పన్నాల నరసింహమూర్తితో రావికొండలరావు (ఫైల్)
సింగీతం శ్రీనివాసరావు జానపదం అంటే ‘భైరవ ద్వీపం’ అని రాసిచ్చేశారు. మిస్సమ్మను చూసి తనివి తీరకుంటే ‘పెళ్లి పుస్తకం’ రాసి బాపూరమణలను ఆశ్చర్యపరిచారు. గురజాడ వారి కన్యాశుల్కాన్ని బుల్లితెరపైకి అలవోకగా తీసుకువచ్చారు. తూకం చెడకుండా హాస్యాన్ని రాసి, రక్తి కట్టించగలనని నిరూపించుకున్నారు. నాటకాల్లో ఆడ పాత్రలు వేయడానికంటూ విజయనగరం అమ్మాయిని వివాహం చేసుకుని ఆదర్శ దాంపత్యం అంటే ఏంటో చూపించారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అంత పెద్ద సినీ కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఇన్ని ఘనతలు సాధించిన రావి కొండలరావు సిక్కోలు గుండెలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీకాకుళంలోనే ఆయన బాల్యం గడిచింది.
శ్రీకాకుళం కల్చరల్: ప్రముఖ రంగస్థల, సినీ, టీవీ నటులు, దర్శకులు, రచయిత, పాత్రికేయులు రావి కొండలరావు మృతిపై సిక్కోలు కళాకారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రావి కొండలరావు కుటుంబం శ్రీకాకుళంలోని పాండురంగవీధిలో నివాసముండేది. ఆయన సామర్లకోటలో జన్మించినా శ్రీకాకుళంతోనే అనుబంధం ఎక్కువ. కాకినాడలో ప్రాథమికంగా చదివినా ఆ తర్వాత శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు సాహిత్యంపై మక్కువ కలిగింది. నాటకాలపై ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 1956లో సుకుమార్ ఆర్కెస్ట్రాను మిత్రబృందంతో స్థాపించారు.
మద్రాసు వైపు పయనం..
ఆ తర్వాత ఆయనకు మద్రాసు మీద గాలి మళ్లింది. చేతిలో విద్య ఉండడంతో అవకాశాలు వెతుక్కుంటూ మద్రాసులో వాలిపోయారు. రాత మీద మక్కువతో మొదట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభ, జ్యోతి, రచన, యువ, ఉదయం, విపుల మొదలైన పత్రికల్లో రచనలు చేశారు. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్‌ఎడిటర్‌గానూ పనిచేశారు. సుకుమార్ అనే కలం పేరుతో కొన్ని రచనలు చేశారు. అనురాగం, అభిప్రాయం, అభిమాన పుస్తకం, తదితర కథలు రాశారు. నీతి చంద్రిక, హ్యూమరథం(రెండు భాగాలు), మల్లీశ్వరి(సినీనవల), బ్లాక్ అండ్ వైట్, నాటికలు, కథలు నాగావళి నుంచి మంజీరా వరకు రచించారు. ఆ క్రమంలోనే సినిమా వాళ్లతో పరిచయాలు పెరిగాయి. ముఖ్యంగా ఆదుర్తి వారికి, విజ యా సంస్థలకు ఆయన ఇష్టుడిగా మారిపోయారు. బాపూరమణల మిత్రధ్వయానికి కూడా కుడి భుజంగా వ్యవహరించేవారు. సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుడికి బృందావనం, భైరవ ద్వీపం వంటి సినిమాలను రాసిచ్చారు. అయితే చాలా సినిమాలకు ఆయన ఘోస్ట్ రైటర్‌గానే పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వం తామ్ర నంది పురస్కారం 2004లో అందించింది. అ.జో.వి.భో కందాళం ఫౌండేషన్ వారు జీవత సాఫల్య పురస్కారం ఇచ్చారు.
కళాకారుల సంతాపం
రావి కొండలరావు గుండెపోటుతో మృతి చెందడంతో సిక్కోలు కళాకారులు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. శ్రీసుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తు చిన్నారావు, సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రావికొండలరావు మరణం నాటకరంగానికి తీరని లోటని శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతినిధులు పన్నాల నరసింహమూర్తి, చిట్టి వెంకటరావు, ఎల్.రామలింగస్వామి, బీఏ మోహనరావు, కలగ గణేష్, రామచంద్రదేవ్, వసంతకుమార్ తదితరులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అలాగే ఉపనిషత్ మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, కార్యదర్శి విశ్వనాథం కామేశ్వరరావు, సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment