పునరుత్థానమే సమాధానం | Easter Festival Special Story | Sakshi
Sakshi News home page

పునరుత్థానమే సమాధానం

Published Sun, Apr 9 2023 8:28 AM | Last Updated on Sun, Apr 9 2023 8:39 AM

Easter Festival Special Story - Sakshi

‘మరణమున్‌ జయించి లేచెన్‌ మన ప్రభువు నేడు. 
మహిమ దేహమొనర దాల్చెను. 
ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవ వరములియ్య వసుధపైని’

ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్‌ పండుగను జరుపుకొంటున్నారు. యేసు మరణించి మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగిలేచాడు. క్రైస్తవులంతా పాడుకొనే ఓ అద్భుతమైన పాట ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. ‘మరణమున్‌ జయించి లేచెన్‌ మన ప్రభువు నేడు. మహిమ దేహమొనర దాల్చెను. ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్ని తీర్చి జీవ వరములియ్య వసుధపైని’.

శుభ శుక్రవారం రోజున ఝెరూషలేము లోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన యేడు మాటలు సిలువలో పలికి తన ఆత్మను అప్పగించారు. క్రీస్తు మరణము శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాది మంది రోమన్‌ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసును విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆ కాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసు ప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుంచి రక్తము, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.

ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహం నుంచి నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు ధ్రువీకరించారు. క్రీస్తు సిలువపై మరణించి నప్పుడు అనేక అద్భుతాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటిలో ప్రాముఖ్యమైనది దేవాలయపు తెర చిరిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని, అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారు చేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుషులెవ్వరూ చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే ఆ తెర పైనుంచి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. 

యేసుప్రభువు చనిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం అరిమితయి యోసేపు అనే వ్యక్తి పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడుగుతాడు. యోసేపు యూదుల న్యాయసభలోని సభ్యుడు. సుమారు 70 మంది పెద్దలు ఆ సభలో ఉంటారు. యోసేపు తన కోసం ఒక చక్కని రాతితో తొలిపించుకున్న సమాధిని సిద్ధపరచుకున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడయిన నికోదేముతో కలిసి యేసుప్రభువు దేహాన్ని సిద్ధపరచి సమాధిలో ఆ దేహాన్ని ఉంచుతారు. ఒక రాయి పొర్లించి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోమన్‌ సైనికులు ఆ సమాధికి కావలిగా ఉన్నారు. దానికి కారణం యూదా పెద్దలలో కొందరు యేసు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచెదనని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని పటిష్ఠమెన కావలిని ఉంచారు. వారంతా యేసు పునరుత్థానమును అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ అది నెరవేరలేదు. ఆయన చెప్పినట్లే మరణమును జయించి మూడవ దినమున పునరుత్థానుడైనాడు.  

ప్రపంచంలో చాలామంది ఈరోజుకి చనిపోయి సమాధిలో పరిమితమయ్యారు గాని ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారు. బైబిల్‌ గ్రంథాన్ని పరిశీలిస్తే క్రీస్తు పునరుత్థానం చెందినరోజు సమాధి ముందున్న రాయి పక్కకు తొలగించబడింది. రాయి తొలగించబడకుండా క్రీస్తు బయటకు రాలేడా? అనే ప్రశ్న కొందరికి ఉండవచ్చు. రాయి ఉన్నా యేసు బయటకు రాగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు గనుక. పీటర్‌ మారల్‌ అనే దైవజనుడు ఈ విషయాన్ని గూర్చి ఓ చక్కని వ్యాఖ్యానం చేశాడు. ‘ఆయన బయటకు రావడానికి అక్కడ ఉన్న రాయి దొర్లించబడలేదు గాని, మనము ఆయన సమాధిలోనికి వెళ్లి చూడ్డానికి ఆ రాయి పక్కకు తొలిగించబడింది’. నేటికి ఝెరూషలేములోని క్రీస్తు సమాధి తెరువబడి ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు. సమాధి లోపల ఓ దివ్యమైన సందేశం ఉంటుంది. ‘ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచియున్నాడు’ (మత్తయి 28:6). యేసుప్రభువు ఖాళీ సమాధి క్రైస్తవుల విశ్వాసానికి ఒక బలమైన పునాది. సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఈనాడు అనేకులు క్రీస్తును ప్రభువుగా విశ్వసిస్తున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయనలోని దైవత్వము మానవాళికి ప్రత్యక్షపరచబడింది. 

ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాధినేతలు, చక్రవర్తులు, మా మాటకు తిరుగులేదు, మా శాసనాలకు ఎదురులేదు అనుకున్న చాలామంది నేటికీ సమాధిలోనే ఉన్నారు. ఎందరో కవులు, ధనికులు మృత్యువు ముందు తలవంచారు.  

విలియం లేన్‌ క్రేగ్‌ ఇలా అంటాడు. ‘పునరుత్థానమునందు నమ్మకము లేకుంటే క్రైస్తవ విశ్వాసము ఉనికిలోకి వచ్చియుండెడిది కాదు. శిష్యులు యేసును వారి ప్రియతమ నాయకునిగా జ్ఞాపకముంచుకోదలచినను, సిలువ మరణము ఆయనను మెస్సీయగా ఉంచుకోవడము విషయములో వారి ఆశలను నిర్వీర్యం చేసియుండేది. సిలువ ఆయన జీవిత ప్రధాన గమనమును దుఃఖ సహితముగను, అవమానకరముగను ముగించి యుండేది. గనుక క్రైస్తవ పుట్టుక యేసుక్రీస్తు మృత్యువు నుంచి లేచియున్నాడనే విశ్వాసం మీద ఆధారపడియున్నది’.

యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా? అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశములోని ట్యురిన్‌ నగరంలో ఉన్న ట్యురిన్‌ వస్త్రము నిలువెత్తు జవాబుగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యములు పూసిన నారబట్ట చుడతారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని దానిమీద విస్తృత పరిశోధనలు చేశారు. ఈనాటికీ ఇటలీలోని ట్యూరిన్‌ నగరంలో ఈ వస్త్రం క్రీస్తు మరణ పునరుత్థానాలకు సాక్ష్యంగా ఉంది. ఈ ట్యురిన్‌ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్‌ గాస్పెల్‌’ అని కూడా పిలుస్తారు.  

క్రీస్తు పునరుత్థానము గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. లేవీయ కాండము పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు లక్షణాలు ఆ పక్షులలో మనకు కనబడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంత వరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్నుతాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే ఆరోగ్య నిబంధన ఉండేది. కొంతకాలానికి ఆ వ్యక్తికి కుçష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే, దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనపరచుకోవాలి. ఒకవేళ రోగి దేహమును పరిశీలించి, అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు.

తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుంచి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు సజీవమైన పక్షులను తీసుకు రావాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి. అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంప బడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణానికి సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల కలిగిందని విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.

అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. దేవుని దివ్య దర్శనం అతనికి కలిగింది. మొదటి శతాబ్దంలో అతడు చూసిన, విన్న విషయాలను గ్రంథçస్థం చేశాడు. అదే బైబిల్‌లోని చిట్టచివరి గ్రంథం ‘ప్రకటన గ్రంథం’. 

ఆ పెద్దలలో ఒకడు ‘ఏడవకుము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను’ (ప్రకటన 5:5). ‘వధించబడిన గొఱె<పిల్ల నిలువబడింది’ అనే మాట ఈ వచనంలో కనబడుతుంది. ఆ వధింబడిన గొఱె<పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. మానవుడు ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాడు. పాపము మనిషికి శాపాన్ని తెచ్చింది. దేవునితో ఎడబాటును తెచ్చింది. మానవుడు పాపము నుంచి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, చేస్తున్నాడు కూడా. పాప క్షమాపణ నిమిత్తం జంతుబలిని నిర్వహించేవారు. జంతువుల రక్తము ప్రోక్షించడం ద్వారా మానవుని పాపములు తొలగించబడి దేవుని  నీతిని పొందుకుంటారని మనషులు నమ్మేవారు. ఆ తర్వాత నరబలులు ప్రారంభమయ్యాయి. అయితే జంతువులను వధించి వాటి రక్తము చిందించడం ద్వారా, పసిపిల్లలను చంపి వారి రక్తాన్ని ఒలికించడం ద్వారా పాపక్షమాపణ కలుగదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది.

బాప్తిస్మమిచ్చు క్రీస్తును గూర్చి ‘ఇదిగో లోకపాపమును మోసుకునిపోయే దేవుని గొఱె<పిల్ల’ అని ప్రకటించాడు. అపొస్తలుడైన యోహాను పరలోకంలో చూసిన గొఱె<పిల్ల సర్వమానవాళి పాపక్షమాపణ కొరకు వధించబడిన పవిత్రుడైన యేసుప్రభువే! యోహాను చూసిన ఆ గొఱె< వధించబడినప్పటికీ మరలా లేచి నిలువబడియుంది. ఆ నిలువబడడమే క్రీస్తు పునరుత్థానము. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది.

ఇంతవరకు మానవాళి మీద పంజాలు విసిరిన మరణం మచ్చుకైనా మిగలకుండా మరణమై పోయింది. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడైంది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శరీర కోరికలు, పాపపు యిచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా, చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్‌ మోరిసన్‌ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు.

అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. 

క్రీస్తు పునరుత్థానం దేవుని మాటలు సత్యమని నిరూపించాయి. సర్వశక్తుడైన దేవుడు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, అబద్ధాలను ప్రోత్సహించలేదు. దేవుడు సత్యం చెప్పి గాయపరచడానికి అయినా ఇష్టపడతాడు గాని, అబద్ధం చెప్పి సంతోషపరచాలని చూడడు. ‘సత్యము’ దేవునికి ఉండవలసిన ప్రధాన లక్షణం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి దైవత్వమును ఋజువు చేశారు (యోహాను 14:6). కృపావాత్సల్యం కలిగిన దేవుడు అబద్ధమాడువాడు కాదు. దేవుడు సత్యవంతుడు గనుక ఆయనను ఆరాధించేవారందరూ సత్యవంతులై యుండాలని ఆయన కోరుచున్నాడు.     

క్రీస్తు ప్రభువు సజీవునిగా ప్రజల మధ్య సంచరిస్తున్నపుడు అనేకసార్లు తాను మృతిపొంది తిరిగిలేవడం నిశ్చయముగా జరుగుతుందని చెప్పారు. చాలామంది ఆ మాటలను విశ్వసించలేదు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను (యోహాను 2:19). ఈ మాట పలికినపుడు అనేకులు ఆయన మాటలు అర్థం చేసుకోలేక భౌతికమైన దేవాలయం కోసం మాట్లాడుతున్నారని భ్రమపడినారు. ఎంతో వైభవంగా నిర్మించబడిన దేవాలయం ఝెరూషలేములో ఉంది. హేరోదు మహారాజు దానిని సుందరమైనదిగా తీర్చిదిద్దాడు. అంత గొప్ప దేవాలయాన్ని పడగొడితే కేవలం మూడు రోజుల్లో ఎలా లేపగలడని సందేహించారు. అయితే క్రీస్తు తన దేహాన్ని గూర్చి ఆ మాట చెప్పారని వారికి అర్థం కాలేదు. దేవుని ఆలయమును, చక్రవర్తిని అవమానించి దూషించుచున్నాడని అనేకులు ఆయన మీద నెపములు మోపారు. ఎన్నో అబద్ధపు సాక్ష్యములు ఆయన మీది మోపి చివరకు సిలువకు అప్పగించారు. 

క్రీస్తును తీర్పు తీర్చుచున్న సమయంలో పిలాతు ‘నీవు యూదులకు రాజువా?’ అని అడుగగా, ‘అవును నీవన్నట్టే’ అని బదులిచ్చెను. కాదని సమాధానమిస్తే బహుశా సిలువ మరణం తప్పియుండేది. మరణం ఎదురుగా ఉన్నను మాట మార్చని, అబద్ధం చెప్పని నైజం క్రీస్తుది. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుందని ప్రభువు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు మరణం నుంచి తిరిగిలేవడం ద్వారా ఆయన సత్యవంతుడు అనే విషయం చాలా స్పష్టంగా నిరూపితమైంది. ఆయన యందు విశ్వాసముంచువారి విషయంలో కూడా ఆయన తన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఆయన ఎన్నడూ తనయందు నమ్మిక యుంచిన వానిని వంచించేవాడు కాదు. 

క్రీస్తు పునరుత్థానం మనిషిలోని భయాలను తొలగించింది. నేటిదినాల్లో ప్రతి మనిషి ఎన్నో భయాల మధ్య జీవిస్తున్నాడు. మనిషిని పట్టి పీడిస్తున్న భయములలో మరణ భయం అతి భయంకరమైనది. ఎంతోమంది గొప్పవారమని చెప్పుకున్నారు కానీ మరణమునకు తలొగ్గినారు. అలాంటివారు మరణభయంతో ఉన్నవారిని ఎలా విడిపించగలరు? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా మరణమును ఓడించారు. ‘మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయమెక్కడ?’ అని సవాలు విసిరిన విజేత ప్రభువైన యేసు క్రీస్తు. పాపానికి ఉన్న బలము మరణమైతే యేసుప్రభువు పాపము నుంచి మనుషులను విడిపించడానికి సిలువలో రక్తం కార్చారు. ఆ రక్తంతో ఎవరైతే తమ జీవితాలు కడుక్కున్నారో వారు మరణ భయం నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. ప్రభువునందు విశ్వాసముంచిన వారు మరణమునకు భయపడరు. ప్రభువు శిష్యులు ఒకప్పుడు మరణానికి భయపడిపోయారు. యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచిన తరువాత శిష్యుల్లో ఒక గొప్ప మార్పు, ధైర్యము వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకమంది హతసాక్షులుగా తమ ప్రాణాలు విడిచిపెట్టారు. 

అది 2021 జనవరి 23. అప్పటి వరకు సందడిగా ఉన్న కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరం ఒక వార్తతో నిశ్శబ్దమై పోయింది. తన జీవిత కాలంలో ఎందరో గొప్పవారిని ఇంటర్వ్యూ చేసిన టెలివిజన్‌ హోస్ట్‌ ల్యారీకింగ్‌ చనిపోయిన రోజు. ల్యారీ కింగ్‌ తన వృత్తి జీవితంలో 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నపుడు ఒక వ్యక్తి అతన్ని ఇలా ప్రశ్నించింది. ‘ప్రపంచంలో మీరు చాలా సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌. మీకు చాలా జ్ఞానం ఉంది, పేరు ఉంది. ఇన్ని సాధించిన మీరు దేనికైనా భయపడుతున్నారా?’ దానికి ల్యారీకింగ్‌ ఇచ్చిన సమాధానం ‘మరణమంటే నాకు భయం. ప్రతిరోజు నా మరణాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉంటాను’. అతడిచ్చిన సమాధానానికి ప్రపంచం నివ్వెరపోయింది. అవును! మరణం ప్రతి ఒక్కరినీ భయపెడుతూనే ఉంది.

నేను యెహోవాయొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించెను (కీర్తన 34:4). మానవునికి ఉన్న భయములెన్నైనను వాటిని ప్రభువు సన్నిధిలో చెప్పుకుంటే వాటిని నుంచి ప్రభువు విడిపిస్తాడు. యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేవడం ద్వారా మనిషిలో గూడుకట్టుకుపోయిన ప్రతి భయమును విడిపించి ధైర్యముగా జీవించడానికి ఆధారం కలుగజేశాడు. బైబిలు గ్రంథమునందు ‘భయపడకుము’ అనే మాట అనేకసార్లు వ్రాయబడింది. ప్రతిరోజు ప్రభువు మానవాళికి ఇచ్చే వాగ్దానం ‘భయపడకుము’. 

క్రీస్తు పునరుత్థానము మనిషికి అనిర్వచనీయ సమాధానాన్ని అనుగ్రహించింది. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడిన తరువాత ఆయన శిష్యులు యూదా పెద్దలకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసి లోపల ఉండిపోయారు. యేసు పునరుత్థానుడైన సాయంత్రం మహిమ దేహాన్ని ధరించుకొని వారికి ప్రత్యక్షమయ్యారు. ఆయన వారి మధ్యకు రాగానే వారందరూ మొదటిగా భయపడ్డారు. ప్రభువైన యేసు వారికి సమాధానాన్ని ప్రకటించి వారిని ధైర్యపరచారు. అంతవరకు వారి హృదయంలో సమాధానం లేదు. నిజమైన సమాధానము జ్ఞానం వలన, డబ్బు వలన, పేరు ప్రఖ్యాతుల వలన, ఐశ్వర్య ఘనతల వలన లభించేది కాదు. అది కేవలం సమాధానకర్తయైన దేవుని వలన మాత్రమే లభిస్తుంది. దేవుడు అనుగ్రహించే సమాధానం సమస్త జ్ఞానమునకు మించినది. అది మన హృదయానికి కావలి ఉండి మనలను కాపాడుతుంది. 

నేటి సమాజంలో చాలామంది ఎన్నో భౌతికమైనవి సంపాదించుకున్నప్పటికీ నిజమైన సమాధానం లేకపోవడం ద్వారా ఆత్మహత్య తలంపులతో నలిగిపోతున్నారు. సమాజంలో గొప్ప వ్యక్తులు, డబ్బున్నవారు హృదయంలో సమాధానం లేక విషాద పరిస్థితులలో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించు కుంటున్నారు. లోకంలో చాలామంది రాజులు, చక్రవర్తులు యుద్ధాలు చేసి, రాజ్యాలను కొల్లగొట్టి తమ స్థానములను సుస్థిరము చేసుకోవాలనుకున్నారు. ప్రభువైన యేసు మాత్రము ఈ లోకానికి యుద్ధాలు చేయడానికి, రక్తపుటేరులు పారించి తన రాజ్యమును ఈ భూమి మీద నెలకొల్పడానికి రాలేదు. మనుషుల హృదయాలలో శాంతి, సమాధానములను ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన మరణ పునరుత్థానములతో అనేక జీవితాలను పావనపరిచారు. 

క్రీస్తు పునరుత్థాన శక్తిని తన జీవితంలోనికి ఆహ్వానించిన జాన్‌ గెడ్డి అనే మిషనరీ అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. జాన్‌ గెడ్డి 1815 ఏప్రిల్‌ 10న స్కాట్లాండ్‌లో జన్మించాడు. అతని తండ్రి గడియారాలను తయారు చేసేవాడు. స్కాట్లాండ్‌లోని ప్రెస్బిటేరియన్‌ చర్చిలో సభ్యునిగా కొనసాగెడివారు. 1816లో జాన్‌గెడ్డికి ఒక సంవత్సరం వయస్సులో కెనడాకు వలస వెళ్ళిపోయారు. అతడు పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత వేదాంత విద్యను అభ్యసించాడు. ఆ దినాల్లో జాన్‌ గెడ్డి కొన్ని వ్యాధులకు గురయ్యాడు. వాటి నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ విడుదల లభించలేదు. ఒకరోజు వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు.

‘ఓ దేవా నన్ను స్వస్థపరచి నీ శక్తితో నింపినచో నా జీవితకాలమంతా మిషనరీ సేవలో కొనసాగుతా!’ అంటూ తీర్మానం చేసుకున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించువాడు గనుక జాన్‌ గెడ్డిని పూర్తిగా స్వస్థపరచాడు. యువకుడైన జాన్‌ గెడ్డి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించుటయే కాకుండా తన జీవితాన్ని దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకున్నాడు. తన భక్తిని, ప్రార్థనా జీవితమును గమనించిన పెద్దలు జాన్‌గెడ్డిని 1838 మార్చి 13న ఒక సంఘంలో సేవ చేయుటకు పాçస్టరుగా అభిషేకించారు. తనకు అప్పగించబడిన సేవను భక్తిపూర్వకంగా చేపట్టాడు. భార్య దొరికినవానికి మేలు దొరికెను అన్నట్లుగా 1839వ సంవత్సరంలో విశ్వాసంలో పటిష్ఠస్థాయిలో ఉన్న చార్లెట్‌ మెక్‌నాల్డ్‌ అనే భక్తిగల యువతిని పెండ్లి చేసుకున్నాడు. తర్వాత ఓ ఎనిమిది సంవత్సరాలకు తన తీర్మానాన్ని పెద్దలకు తెలిపాడు. ‘సువార్త లేని స్థలాల్లో సువార్తను ప్రకటించడానికి తీర్మానించుకొని యున్నాను’ అని. దేవుని సేవకులు, పెద్దలు ప్రార్థించి జాన్‌ గెడ్డిని ‘న్యూ హెబ్రిడెస్‌’ దీవులకు పంపించారు. ఆ దీవుల్లోని ప్రజలు నరమాంస భక్షకులు. అలాంటివారికి దేవుని ప్రేమను తెలియజేసి వారిని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి నడుం బిగించాడు. జాన్‌  గెడ్డి ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాల తదుపరి న్యూహెబ్రిడెన్‌ దీవుల్లోని అనేయిత్యూవ్‌ు ప్రాంతంలో తన మిషన్‌ స్థాపించాడు. 1860వ సంవత్సరంలో ఆ ప్రాంతాల్లో భయంకరమైన ‘తట్టు’ అంటువ్యాధి బయలుదేరి అనేకమందిని కబళించింది. జాన్‌గెడ్డి విశ్వాసంతో ఆ ప్రజల కోసం ప్రార్థించుట వలన వారిలో చాలామంది స్వçస్థపరచబడి దేవుని అంగీకరించారు. జాన్‌ గెడ్డి ఆధ్యాత్మిక విషయాలు బోధించుటతో పాటు జీవన సూత్రాలు బోధించేవాడు. ఆ దీవుల్లో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. 

యేసుక్రీస్తు మార్చలేని వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. సహృదయంతో ఎవ్వరైతే ప్రభువును, ఆయన బోధనలను స్వీకరిస్తారో వారు కచ్చితంగా మార్పు చెందుతారు. ఒకప్పుడు నరమాంసభక్షకులుగా, అజ్ఞానులుగా ఉన్న ప్రజలను వెలిగించి వారిని చైతన్యపరచి, సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన ఘనత జాన్‌ గెడ్డికి చెందుతుంది. 1860వ సంవత్సరంలో ఆ దీవుల్లోని ‘అనెల్‌కాహట్‌’ ప్రాంతంలో ఒక పెద్ద చర్చి నిర్మించాడు. కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే గాక బైబిల్‌ను వారి భాషలోకి అనువదించాడు జాన్‌ గెడ్డి. వారి భాష నేర్చుకొని, వ్యాకరణాన్ని వ్రాసి, ఇంగ్లీషులో ఉన్న నూతన నిబంధనను అనువదించి ఆస్ట్రేలియాలో ముద్రించి, తిరిగి తీసుకొని వచ్చి అక్కడి ప్రజలకు అందించాడు. చెక్కుచెదరని విశ్వాసంతో, సువార్త ప్రకటననే జీవితాశయంగా చేసుకొన్న జాన్‌ గెడ్డి న్యూహెబ్రిడిస్‌ దీవుల రూపురేఖల్నే మార్చివేశాడు. జాన్‌ గెడ్డి ఆ ద్వీపానికి వెళ్ళేటప్పటికి ఒక్క క్రైస్తవుడు కూడా లేడు.

అతడు 20 సంవత్సరాలు సేవ చేసి అక్కడే మరణించాడు. అతని సమాధిమీద ఇలా వ్రాయబడింది. ‘జాన్‌ గెడ్డి నరమాంస భక్షకుల మధ్య దైవ చిత్తాన్ని నెరవేర్చిన ధీరుడు, అచంచల విశ్వాసంతో ప్రభువుపై ప్రతి విషయంలోనూ ఆధారపడిన విశ్వాస వీరుడు. ఎన్నో శ్రమలు, కఠినమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికి పరమందు కలుగబోవు బహుమానముపై దృష్టి నిలిపి దేవుని సేవలో కొనసాగిన క్రీస్తు యోధుడు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అనే దేవుని మాటను నెరవేర్చి నేటి తరానికి మాదిరిగా నిలిచిన ఉత్తమ సేవకుడు.’ రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తీసుకురాలేని మార్పును మిషనరీలు తీసుకొచ్చారు అనుటకు నిలువెత్తు ఉదాహరణ జాన్‌ గెడ్డి.

బన్యన్‌ జోసెఫ్‌ వ్రాసిన పాట ప్రతి క్రైస్తవునికి సుపరిచితమే. ‘యేసు లేచెను, యేసు లేచెను. సమాధిపై రాతిన్‌ స్వామి దూతలిద్దరు సమముగ దీయను స్వామి లేచెను. మృతులలో సజీవున్‌ వెదకుట యేలనని దూతలు వారితో తెల్ప’ క్రీస్తు పునరుత్థానము మనిషిలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చిందనుటలో సందేహము లేదు. తాను వాగ్దానము చేసినట్టుగానే క్రీస్తు మరణాన్ని జయించి అనేకమందికి అగుపడి వారి జీవితాలను వెలుగుమయం చేశాడు. పునరుత్థానుడైన క్రీస్తు ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందాన్ని అనుగ్రహించి మహిమైశ్వర్యంతో నింపును గాక. 
సాక్షి పాఠకులకు ఈస్టరు శుభాకాంక్షలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement