సొంత సినిమాలన్నింటికీ నేనే కథలు రాసుకునేవాణ్ణి. జడ్జిమెంట్ కోసం ఆ కథలను ఆయనకు వినిపించేవాణ్ణి. ‘చాలా బాగా రాశావు గిరిబాబు’ అని అభినందించేవారు. మంచి మనిషి ఈ రోజు మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఐదు రోజుల క్రితమే మాట్లాడాను – నటుడు–రచయిత–దర్శకుడు తనికెళ్ల భరణి నేను కాలేజీలో చదువుకునే రోజుల నుండి రావి కొండలరా వుగారు పరిచయం. అదేదో ౖyð రెక్ట్ ముఖ పరిచయం కాదు, మేము నాటకాలు వేసేవాళ్లం కదా.. అలా మాది నాటక పరిచయం. ఆయన రాసిన నాటకాల్ని చదివి ఎంజాయ్ చేసేవాళ్లం. తర్వాత నేను చెన్నై వెళ్లాను. అక్కడ రాళ్లపల్లిగారి ద్వారా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో విజయచిత్ర అని సినిమా వారపత్రిక ఉండేది. ఆయన దానికి సంపాదకునిగా ఉండేవారు. నేను ఆ పుస్తకాన్ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాణ్ని. అందులో ఆయన రాసే ఆర్టికల్స్, ఇంటర్వ్యూలు చదివేవాడిని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించిన ఏ సాహిత్య సమావేశం అయినా ఆయన లేకుండా జరిగేది కాదు. అంతటి సాహితీప్రియుడు ఆయన. మంచి వక్త, అందరినీ సరదాగా నవ్విస్తూ ఉండేవారు. కరెక్ట్‌గా ఐదు రోజుల క్రితం అనుకుంటా.. ఫోన్ చూస్తుంటే ‘ఆర్’ అనే అక్షరం దగ్గర ఆయన ఫోన్ నంబర్ కనిపిస్తే, ఆయనకు ఫోన్ చేశాను. గతేడాది ఆయన ఒక సాహిత్య కార్యక్రమం చేయమని అడిగారు. అప్పుడు నేను రాసిన ‘శృంగారా గంగావతరణం’ అనే కావ్యం సత్సంగం ఆయన ఇంట్లో జరిగింది. ఆయనకు తెలిసిన సాహితీ మిత్రులందరినీ ఆహ్వానించారు. ఆయన నాకు సన్మానం చేసి ఆశీర్వదించారు. అది గుర్తుకు వచ్చి నేను ఆయనకు ఫోన్ చేస్తే, ‘ఏమిటి స్వామీ.. ఎలా ఉన్నారు’ అని బాగా మాట్లాడారు. ‘ఏమీ లేదండీ.. కోవిడ్‌లో ఎలా ఉన్నారని ఊరికే పలకరిద్దా’మని అన్నాను. ‘చాలా మంచిదయ్యా.. మాలాంటి వారిని అప్పుడప్పుడు పలకరిస్తే ఉత్సాహంగా ఉం టుంది’ అన్నారు. ‘ఏమిటి మరి హూషారుగా ఉన్నారా’ అంటే... ‘లేదండీ... ఈ మధ్య నేను కింద పడిపోయాను. వాకర్ సాయంతో నడుస్తున్నాను’ అన్నారు. ‘సరేనండీ జాగ్రత్త’ అన్నాను. ఇంతలోనే వెళ్లిపోయారు. ఇండస్ట్రీలోని మరో పెద్ద తలకాయి దూరమైంది. ఆల్‌రౌండర్ అంటే రావి కొండలరావు గారే – రాజేంద్ర ప్రసాద్ ‘‘సినిమా పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాలు పని చేసిన వ్యక్తి కొండలరావుగారు. సినిమా నటునిగా పక్కన పెడితే బయట నాటకాల్లోlఆయన చాలా గొప్ప నటుడు. జర్నలిస్ట్, కథకుడు, రచయిత, నటుడు.. ఇలా ఆయన చాలా గొప్పవాడు. సినిమా పరిశ్రమలో ఆల్ రౌండర్ అంటే ఆయన పేరే చెప్పొచ్చు. వాళ్ల ఊర్లో ఆయన ఫేమస్ టీచరు. ఆయన టీచర్‌గా ఎంత ఫేమస్ అంటే మేమందరం ఎప్పుడు కలిసినా ఆయన టీచర్‌గా చేసినప్పటి విశేషాలే మాట్లాడుకునేవాళ్లం. ఆయన భాషలో ఇప్పుడున్న పరిస్థితిని చెప్పాలంటే ‘‘యూ రాస్కెల్ కరోనా, సైలెంట్‌గా ఉండు, ఉండమన్నానా, యూ ఇడియట్...’ ఇలా ఉంటుంది ఆయనతో సంభాషణ. సింపుల్ లివింగ్, గ్రేట్ పర్సన్ అంటే ఆయన పేరే చెప్పాలి. వ్యక్తిగతంగా నేనంటే విపరీతమైన లవ్. లొకేషన్‌కి వచ్చిన దగ్గర్నుండి ప్రసాదూ, ప్రసాదు... అని కలవరించేవారు. ఒక జీవితానికి మరపురాని కలలు ఆ రోజలు. సినిమా పరిశ్రమలో నాకున్న అతి పెద్ద వయసున్న బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. నన్ను బిడ్డలా చూసుకునేవారు – సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ రావికొండలరావుగారు మా మాధవపెద్ది కుటుంబాలకు మూడు తరాల నుంచి అత్యంత ఆప్తులు. ఆయన్ను వరసకి తాతయ్యా అని పిలుస్తాను. మా చిన్నాన్నలు సత్యం, గోఖ్లే ఆయనతో ఫ్రెండ్లీగా ఉండేవారు. వైజాగ్‌లో ఓ ప్రోగ్రామ్ కోసం ట్రైన్లో ఆయనా, నేను కలసి ప్రయాణించాం. అప్పుడు సంగీతం పట్ల నాకు ఉన్న అభిరుచినంతా ఆయనతో చెప్పడం జరిగింది. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్‌గా 4–5 సినిమాలు చేశాను. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ‘విజయా ప్రొడక్షన్స్ వాళ్లు టీవీ సీరియల్స్ చేయాలనుకుంటున్నారు. దానికి సంగీతం అందించాలి’ అని రావి కొండలరావుగారు అన్నారు. 2పాటలు కంపోజ్ కూడా చేశాను. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఆ తర్వాత 1992లో సింగీతం శ్రీనివాసరావు, నేను, రాజేంద్ర ప్రసాద్, డీవీ నరసరాజు.. ఇలా అందరం ఓ సినిమాకి పని చేశాం. ఆ సినిమాకు నిర్మాణ సంచాలకుడిలా ఉంటూనే రావి కొండలరావుగారు చాలావరకు మాటలు కూడా రాశారు. ‘భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలకు నా పేరు సూచించింది ఆయనే. ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కొండలరావుగారు చేసిన ‘కన్యాశుల్కం’ సీరియల్‌కి నేను పని చేశాను. నన్ను ఆయన బిడ్డలానే చూసుకునేవారు. ఈ ఏడాది మార్చి 4న ఆయనకు, ముళ్ళపూడి వెంకట రమణగారి భార్య శ్రీదేవిగారికి, జంధ్యాలగారి భార్య అన్నపూర్ణగారికి, వేటూరిగారి భార్య సీతా మహాలక్ష్మిగారికి సన్మానం చేసుకునే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషం. అప్పుడు చాలా బాగా మాట్లాడారు. అదే ఆయన్ను చివరిసారి చూడటం. ఆరోగ్యం బావుండటం లేదని తెలిసింది. గురువుగారికి ఎలా ఉంది అని వాళ్ల అబ్బాయితో మాట్లాడాను. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో గురువుగారు చాలా ముఖ్యమైనవారు. తాతినేని చలపతిరావు నన్ను మ్యూజిషియన్‌గా పరిచయం చేస్తే, జంధ్యాలగారు నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. రావి కొండలరావుగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎలివేట్ చేశారు. నేను, నా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన లేని లోటు నాకు ఎప్పుడూ ఉంటుంది. మృత్యోర్మా అమృతంగమయా – దర్శకుడు వీఎన్ ఆదిత్య రావి కొండలరావుగారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం వయస్సు నలభై ఐదు ఏళ్లకు పైనే. 1970లలో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్‌లో కల్చరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రావి కొండలరావు, శ్రీమతి రాధాకుమారి దంపతులతో స్నేహం ఏర్పడింది. ‘ఉగాది శుభాకాంక్షలతో... మీ రావికొండలరావు, రాధాకుమారి’ అనే పోస్ట్ కార్డు దాదాపు ముప్పై ఏళ్లు క్రమం తప్పకుండా మేం ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే ఆ అడ్రస్‌కి వచ్చేది. ఆ కార్డు ఆధారంగానే నేను వాళ్లింటికి వెతుక్కుంటూ వెళ్లడం, ‘బృందావనం’ సినిమాకి సింగీతం శ్రీనివాసరావుగారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడం, దర్శకుడవ్వాలన్న నా కల సాకారం కావడం.. నాకు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహా మనీషి రావి కొండలరావుగారు. ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ రెండు చిత్రాలకు ఆయన సంభాషణల రచయిత కూడా. సింగీతంగారి దర్శకత్వంలో వచ్చిన ఆ రెండు సినిమాలకు రావి కొండలరావుగారి ప్రోద్బలంతో నేను ఆయనకు అసిస్టెంట్ రైటర్‌గా పని చేయడం నా కెరీక్‌కి గొప్ప బలం. పదిహేను రోజుల క్రితం వెళ్లినప్పుడు ‘నేనో కథ చెప్తాను సినిమాకి, నాకు అసిస్టెంట్‌గా వచ్చి, నేను డిక్టేట్ చేసింది రాస్తావా, డైరెక్టర్ అయిపోయాను కదా, రాయనంటావా’ అనడిగారు. నేను నవ్వి, ‘ఆ అమృతం ఆస్వాదించే అవకాశం నేనింకొకడికి ఎందుకిస్తాను అంకుల్. నేను రోజూ వచ్చి, మీకు అసిస్ట్ చేస్తాను’ అన్నాను. ఇంతలోనే ఇలా... రావి కొండలరావుగారి ప్రతి రచనా తెలుగు సాహిత్య యవనికపై ఒక అమృత ధారగా సజీవంగా ఉంటుంది. ఆయన సినిమాలు, నటన తెలుగు జాతి ఉన్నంతకాలం అమృతంలా మనని అలరిస్తూనే ఉంటాయి. మృత్యువు నుంచి అమృతత్వానికి రావి కొండలరావుగారి కొత్త ప్రయాణం మొదలైందనే భావిస్తాను నేను. ఆయన ప్రోత్సాహాన్ని మరువలేను – ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత రాంభట్ల నృసింహ శర్మ రావి కొండలరావుగారితో నాది ఇరవయ్యేళ్ల పైబడిన సాంస్కృతిక ప్రయాణం. 2000సంవత్సరంలో ‘విశాఖ హ్యూమర్ క్లబ్’ స్థాపన, నిర్వహణలో, యాడ్స్ ఫర్ యూ పత్రికలో కాలమిస్ట్‌గా వారు నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేను. ‘కన్యాశుల్కం’ టెలీఫిల్మ్ ధారావాహిక శీర్షిక గీతం రచనకు ఇచ్చిన అవకాశం వల్లే నాకు ఉత్తమ గీత రచయితగా ‘నంది పురస్కారం’ లభించింది. ఆయన నాకు తండ్రిలాంటి వారు – రచయిత–దర్శకుడు వర ముళ్లపూడి ‘‘నేను చిన్నప్పటి నుండి రావి కొండలరావుగారిని చూస్తూ పెరిగాను. ఆయన, రాధాకుమారి ఆంటీ మా ఇంటి మనుషుల్లానే ఉండేవారు. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మా నాన్న తర్వాత మరో తండ్రిలాంటివారాయన. ఈ ఏడాదితో ‘బాలరాజు కథ’ (బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావి కొండలరావు నటించారు) విడుదలై యాభై ఏళ్లయింది. అప్పుడు నేను ఆయన దగ్గర చిన్న వీడియో బైట్ కావాలని అడిగితే, బాపు, రమణ గార్ల గురించి రెండు గంటలు ఆపకుండా చెబుతాను.. నువ్వు రా అన్నారు. ఈ లోపు కోవిడ్ కారణంగా ఆటంకం వచ్చింది. ఆయనేమో పెద్దవారు, నేను అటూ ఇటూ తిరుగుతుంటాను. ఈ సమయంలో ఆయనేకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, ఎందుకులే అని తర్వాత కలుద్దాం అనుకున్నాను. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయనతో ఆ ఇంటర్వ్యూ చేసినా బావుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మంచి మనిషి. చెన్నైలో వాళ్లబ్బాయి ఇంట్లో ఆయన ఉండేవారు. అప్పుడు వెళ్లి ఆయన్ని అనేక సార్లు కలవటం జరిగింది. నాకు, బాపుగారబ్బాయికి ఫాదర్ ఫిగర్‌లా అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మాతో. బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయనకు ఎక్స్లెంట్ సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. స్పాంటేనియస్‌గా జోకులు పేల్చేవారు. ‘పెళ్లి పుస్తకం’ సినిమా టైమ్‌లో నాన్న, బాపుగారు, కొండలరావుగారు.. ముగ్గురూ ఒకచోట కూర్చుని వర్క్ చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఆ సినిమా కథ ఈయనదే. ఆయనతో నాకెన్నో మంచి అనుభూతులు ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ గొప్ప చరిత్ర తెలిసిన మనిషి ఈ రోజుతో కనుమరుగయ్యారు. -
టాలీవుడ్ : సీనియర్ నటుడు కన్నుమూత
-
టాలీవుడ్లో విషాదం : సీనియర్ నటుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు మంగళవారం కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్టుగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. కాగా, 1958లో శోభ చిత్రంలో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తేనె మనసులు, దసరా బుల్లోడు, భైరవ ద్వీపం, రంగూన్ రౌడీ, చంటబ్బాయ్, పెళ్లి పుస్తకం, మేడమ్, రాధాగోపాలం, మీ శ్రేయాభిలాషి, వరుడు, కింగ్, ఓయ్.. వంటి చిత్రాల్లో ఆయన నటించారు. 600కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. తమిళ, మలయాళ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. కాగా, కొండలరావు భార్య, ప్రముఖ నటి రాధా కుమారి 2012లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విభిన్న పాత్రల్లో కనిపించిన ఆమె.. దాదాపు 600లకు పైగా చిత్రాలు చేశారు. వీరిద్దరు జంటగా కూడా పలు చిత్రాల్లో నటించారు. రావి కొండలరావు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
నా వీపు మీద బాదుడే బాదుడు
రాజమండ్రి : ‘ఒరే గాడిదా-ఎక్కడెక్కడ తిరుతున్నావురా’ ఇదీ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుతో నేను నటించిన తొలి సినిమాలో, షూటింగ్ ప్రారంభం రోజున చెప్పవలసిన తొలి డైలాగు’ అని రావి కొండలరావు గత జ్ఞాపకాల్లోకి జారుకున్నారు. ఆయన స్వీయచరిత్ర ‘నాగావళి నుంచి మంజీరా’ ఆవిష్కరణకు నగరానికి వచ్చిన సందర్భంగా రావి కొండలరావు తన రంగస్థల, సినీ నటనానుభవాలను, పాత్రికేయ అనుభవాలను, బాపు-రమణతో తన అనుబంధం ఆయన మాట ల్లోనే.... 1965లో ప్రేమించి చూడు సినిమాలో నేను అక్కినేనికి తండ్రిగా నటిస్తున్నా. సెట్‌పై గుమ్మడి, రేలంగి, జగ్గయ్య, అక్కినేని వంటి హేమాహేమీలు ఉన్నారు. పి.పుల్లయ్య దర్శకుడు. నాకు కంగారు. డైలాగు పెదవి దాటి రావడం లేదు. దర్శకుడు పుల్లయ్య అపర అగ్నిహోత్రావధానులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికే అక్కినేని అగ్ర హీరో. నేను చిన్న ఆర్టిస్టును. ఇంతలో నన్ను అక్కినేని పిలిచారు. ఆలస్యం దేనికన్నారు. నా సందిగ్ధం ఆయన అర్ధం చేసుకున్నారు. ‘రావి కొండలరావు అక్కినేనిని తిట్టడం లేదు, ఒక తండ్రి కొడుకును తిడుతున్నాడు, కమాన్, గెట్ రెడీ’ అని ఆయన నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. కొన్నేళ్ల తర్వాత ఆయన హైదరాబాద్ రవీంద్రభారతిలో నా చేతికి స్వర్ణకంకణం తొడిగిన సందర్భంలో, వేదికపై సహనటులను అక్కినేని ఎంతగానో ప్రోత్సహించేవారని మరోసారి చెప్పా. ఇప్పటికి సుమారు 500 సినిమాల వరకు చేసి ఉంటాను. మహానటుడు ఎన్టీ రామారావుతో నేను నటించిర శోభ నా తొలి చిత్రం. తిక్క డాక్టరును. వస్తూనే ఎవరు పేషెంటు అని అడిగి, జవాబు వచ్చేలోగా, ఎన్టీఆర్ గుండెలపై స్టెతస్కోప్‌తో పరీక్షలు చేయడం ప్రారంభించే తమాషా పాత్ర. తెలుగు సినిమా స్వర్ణయుగం అనిపించుకుంటున్న రోజుల్లో నేను పరిశ్రమలో ప్రవేశించాను. ఇప్పుడు తెలుగు సినిమా బండరాతియుగంగా మారిపోయింది. ఇప్పటి నాకు-సినిమాకు తేడా ఏమిటంటే, నేను దిగజారలేదు. పాత్రికేయం..సాహిత్యం నా పదహారో ఏట, ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయా. పత్రికల కార్యాలయాలు, స్టూడియోలు నా విహార భూములు.. ఆనందవాణి, విజయచిత్ర, జ్యోతి పత్రికల్లో సంపాదకత్వ బాధ్యతలు వహించా. జ్యోతి మాసపత్రికలో నాతో పాటు నండూరి రామమోహనరావు, ముళ్ళపూడి వెంకట రమణ, బాపు, వి.ఎ.కె.రంగారావు సంపాదక వర్గంలో ఉండేవారు. నాటితో పోలిస్తే పత్రికారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ భాష స్థాయి దిగజారిపోవడం బాధాకరం. ఒక ప్రముఖ దినపత్రికలో ‘చచ్చిన శవానికి పంచనామా’ అని రాసారు. చచ్చిన శవం ఏమిటి నా బొంద? అలాగే, గర్భిణి స్త్రీలు అని రాస్తున్నారు. గర్భిణి పురుషులు కూడా ఉంటారా? నాకు అవధానాలంటే కూడా ఇష్టం. మేడసాని మోహన్, గరికిపాటి నరసింహారావు, రాళ్ళబండి కవితాప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ వంటి అవధాన దిగ్గజాలు పాల్గొన్న అవధానాలలో, నేను అప్రస్తుత ప్రసంగాలు నిర్వహించేవాడిని. ఆకాశవాణిలో నా నాటికలు వంద ప్రసారమయ్యాయి. ఇదో రికార్డు. నేను రాసిన కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం(దేశవ్యాప్తంగా 50 ప్రదర్శనలు) విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 1960లో రాధాకుమారితో నా పెళ్లరుుంది. ఇద్దరం కలిసి సినిమాల్లో, నాటకాల్లో నటించేవాళ్ళం. మద్రాసులో కాలు మోపినప్పటినుంచి బాపు-రమణలతో నాకు ప్రగాఢ సాన్నిహిత్యం ఉండేది. నా ‘నాగావళి నుంచి మంజీరా వరకు’ పుస్తకాన్ని ‘బాపు-రమణ’కు అంకితం ఇచ్చా. డీటీపీ ఆపరేటర్ నేను తప్పు రాసాననుకుని బాపు రమణలకు అని మార్చాడు. నేను ఆ తప్పును సరిదిద్ది, ‘బాపురమణ’కి అంకితం అని ఉంచాను. రాజమండ్రితో, గోదావరితో నాకు ఎంతో అనుబంధం, నా సినిమాలు చాలా భాగం ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. గత పుష్కరాలలో ప్రభుత్వం మా చేత నాటకాలు వేయించింది. హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావును నేను రాజమండ్రిలోనే కలుసుకున్నా. నా జీవన ప్రస్థానం తెలుగు సినిమా పుట్టిన 1932లో నేను సామర్లకోటలో పుట్టాను. తండ్రి పోస్టల్ శాఖలో ఉద్యోగి. బదిలీల మీద అలా శ్రీకాకుళం చేరుకున్నాం. నాటకాలంటే చిన్నప్పటినుంచి సరదా. నాటకం పిచ్చి ముదిరిన రోజులు-ఓ సాయంకాలం మిత్రులతో కలిసి నాటకం వేస్తున్నాం. నేను మా అమ్మచీరె కట్టుకుని స్త్రీ పాత్ర పోషిస్తున్నా. స్టేజి మీద డ్యాన్సు తెగ చేసేస్తున్నా. సైడ్ వింగ్ నుంచి మా నాన్న ప్రవేశించారు. కొత్త పాత్ర వచ్చిందని జనం అనుకుంటున్నారు. ఆ ‘కొత్త పాత్ర’ రావడం- నా విగ్గు లాగి పడేయడం రెప్పపాటులో జరిగిపోయాయి. నా వీపు మీద బాదుడే బాదుడు, నేను పరుగో పరుగు. -
అంజలీదేవి ఆత్మకథ
‘‘అంజలీదేవి ఆత్మకథను సకాలం పూర్తచేయలేకపోవడం బాధిస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా తన కథకు పుస్తకరూపం కల్పించడానికి నాతో కలిసి అంజలి ఎంతో కృషి చేశారు. ఈ పుస్తక యజ్ఞం పూర్తి కాకముందే అర్ధాంతరంగా ఆమె తనువు చాలించడం దురదృష్టకరం’’ అని రావికొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంజలితో కలిసి గత కొన్ని రోజులుగా అంజలి ఆత్మకథ రాసే పనిలో నిమగ్నమై ఉన్నాయాన. ఈ పుస్తకం వివరాలను ఆయన విలేకరులతో వెలిబుచ్చారు. ‘‘ఇది అంజలీదేవి ఆత్మకథ. ఇందులో ఏ మాత్రం సందేహం అనవసరం. ఆమె అనుభవాల్ని, ఆలోచనల్ని ఆమె సాక్షిగా రాసిన పుస్తకం ఇది. దీనికి పుస్తకరూపం కల్పించడం మాత్రమే నా పాత్ర’’ అని తెలిపారు రావి. మరికొన్ని విశేషాలు చెబుతూ -‘‘తన జీవితంలో చోటు చేసుకున్న ఉత్థాన పతనాలను, వ్యక్తిగత విషయాలను ఈ పుస్తకం కోసం స్వయంగా వెల్లడించారు అంజలి. ఆమె జీవితంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితుల్లో చిత్ర రంగానికి చెందిన వ్యక్తుల వాటా చాలా ఉంది. ఆ విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. అంజలీదేవి కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తాను’’ అని తెలిపారు. ఇంకా పుస్తకానికి పేరు ఖారారు కాలేదని.. త్వరలోనే మంచి పేరును ఫైనలైజ్ చేస్తామన్నారు ఈ సందర్భంగా రావి కొండలరావు వెల్లడించారు.