విజయాల గమనంలో విరామాలే ఉంటాయి... ముగింపు కాదు.. అన్న సూక్తిని అక్షరాలా ఒంట పట్టించుకున్న ఉత్సాహవంతుడతడు. వైవిధ్యమే ఊపిరిగా, సృజనే ప్రాణంగా పరుగులు తీస్తున్న నిత్య చైతన్యవంతుడతడు. అందుకే అచిరకాలంలోనే అన్ని సంచలనాలు సాధించాడు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో సినీ వినీలాకాశంలో ఇలా వెలుగుతున్నాడు. ఏ మాత్రం సంబంధం లేని రంగం నుంచి చలనచిత్ర రంగానికి వచ్చి.. కొత్త ‘ధన’మే పెట్టుబడిగా వరుస హిట్లు కొట్టి.. విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సమ్మోహితులను చేస్తున్న ఆ దర్శక మాంత్రికుడు మారుతి కాక ఇంకెవరవుతారు? సూర్యనారాయణ స్వామి దర్శనానికి అరసవల్లి వచ్చిన ఈ నవ్యుత్సాహ సృజనాత్మక కళాకారుడు.. తన అంతరంగంలో ఆలోచనలను వివరించాడు.
సాక్షి, అరసవల్లి: ‘ప్రతి మనిషి ఏదో లక్ష్యం పెట్టుకుని పనిచేస్తాడు.. నేనైతే ప్రత్యేకంగా టార్గెట్ అంటూ ఏమీ పెట్టుకోను.. ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే అది సాధించాక అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది.. అలాంటి టైప్ కాదు నేను..’అంటూ వైవిధ్యమైన ముచ్చట్లను పంచుకున్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆదివారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదిత్యున్ని దర్శించుకుని అరుణహోమాన్ని చేసిన అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....
సాక్షి: సినిమా రంగంలో తొలి అడుగులు ఎలా..?
మారుతి: నిజంగానే ఊహించలేదు. మా ఊరు మచిలీపట్నంలో స్టిక్కరింగ్ ఆర్ట్స్ పనులు చేస్తూ ఉండేవాడిని. యానిమేషన్ వరŠుక్స నేర్చుకున్నాను. అదే అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంలో నేను చేసిన లోగో, పార్టీ జెండా తయారీ పనుల సమయంలో చిరంజీవితో పరిచయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన స్ఫూర్తితోనే అడుగులు వేశాను.
దర్శకుడు మారుతికి ఆదిత్యుని చిత్రపటాన్ని అందజేస్తున్న ప్రధాన అర్చకులు శంకరశర్మ
చిన్న సినిమాలతోనే పెద్ద దర్శకుడిగా ఎదగడంపై...?
మొదట్లో చిన్న సినిమాలనే చేశాను. ఫస్ట్ సినిమాగా బస్‌స్టాప్ తీశాను. తర్వాత ఈ రోజుల్లో.. కొత్తజంట, ప్రేమకథా చిత్రమ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, బాబు బంగారం, భలేభలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే...తదితర చిత్రాలు చేశాను. దాదాపుగా అన్ని చిత్రాలు సక్సెస్ అయ్యాయి. భలేభలే మగాడివోయ్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలు కమర్షియల్‌గా భారీ కలెక్షన్లు తెచ్చాయి.
ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించడంపై...
నేను తీయబోయే సినిమా కథ.. ఫస్ట్ నాలో ఉన్న ఆడియన్‌ను సంతృప్తి పరిస్తేనే సినిమా తీస్తాను. నేను తీసిన ఒక్కో సినిమా ద్వారా నేను కూడా ఎదుగుతున్నాననే భావన నాలో కలగాలనేలా సినిమా చేస్తాను. మంచి కిక్ ఇచ్చే సబ్జెక్టుల కోసం ట్రై చేస్తుంటాను. అందుకే సినిమా సినిమాకు వైవిధ్యం కనిపించేలా జాగ్రత్త తీసుకుంటాను. ప్రేమ కథా చిత్రమ్‌తో హర్రర్ కామెడీ.. తాతామనమడు అనుబంధంతో ప్రతి రోజూ పండుగే.. మతిమరుపు లవ్‌స్టోరీగా భలేభలేమగాడివోయ్.. కామెడీ యూత్ లవ్ స్టోరీలుగా ఈరోజుల్లో, బస్‌స్టాప్.. కామెడీ పోలీస్‌గా బాబు బంగారం తదితర సినిమాలు తీశాను. ప్రేక్షక దేవుళ్లకు ‘మారుతి’ సినిమా అంటే గుర్తుపట్టే స్థాయికి చేరడం నిజంగా సంతృప్తిగా ఉంది.
బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతున్నారని తెలిసింది..
కరోనా కారణంగా ఈ విషయంలో కాస్త జాప్యం జరిగింది. వాస్తవానికి నా సినిమాలు భలేభలేమగాడివోయ్, ప్రతిరోజూ పండుగే...చిత్రాలను హిందీలో రీమేక్ చేయడానికి అడుగుతున్నారు. నటీనటులను ఎంపిక చేసి త్వరలోనే డైరక్ట్ చేస్తాను.. ఇటీవల బ్లాక్‌బ్లస్టర్ అయిన మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయి పెద్ద సక్సెస్ అయి టాలీవుడ్ పవరేంటో చూపించాయి.
మహానుభావుడు సినిమాలో చేతుల ‘నీట్‌నెస్’ కాన్సెప్ట్.. కరోనా టైంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది కదా..
అనుకోకుండా అలా మ్యాచ్ అయ్యింది. 2017లో రిలీజ్ అయిన మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్ క్యారక్టర్ అంతా నీట్‌నెస్, శానిటైజర్లు వినియోగం, పరిసరాలన్నీ హైజనిక్‌గా ఉండే కాన్సెప్ట్‌ను చూపించాను. అనుకోకుండా కరోనా వైరస్ నివారణలో భాగంగా మనమంతా శానిటైజర్లను వినియోగించాం. ఇదంతా..యాదృచ్ఛికమే.
ఆదిత్యుని దర్శనంపై..?
ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు ఇక్కడే కొలువవ్వడం ఇక్కడివాళ్ల అదృష్టం. ఏ రంగంలోనైనా ఆటుపోటులు ఎదురైతే..అరసవల్లి రావడం పరిపాటిగా మారింది. ఎప్పటినుంచో అనుకున్నాను..అందుకే ఇక్కడ కుటుంబసమేతంగా అరుణహోమాన్ని జరిపించుకుని స్వామికి మొక్కు చెల్లించుకున్నాను. సినిమా దర్శకుడు కాకముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఆరోగ్య అద్భుత క్షేత్రంగా అరసవల్లి అభివృద్ధి చెందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment