నా వీపు మీద బాదుడే బాదుడు | Raavi kondala rao interview with sakshi | Sakshi
Sakshi News home page

నా వీపు మీద బాదుడే బాదుడు

Published Sun, May 3 2015 1:14 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నా వీపు మీద బాదుడే బాదుడు - Sakshi

నా వీపు మీద బాదుడే బాదుడు

రాజమండ్రి : ‘ఒరే గాడిదా-ఎక్కడెక్కడ తిరుతున్నావురా’ ఇదీ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుతో నేను నటించిన తొలి సినిమాలో, షూటింగ్ ప్రారంభం రోజున చెప్పవలసిన తొలి డైలాగు’ అని రావి కొండలరావు గత జ్ఞాపకాల్లోకి జారుకున్నారు. ఆయన స్వీయచరిత్ర ‘నాగావళి నుంచి మంజీరా’ ఆవిష్కరణకు నగరానికి వచ్చిన సందర్భంగా రావి కొండలరావు తన రంగస్థల, సినీ నటనానుభవాలను, పాత్రికేయ అనుభవాలను, బాపు-రమణతో తన అనుబంధం ఆయన మాట ల్లోనే.... 1965లో ప్రేమించి చూడు సినిమాలో నేను అక్కినేనికి తండ్రిగా నటిస్తున్నా. సెట్‌పై గుమ్మడి, రేలంగి, జగ్గయ్య, అక్కినేని వంటి హేమాహేమీలు ఉన్నారు.
 
 పి.పుల్లయ్య దర్శకుడు. నాకు కంగారు. డైలాగు పెదవి దాటి రావడం లేదు. దర్శకుడు పుల్లయ్య అపర అగ్నిహోత్రావధానులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికే అక్కినేని అగ్ర హీరో. నేను చిన్న ఆర్టిస్టును. ఇంతలో నన్ను అక్కినేని పిలిచారు. ఆలస్యం దేనికన్నారు. నా సందిగ్ధం ఆయన అర్ధం చేసుకున్నారు. ‘రావి కొండలరావు అక్కినేనిని తిట్టడం లేదు, ఒక తండ్రి కొడుకును తిడుతున్నాడు, కమాన్, గెట్ రెడీ’ అని ఆయన నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు.
 
 కొన్నేళ్ల తర్వాత ఆయన హైదరాబాద్ రవీంద్రభారతిలో నా చేతికి స్వర్ణకంకణం తొడిగిన సందర్భంలో, వేదికపై సహనటులను అక్కినేని ఎంతగానో ప్రోత్సహించేవారని మరోసారి చెప్పా. ఇప్పటికి సుమారు 500 సినిమాల వరకు చేసి ఉంటాను. మహానటుడు ఎన్టీ రామారావుతో నేను నటించిర శోభ నా తొలి చిత్రం.
 
 తిక్క డాక్టరును. వస్తూనే ఎవరు పేషెంటు అని అడిగి, జవాబు వచ్చేలోగా, ఎన్టీఆర్ గుండెలపై స్టెతస్కోప్‌తో పరీక్షలు చేయడం ప్రారంభించే తమాషా పాత్ర. తెలుగు సినిమా స్వర్ణయుగం అనిపించుకుంటున్న రోజుల్లో నేను పరిశ్రమలో ప్రవేశించాను. ఇప్పుడు తెలుగు సినిమా బండరాతియుగంగా మారిపోయింది. ఇప్పటి నాకు-సినిమాకు తేడా ఏమిటంటే, నేను దిగజారలేదు.
 
 పాత్రికేయం..సాహిత్యం
 నా పదహారో ఏట, ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయా. పత్రికల కార్యాలయాలు, స్టూడియోలు నా విహార భూములు.. ఆనందవాణి, విజయచిత్ర, జ్యోతి పత్రికల్లో సంపాదకత్వ బాధ్యతలు వహించా. జ్యోతి మాసపత్రికలో నాతో పాటు నండూరి రామమోహనరావు, ముళ్ళపూడి వెంకట రమణ, బాపు, వి.ఎ.కె.రంగారావు సంపాదక వర్గంలో ఉండేవారు. నాటితో పోలిస్తే పత్రికారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ భాష స్థాయి దిగజారిపోవడం బాధాకరం. ఒక ప్రముఖ దినపత్రికలో ‘చచ్చిన శవానికి పంచనామా’ అని రాసారు.
 
 చచ్చిన శవం ఏమిటి నా బొంద? అలాగే, గర్భిణి స్త్రీలు అని రాస్తున్నారు. గర్భిణి పురుషులు కూడా ఉంటారా? నాకు అవధానాలంటే కూడా ఇష్టం. మేడసాని మోహన్, గరికిపాటి నరసింహారావు, రాళ్ళబండి కవితాప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ వంటి అవధాన దిగ్గజాలు పాల్గొన్న అవధానాలలో, నేను అప్రస్తుత ప్రసంగాలు నిర్వహించేవాడిని. ఆకాశవాణిలో నా నాటికలు వంద ప్రసారమయ్యాయి.
 ఇదో రికార్డు. నేను రాసిన కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం(దేశవ్యాప్తంగా 50 ప్రదర్శనలు) విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
 
 1960లో రాధాకుమారితో నా పెళ్లరుుంది. ఇద్దరం కలిసి సినిమాల్లో, నాటకాల్లో నటించేవాళ్ళం. మద్రాసులో కాలు మోపినప్పటినుంచి బాపు-రమణలతో నాకు ప్రగాఢ సాన్నిహిత్యం ఉండేది. నా ‘నాగావళి నుంచి మంజీరా వరకు’ పుస్తకాన్ని ‘బాపు-రమణ’కు అంకితం ఇచ్చా. డీటీపీ ఆపరేటర్ నేను తప్పు రాసాననుకుని బాపు రమణలకు అని మార్చాడు.
 
 నేను ఆ తప్పును సరిదిద్ది, ‘బాపురమణ’కి అంకితం అని ఉంచాను. రాజమండ్రితో, గోదావరితో నాకు ఎంతో అనుబంధం, నా సినిమాలు చాలా భాగం ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. గత పుష్కరాలలో ప్రభుత్వం మా చేత నాటకాలు వేయించింది.  హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావును నేను రాజమండ్రిలోనే కలుసుకున్నా.
 
 
 నా జీవన ప్రస్థానం
 తెలుగు సినిమా పుట్టిన 1932లో నేను సామర్లకోటలో పుట్టాను. తండ్రి పోస్టల్ శాఖలో ఉద్యోగి. బదిలీల మీద అలా శ్రీకాకుళం చేరుకున్నాం. నాటకాలంటే చిన్నప్పటినుంచి సరదా. నాటకం పిచ్చి ముదిరిన రోజులు-ఓ సాయంకాలం మిత్రులతో కలిసి నాటకం వేస్తున్నాం.
 
 నేను మా అమ్మచీరె కట్టుకుని స్త్రీ పాత్ర పోషిస్తున్నా. స్టేజి మీద డ్యాన్సు తెగ చేసేస్తున్నా. సైడ్ వింగ్ నుంచి మా నాన్న ప్రవేశించారు. కొత్త పాత్ర వచ్చిందని జనం అనుకుంటున్నారు. ఆ ‘కొత్త పాత్ర’ రావడం- నా విగ్గు లాగి పడేయడం రెప్పపాటులో జరిగిపోయాయి. నా వీపు మీద బాదుడే బాదుడు, నేను పరుగో పరుగు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement