రైలు నుంచి టీటీఈ తోసివేత | TTE of the train get out of the train without ticket of passengers | Sakshi
Sakshi News home page

రైలు నుంచి టీటీఈ తోసివేత

Published Tue, Jun 3 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

TTE of the train get out of the train without ticket of passengers

టికెట్ లేని ప్రయాణికుల దుశ్చర్య
 
బిజిగిరిషరీఫ్ వద్ద పట్టాలపై తీవ్రగాయాలతో గుర్తింపు
హన్మకొండ ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం

 
రామగుండం  : త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి సోమవారం ప్రయాణికులు టీటీఈని తోసేశారు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను గేట్‌మెన్ గుర్తించి ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. వరంగల్ జిల్లా కాజీపేట నివాసి అయిన విజయ్‌కుమార్ ట్రెయిన్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఈ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం కేరళసూపర్ ఫాస్ట్‌ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు:12625)లో వరంగల్‌లో ఆయన విధుల్లోకి చేరారు. వెనకవైపు ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న జనరల్ బోగీలో ప్రయాణికుల టికెట్లు చెక్ చేస్తున్న క్రమంలో కొందరి వద్ద టికెట్ లేనట్లు గుర్తించారు. ముగ్గురి వద్ద టికెట్ లేదని నిర్ధారించుకుని డోర్ వద్ద నిలబడి వారిని ప్రశ్నించారు.

పరస్పరం జరిగిన వాదులాటతో అతివేగంగా వెళ్తున్న రైలు నుంచి టీటీఈని సదరు ప్రయాణికులు బయట కు నెట్టేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగి నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా బిజిగిరిషరీఫ్ శివారులో పట్టాలపై రక్తపు మడుగులో ఉన్న టీటీఈని గేట్‌మెన్ గుర్తించి జమ్మికుంట రైల్వే అధికారులకు సమాచారమందించాడు. అంబులెన్స్‌లో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ విషయమై అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చినప్పటికీ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ కావడంతో అప్పటికే రైలు రామగుండం దాటిపోయింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌సింగ్ తెలిపారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement