ట్రావెలింగ్‌ టీచర్‌ | Family Special Story About Manna Abraham From Trivandrum | Sakshi
Sakshi News home page

ట్రావెలింగ్‌ టీచర్‌

Published Sat, Nov 21 2020 4:48 AM | Last Updated on Sat, Nov 21 2020 5:06 AM

Family Special Story About Manna Abraham From Trivandrum - Sakshi

భారతదేశం నుంచి బహుశా ఆమె ఒక్కర్తే ఈ బిరుదుకు అర్హురాలు. త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం కువైట్‌లో టీచరుగా పని చేస్తూ అమెరికాకు వెళ్లి 2004లో  ప్రపంచంలో అతి పెద్దదైన రింగ్‌లింగ్‌ బ్రదర్స్‌ సర్కస్‌లో  ‘ట్రావెలింగ్‌ టీచర్‌’గా చేరారు. సొంత విలాసవంతమైన ట్రైన్‌ కలిగిన ఆ సర్కస్‌ అమెరికా అంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఆ రైలులో కేటాయించిన  ఒక గదిలో ఉంటూ 8 ఏళ్లు మన్నా అబ్రహం సర్కస్‌ పిల్లలకు పాఠాలు చెప్పారు. చెన్నైలో స్థిరపడిన మన్నా ఇటీవల తన జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో రాయడంతో అందరూ ఆమెను వెతుకుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన టీచర్‌ పరిచయం ఇది.

కాలు కుదురుగా ఉండని లక్షణం మన్నాకు లాభించింది. ఆమె ఎలాగైతే లోకాన్ని చుడుతూ ఉండాలని కోరుకున్నారో అలాగే చుట్టే అవకాశం దొరికింది. ఒక భారతీయ మహిళ అమెరికాలో ప్రఖ్యాత సర్కస్‌ కంపెనీలో 8 ఏళ్ల పాటు ఉండి, వారితో పాటు తిరుగుతూ, వారి పిల్లలకు పాఠాలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. పెద్ద ఘనత. ఆ ఘనతను సాధించిన వ్యక్తి మన్నా అబ్రహం. ఇటీవల ఆమె తన అనుభవాలను ఒక సోషల్‌ మీడియా గ్రూప్‌లో పంచుకోవడంతో అవి వైరల్‌ అయ్యాయి. అందరూ ఆ అనుభవాల కోసం చెవి ఒగ్గుతున్నారు.

పేపర్‌ ప్రకటన చూసి
త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం మొదట చెన్నైలో ఆ తర్వాత కువైట్‌లో టీచర్‌ గా పని చేశారు. అయితే అక్కడ కూడా ఉండలేకపోవడంతో 2001లో అమెరికా వెళ్లారు. అక్కడ పాఠాలు చెబుతూ ఉండగా ఒక ప్రకటన ఆమె దృష్టికి వచ్చింది. ‘ఒక సర్కస్‌ కంపెనీకి ట్రావెలింగ్‌ టీచర్‌ కావాలి’ అని ఉంది అందులో. అయితే తర్వాత తెలిసింది ఆ సర్కస్‌ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్‌లింగ్‌ బ్రదర్స్‌ కంపెనీ అని. ‘మొత్తం మీద సర్కస్‌లో పని అని అప్లై చేశాను’ అని గుర్తు చేసుకున్నారు మన్నా అబ్రహం.

అమెరికన్‌ విద్యా చట్టాల ప్రకారం సంచార ఉపాధిలో ఉండే బృందాల పిల్లలకు కూడా తప్పనిసరిగా విద్య అందాలి. అందువల్ల సర్కస్‌లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌ కావాలి. అలా మన్నాకు టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ‘నేను చేరింది 2004లో. అప్పుడు నా వయసు 41. నేను పాఠాలు చెప్పాల్సింది సర్కస్‌లో పని చేసే కళాకారుల పిల్లలు లేదా సర్కస్‌లో ప్రదర్శనలు ఇచ్చే పిల్లలు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్ట్‌లు చెప్పమన్నారు. ఒప్పుకున్నాను’ అన్నారామె. 

రైలు జీవితం
రింగ్‌లింగ్‌ బ్రదర్స్‌ చాలా భారీ సర్కస్‌. చాలా డబ్బున్న సర్కస్‌. అందులో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో పాటు రకరకాల పనులు చేసే వందల కొద్ది కళాకారులు ఉండేవారు. వారిని, జంతువులను, సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి సర్కస్‌ కంపెనీ సొంతంగా ఒక విలాసవంతమైన రైలును కొనుక్కుంది. ‘దాని పొడవు ఒక మైలు ఉండేది’ అన్నారు మన్నా నవ్వుతూ. సర్కస్‌ యజమాని, మేనేజర్లు, కళాకారులు అందరూ దాదాపు అందులోనే జీవితం గడిపేవారు. ‘నాకు ఒక చిన్న గది రైలులోనే ఇచ్చారు. అందులో ఒక అటాచ్డ్‌ బాత్‌రూమ్‌. కిచెన్‌ ఉండేవి. నేను భారతీయ వంటకాలు చేసుకు తినేదాన్ని. వాటి కోసం వివిధ దేశాల కళాకారులు నా రూమ్‌కు వచ్చేవారు’ అంటారు మన్నా. 

27 దేశాల జాతీయలు
‘సర్కస్‌ అంటే ప్రపంచ దేశాల వారు నివశించే ఒక సంత. రింగ్‌లింగ్‌ బ్రదర్స్‌లో 27 దేశాల జాతీయులు ఉండేవారు. చైనా, బ్రెజిల్, రష్యా, చిలీ, కంబోడియా... అయితే అందరు పిల్లలకు ఇంగ్లిష్‌ బోధన భాషగా అర్థమయ్యేది కాదు. నేను ఇతర సీనియర్‌ విద్యార్థుల చేత వారితో మాట్లాడించి వారికి కొద్దో గొప్పో నా పాఠాలు అర్థమయ్యేలా చేసేదాన్ని. రైలు ఎక్కడ ఆగితే అక్కడ నాకు కేటాయించిన స్థలంలో ఆరుబయట క్లాసులు నిర్వహించేదాన్ని. రైలు వెళుతున్నప్పుడు పాఠాలు ప్లాన్‌ చేసుకునేదాన్ని. పిల్లల పుస్తకాలు, పరీక్ష పేపర్లు అన్నీ నా అజమాయిషీలోనే ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే విద్యాశాఖ అధికారులు మధ్య మధ్య ఇన్‌స్పెక్షన్‌కు ఊడిపడేవారు... క్లాసులు ఎలా జరుగుతున్నాయా అని’ అన్నారు మన్నా.

48 రాష్ట్రాలు
అమెరికాలో పుట్టి పెరిగిన వారు కూడా తమ జీవిత కాలంలో అమెరికా అంతా చూడరు. కాని మన్నా అబ్రహమ్‌ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో 48 రాష్ట్రాలు చుట్టేశారు. ‘మా రైలు వెళ్లని రాష్ట్రం లేదు’ అంటారామె. మంచు దిబ్బల మధ్య నుంచి, ఎడారి దారుల నుంచి రింగ్‌లింగ్‌ బ్రదర్స్‌ సర్కస్‌ రైలు ప్రయాణించింది. ‘మేము ఆగిన చోట ఉంచి తెలిసినవాళ్లో స్నేహితులో వచ్చి నాకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించేవారు.’ అన్నారామె.

వీడ్కోలు
వందేళ్ల క్రితం సర్కస్‌ మొదలైనప్పుడు దానికి ఉండే ప్రాభవం వందేళ్ల తర్వాత ఏ సర్కస్‌కూ లేదు. ఒక రకంగా మన్నా సర్కస్‌లపై చివరి ప్రభావం చూసినట్టు లెక్క. ఆమె రింగ్‌లింగ్స్‌లో 2004–2013 మధ్య పని చేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. 2017లో ఆ సుదీర్ఘ చరిత్ర ఉన్న సర్కస్‌ మూతపడింది.  ‘సర్కస్‌ ఒక వింత ప్రపంచం. అక్కడే పుట్టుకలు, చావులు, ప్రేమలు, గుండెకోతలు, కలయికలు, వీడ్కోళ్లు... ఎన్నో. అక్కడ ఉన్న 8 ఏళ్లు నేను ఎన్నో విలువైన అనుభవాలు మూటగట్టుకున్నాను. లోకం తిరగగా నాకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రతి మనిషి బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని. సర్కస్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అక్కడి ఏనుగుల గుంపు నన్ను కావలించుకొని సాగనంపాయి. అది మాత్రం మర్చిపోలేను’ అంటారామె. మన్నా అబ్రహమ్‌ తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన డాక్యుమెంటేషన్‌ అవుతుంది. ఆ పని చేస్తారని ఆశిద్దాం.
– సాక్షి ఫ్యామిలీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement