త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ దేవి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులై త్రిమూర్తల కన్నా పూర్వం నుంచి జగన్మాత ఉంది కాబట్టి త్రిపుర సుందరీ అనే నామంతో పూజలందుకుంటోందని పురాణాలు చెబుతున్నాయి.
సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి.
మరోవైపు శ్రీశైలం, అల్లంపురం వంటి పుణ్యక్షేత్రాల్లో నాలుగో రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ నవరాత్రుల్లో కూష్మాండ అవతారంలో అమ్మని ఆరాధిస్తే అపూర్వ శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. దేవీ సింహంపై ఆశీనురాలై వుంటుంది. ఎనిమిది చేతులను కలిగివుంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి, నిధిని ప్రసాదిస్తుంది.
అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. లలితా దేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ఉపవాసముండి, పండ్లు పాలు తీసుకుని, ఒంటి పూట ఆహారం తీసుకుని.. లలితాదేవి పూజించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
నైవేద్యం: అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి.
(చదవండి: దుర్గార్తిశమనీ దశదిశలా దసరా)
Comments
Please login to add a commentAdd a comment