ఐటీ టీమ్‌ల గ్రేట్ డ్రామా
దుమ్మురేపిన బారాత్
బడాబాబులు బేజారు
రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్‌తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్‌ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ!
ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్‌లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్‌టైల్ మిల్‌ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్‌హౌసెస్‌ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్‌కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్‌మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్‌కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్‌హౌసెస్‌ను అంగుళం అంగుళం గాలించారు.
అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్‌కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్‌లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్‌లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్‌లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు.
మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్‌కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్‌కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ రెయిడ్‌కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్‌మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్‌గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్‌కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment