ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులందరిలోనూ వైకల్యాలు తెచ్చిపెట్టడంలో లేదా మరణానికి దారితీసే అంశాల్లో పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ప్రధానమైంది. అయితే అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం పురుషులతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. దీనికి గల అనేక కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల హార్మోన్లలో మార్పులు రావడం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. అవి...
మహిళల్లో తరచూ హార్మోన్లలో మార్పులు రావడం మామూలే. దీంతోపాటు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల వల్ల కూడా వాళ్లలో తరచూ హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ హార్మోన్ల మార్పులే పురుషులతో పోలిస్తే మహిళల్లో పక్షవాతం ఎక్కువగా వచ్చేందుకు కారణమవుతుంటాయి.
ఇటీవల మానవులందరిలోనూ ఆయుఃప్రమాణాలు బాగా పెరిగాయి. ఇలా చాలాకాలం జీవిçస్తున్న క్రమంలో హైబీపీ, దాంతోపాటు అనేక రకాల గుండె జబ్బుల (ఉదాహరణకు గుండె స్పందనలు దెబ్బతినడం వల్ల వచ్చే గుండెదడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె పైగదుల స్పందనల్లో వేగం పెరగడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టి అవి ప్రధాన ధమనుల ద్వారా మెదడుకు చేరడం) వంటి కారణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంటాయి.
గర్భనివారణ మాత్రలు వాడేవాళ్లలో పొగతాగే అలవాటు ఉండటం స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో రక్తపోటు బాగా పెరిగి΄ోయే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును పెంచుతుంది.
పురుషులతో పోలిస్తే పక్షవాతం వచ్చినప్పుడు లేదా రాబోయే ముందు కనిపించే సాధారణ లక్షణాలైన తీవ్రమైన అలసట, అయోమయం, వికారం లేదా వాంతుల వంటి లక్షణాలు మహిళల్లో అంత ప్రస్ఫుటంగా కనిపించవు. దాంతో సమస్యను గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం వంటివి ఆలస్యమయ్యేందుకు అవకాశాలెక్కువ.
ఇక పక్షవాతంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలైన... మాటలు ముద్దముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు కిందికి జారినట్లుగా అయిపోవడం వంటివి స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినప్పటికీ మహిళలల్లో ఈ లక్షణాలన్నీ తలతిరిగినట్లు ఉండటం, తీవ్రమైన అలసట, ఎక్కిళ్ల వంటి మాటున అంత స్పష్టంగా కనిపించవు.
అయితే ఇలా తల తిరిగినట్లుగా ఉండటం, తీవ్రమైన అలసట, నీరసం వంటివి మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించేవే కావడంతో ఈ లక్షణాల మాటున పక్షవాతం దాగుండిపోయినట్లుగా అవుతుంది. దాంతో మహిళల్లో చాలాసేపటికి గాని పక్షవాతాన్ని గుర్తించడం సాధ్యపడకపోవడంతో అసలు విషయం బయటపడేసరికి ఆలస్యమయ్యే ప్రమాదం ఎక్కువ.
మహిళల చికిత్స విషయంలో మరింత ప్రాధాన్యం అవసరం..
పక్షవాతం (స్ట్రోక్) విషయంలో పురుషులకూ, మహిళలకూ ఇచ్చే చికిత్స అన్నివిధాలా సమానమే. అయితే కోలుకున్న తర్వాత వారి పనులు వారే చేసుకునే విధంగా ఇచ్చే రిహ్యాబిలిటేషన్ ్ర΄ోగ్రామ్ విషయంలో మాత్రం మహిళలపై మరింత శ్రద్ధ చూ΄ాల్సిన అవసరముంటుంది. ఎందుకంటే వారి రీ–హ్యాబ్, వారిలో తరచూ పునరావృతమయ్యే డిప్రెషన్, నైపుణ్యాలు నేర్చుకునే (కాగ్నిటివ్ స్కిల్స్) ప్రక్రియలు ఆలస్యం కావడం, మానసిక ఆరోగ్యం అన్ని విధాలా బాగుపడేలా చేయడం వంటి అంశాలన్నీ... మహిళలకు రీ–హ్యాబ్ సేవలు మరింత ఎక్కువకాలం అవసరమయ్యేలా చేస్తాయంటున్నారు నిపుణులు.
నివారణ మార్గాలు అనుసరించండి...
హైబీపీని అదుపులో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం, ఆహారంలో కొవ్వులు తక్కువగా తీసుకోవడం, ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వాటిని అదుపు చేసే మందులు వాడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తోపాటు సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళలు, గర్భధారణ సమయంలో ప్రీ–ఎక్లాంప్సియా వచ్చిన వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం, అవసరాన్ని బట్టి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) వంటి చర్యలతో నివారణ మార్గాలు అనుసరిస్తుంటే అది స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment