Trivandrum
-
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్‌పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్‌పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్‌లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ వలస కార్మికుడు ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి గోనుసంచిలో కుక్కిన ఘటన సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదేరోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్నాకుళం ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న ఓ జంట తమ కూతురు కనిపించడంలేదని శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాప కోసం గాలించగా మరో బృందం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. కొద్దిసేపు పరిశీలించిన తరవాత సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అందులో అదే ఇంటికి పై పోర్షన్లో ఉండే బీహార్ కు చెందిన అస్ఫాక్ అస్లామ్ పాపను శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం గమనించడం జరిగింది. వెంటనే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నాం. కానీ అతడు మద్యం మత్తులో పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నందున రాత్రంతా విచారించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్న అతడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అస్ఫాక్ అస్లామ్ చిన్నారిని తీసుకుని వెళ్తుండడం స్థానికంగా ఉన్న మరొక వ్యాపారి కూడా చూశానని చెప్పడంతో తమ అనుమానం నిజమైందని.. మా శైలిలో విచారణ జరిపించగా మద్యం మత్తులో బాలికపై అమానుషంగా బలాత్కారం చేసి, చంపి పక్కనే ఉన్న బురదలో పడేసి పైకి కనిపించకుండా గోనె సంచులను కప్పినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడన్నారు. బాలికను సజీవంగా ఇవ్వలేకపోతున్నందుకు ఆ కుటుంబానికి ఎస్పీ క్షమాపణ చెప్పారు. ఇది కూడా చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: గగన వీధుల్లో.. లోహ విహంగంలో కూర్చుని ఇష్టమైన ఆహారం భుజించడం ఎవరికైనా ఇష్టమే. అసలు విమాన ప్రయాణమే చేయనివారికైతే మరింత మధురానుభూతి. ఇలాంటి వారి కోసమే మన హైదరాబాదీలు సరికొత్త ఆలోచన చేశారు. ఆతిథ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. ఆకాశంలో చుక్కల నడుమ రాకపోకలు సాగించే విమానాన్ని నేలమీద పెట్టి.. దీనినే ‘స్టార్’ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా షెడ్డుకు వెళ్లిన విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ లైవ్ ఫ్లైట్ లోపలిభాగంలో మార్పులు, చేర్పులు చేసి.. రెస్టారెంట్‌గా మలచనున్నారు. ఆహార ప్రియులకు సరికొత్త ఆనుభూతిని మిగిల్చేలా.. దేశీయ, విదేశీ వంటకాలను వడ్డించనున్నారు. ఇప్పటివరకు కేవలం ఢిల్లీకి పరిమితమైన లైవ్ ఫ్లెయిన్ రెస్టారెంట్ త్వరలో సిటీజనులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగరవాసులకు హైదరాబాద్ స్టైల్ వంటకాల్లో పేరొందిన ‘పిస్తా హౌస్’ యాజమాన్యం.. ఈ రెస్టారెంట్‌ను త్వరలోనే నగర శివార్లలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా దీన్ని ప్రారంభించే అకాశముంది. కలల విమానంలో కడుపారా.. సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు. భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇక శామీర్‌పేట చెరువు అందాలను వీక్షిస్తూ.. నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకొని తింటుంటే ఈ మజానే వేరు. త్రివేండ్రంలో కొనుగోలు హోటల్రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న ప్రయోగాలు చేసే పిస్తా హౌస్ యజమాని మహ్మద్ అబ్దుల్ మజీద్ మదికి విమాన రెస్టారెంట్ ఆలోచన తట్టింది. ఇప్పటికే లైవ్ ఫ్లైట్ కాకుండా.. మోడల్ విమానాల్లో రెస్టారెంట్లు నడుస్తున్నా ఆయన ఆలోచన లైవ్ ఫ్లెయిన్పైనే పడింది. దీంతో చెడిపోయిన, ఫిట్నెస్ లేని విమానాల కోసం ఆయన విమానయాన సంస్థలను సంప్రదించారు. ఈ క్రమంలోనే కేరళ త్రివేండ్రంలో ఎయిర్ ఇండియా వద్ద ఎ– 320 ఉందని తెలిసింది. దీన్ని వేలం ద్వారా కొనుగోలు చేసి.. ఇక్కడకు చేరుస్తున్నారు. ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న ఈ లోహ విహంగం ఈ వారాంతానికి నగరానికి చేరుకోనుంది. ఈ విమానం కొనుగోలు, తరలింపు ఖర్చు రూ.కోటి. ఈ ఫ్లైట్‌ను సమూలంగా మార్చి లోపలిభాగంలో అధునాతన సీటింగ్, విమానంలోకి ప్రవేశించేందుకు ఎస్కలేటర్, విమానం ఆగిన ప్రదేశాన్ని రన్‌వే తరహాలో తీర్చిదిద్దనున్నారు. -
ట్రావెలింగ్ టీచర్
భారతదేశం నుంచి బహుశా ఆమె ఒక్కర్తే ఈ బిరుదుకు అర్హురాలు. త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం కువైట్‌లో టీచరుగా పని చేస్తూ అమెరికాకు వెళ్లి 2004లో ప్రపంచంలో అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్‌లో ‘ట్రావెలింగ్ టీచర్’గా చేరారు. సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగిన ఆ సర్కస్ అమెరికా అంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఆ రైలులో కేటాయించిన ఒక గదిలో ఉంటూ 8 ఏళ్లు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు. చెన్నైలో స్థిరపడిన మన్నా ఇటీవల తన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో రాయడంతో అందరూ ఆమెను వెతుకుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన టీచర్ పరిచయం ఇది. కాలు కుదురుగా ఉండని లక్షణం మన్నాకు లాభించింది. ఆమె ఎలాగైతే లోకాన్ని చుడుతూ ఉండాలని కోరుకున్నారో అలాగే చుట్టే అవకాశం దొరికింది. ఒక భారతీయ మహిళ అమెరికాలో ప్రఖ్యాత సర్కస్ కంపెనీలో 8 ఏళ్ల పాటు ఉండి, వారితో పాటు తిరుగుతూ, వారి పిల్లలకు పాఠాలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. పెద్ద ఘనత. ఆ ఘనతను సాధించిన వ్యక్తి మన్నా అబ్రహం. ఇటీవల ఆమె తన అనుభవాలను ఒక సోషల్ మీడియా గ్రూప్‌లో పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. అందరూ ఆ అనుభవాల కోసం చెవి ఒగ్గుతున్నారు. పేపర్ ప్రకటన చూసి త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం మొదట చెన్నైలో ఆ తర్వాత కువైట్‌లో టీచర్ గా పని చేశారు. అయితే అక్కడ కూడా ఉండలేకపోవడంతో 2001లో అమెరికా వెళ్లారు. అక్కడ పాఠాలు చెబుతూ ఉండగా ఒక ప్రకటన ఆమె దృష్టికి వచ్చింది. ‘ఒక సర్కస్ కంపెనీకి ట్రావెలింగ్ టీచర్ కావాలి’ అని ఉంది అందులో. అయితే తర్వాత తెలిసింది ఆ సర్కస్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ కంపెనీ అని. ‘మొత్తం మీద సర్కస్‌లో పని అని అప్లై చేశాను’ అని గుర్తు చేసుకున్నారు మన్నా అబ్రహం. అమెరికన్ విద్యా చట్టాల ప్రకారం సంచార ఉపాధిలో ఉండే బృందాల పిల్లలకు కూడా తప్పనిసరిగా విద్య అందాలి. అందువల్ల సర్కస్‌లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ కావాలి. అలా మన్నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ‘నేను చేరింది 2004లో. అప్పుడు నా వయసు 41. నేను పాఠాలు చెప్పాల్సింది సర్కస్‌లో పని చేసే కళాకారుల పిల్లలు లేదా సర్కస్‌లో ప్రదర్శనలు ఇచ్చే పిల్లలు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్ట్‌లు చెప్పమన్నారు. ఒప్పుకున్నాను’ అన్నారామె. రైలు జీవితం రింగ్లింగ్ బ్రదర్స్ చాలా భారీ సర్కస్. చాలా డబ్బున్న సర్కస్. అందులో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో పాటు రకరకాల పనులు చేసే వందల కొద్ది కళాకారులు ఉండేవారు. వారిని, జంతువులను, సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి సర్కస్ కంపెనీ సొంతంగా ఒక విలాసవంతమైన రైలును కొనుక్కుంది. ‘దాని పొడవు ఒక మైలు ఉండేది’ అన్నారు మన్నా నవ్వుతూ. సర్కస్ యజమాని, మేనేజర్లు, కళాకారులు అందరూ దాదాపు అందులోనే జీవితం గడిపేవారు. ‘నాకు ఒక చిన్న గది రైలులోనే ఇచ్చారు. అందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్. కిచెన్ ఉండేవి. నేను భారతీయ వంటకాలు చేసుకు తినేదాన్ని. వాటి కోసం వివిధ దేశాల కళాకారులు నా రూమ్‌కు వచ్చేవారు’ అంటారు మన్నా. 27 దేశాల జాతీయలు ‘సర్కస్ అంటే ప్రపంచ దేశాల వారు నివశించే ఒక సంత. రింగ్లింగ్ బ్రదర్స్‌లో 27 దేశాల జాతీయులు ఉండేవారు. చైనా, బ్రెజిల్, రష్యా, చిలీ, కంబోడియా... అయితే అందరు పిల్లలకు ఇంగ్లిష్ బోధన భాషగా అర్థమయ్యేది కాదు. నేను ఇతర సీనియర్ విద్యార్థుల చేత వారితో మాట్లాడించి వారికి కొద్దో గొప్పో నా పాఠాలు అర్థమయ్యేలా చేసేదాన్ని. రైలు ఎక్కడ ఆగితే అక్కడ నాకు కేటాయించిన స్థలంలో ఆరుబయట క్లాసులు నిర్వహించేదాన్ని. రైలు వెళుతున్నప్పుడు పాఠాలు ప్లాన్ చేసుకునేదాన్ని. పిల్లల పుస్తకాలు, పరీక్ష పేపర్లు అన్నీ నా అజమాయిషీలోనే ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే విద్యాశాఖ అధికారులు మధ్య మధ్య ఇన్స్పెక్షన్కు ఊడిపడేవారు... క్లాసులు ఎలా జరుగుతున్నాయా అని’ అన్నారు మన్నా. 48 రాష్ట్రాలు అమెరికాలో పుట్టి పెరిగిన వారు కూడా తమ జీవిత కాలంలో అమెరికా అంతా చూడరు. కాని మన్నా అబ్రహమ్ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో 48 రాష్ట్రాలు చుట్టేశారు. ‘మా రైలు వెళ్లని రాష్ట్రం లేదు’ అంటారామె. మంచు దిబ్బల మధ్య నుంచి, ఎడారి దారుల నుంచి రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్ రైలు ప్రయాణించింది. ‘మేము ఆగిన చోట ఉంచి తెలిసినవాళ్లో స్నేహితులో వచ్చి నాకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించేవారు.’ అన్నారామె. వీడ్కోలు వందేళ్ల క్రితం సర్కస్ మొదలైనప్పుడు దానికి ఉండే ప్రాభవం వందేళ్ల తర్వాత ఏ సర్కస్‌కూ లేదు. ఒక రకంగా మన్నా సర్కస్‌లపై చివరి ప్రభావం చూసినట్టు లెక్క. ఆమె రింగ్‌లింగ్స్‌లో 2004–2013 మధ్య పని చేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. 2017లో ఆ సుదీర్ఘ చరిత్ర ఉన్న సర్కస్ మూతపడింది. ‘సర్కస్ ఒక వింత ప్రపంచం. అక్కడే పుట్టుకలు, చావులు, ప్రేమలు, గుండెకోతలు, కలయికలు, వీడ్కోళ్లు... ఎన్నో. అక్కడ ఉన్న 8 ఏళ్లు నేను ఎన్నో విలువైన అనుభవాలు మూటగట్టుకున్నాను. లోకం తిరగగా నాకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రతి మనిషి బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని. సర్కస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అక్కడి ఏనుగుల గుంపు నన్ను కావలించుకొని సాగనంపాయి. అది మాత్రం మర్చిపోలేను’ అంటారామె. మన్నా అబ్రహమ్ తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన డాక్యుమెంటేషన్ అవుతుంది. ఆ పని చేస్తారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
విష్ణువర్ధన్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్ అండర్–19 బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. త్రివేండ్రంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో బాలుర డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్) ద్వయం 21–12, 21–14తో రవికృష్ణ–మానవ్‌రాజ్ సుమీత్ (కేరళ) జంటపై విజయం సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో విష్ణువర్ధన్ జంట ప్రత్యర్థి జోడీలకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో విష్ణువర్ధన్–ఇషాన్ 21–10, 21–16తో కీర్తి శశాంక్–లోకేశ్వరన్‌లపై; ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–12, 21–8తో రోహిత్ సింగ్–సుహాస్‌లపై; క్వార్టర్ ఫైనల్లో 21–9, 21–18తో కుష్ చుగ్–నితిన్‌లపై; సెమీఫైనల్లో 21–19, 21–16తో యష్ రైక్వార్–ఇమాన్ సోనోవాల్‌లపై విజయం సాధించారు. -
రైలు నుంచి టీటీఈ తోసివేత
టికెట్ లేని ప్రయాణికుల దుశ్చర్య బిజిగిరిషరీఫ్ వద్ద పట్టాలపై తీవ్రగాయాలతో గుర్తింపు హన్మకొండ ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం రామగుండం : త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి సోమవారం ప్రయాణికులు టీటీఈని తోసేశారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను గేట్మెన్ గుర్తించి ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. వరంగల్ జిల్లా కాజీపేట నివాసి అయిన విజయ్‌కుమార్ ట్రెయిన్ టికెట్ ఇన్స్పెక్టర్ (టీటీఈ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం కేరళసూపర్ ఫాస్ట్ఎక్స్ప్రెస్ (రైలు నంబరు:12625)లో వరంగల్‌లో ఆయన విధుల్లోకి చేరారు. వెనకవైపు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న జనరల్ బోగీలో ప్రయాణికుల టికెట్లు చెక్ చేస్తున్న క్రమంలో కొందరి వద్ద టికెట్ లేనట్లు గుర్తించారు. ముగ్గురి వద్ద టికెట్ లేదని నిర్ధారించుకుని డోర్ వద్ద నిలబడి వారిని ప్రశ్నించారు. పరస్పరం జరిగిన వాదులాటతో అతివేగంగా వెళ్తున్న రైలు నుంచి టీటీఈని సదరు ప్రయాణికులు బయట కు నెట్టేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగి నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా బిజిగిరిషరీఫ్ శివారులో పట్టాలపై రక్తపు మడుగులో ఉన్న టీటీఈని గేట్మెన్ గుర్తించి జమ్మికుంట రైల్వే అధికారులకు సమాచారమందించాడు. అంబులెన్స్‌లో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ విషయమై అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చినప్పటికీ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ కావడంతో అప్పటికే రైలు రామగుండం దాటిపోయింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌సింగ్ తెలిపారు.