సాక్షి, హైదరాబాద్: గగన వీధుల్లో.. లోహ విహంగంలో కూర్చుని ఇష్టమైన ఆహారం భుజించడం ఎవరికైనా ఇష్టమే. అసలు విమాన ప్రయాణమే చేయనివారికైతే మరింత మధురానుభూతి. ఇలాంటి వారి కోసమే మన హైదరాబాదీలు సరికొత్త ఆలోచన చేశారు. ఆతిథ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. ఆకాశంలో చుక్కల నడుమ రాకపోకలు సాగించే విమానాన్ని నేలమీద పెట్టి.. దీనినే ‘స్టార్’ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా షెడ్డుకు వెళ్లిన విమానాన్ని కొనుగోలు చేశారు.
ఈ లైవ్ ఫ్లైట్ లోపలిభాగంలో మార్పులు, చేర్పులు చేసి.. రెస్టారెంట్‌గా మలచనున్నారు. ఆహార ప్రియులకు సరికొత్త ఆనుభూతిని మిగిల్చేలా.. దేశీయ, విదేశీ వంటకాలను వడ్డించనున్నారు. ఇప్పటివరకు కేవలం ఢిల్లీకి పరిమితమైన లైవ్ ఫ్లెయిన్ రెస్టారెంట్ త్వరలో సిటీజనులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగరవాసులకు హైదరాబాద్ స్టైల్ వంటకాల్లో పేరొందిన ‘పిస్తా హౌస్’ యాజమాన్యం.. ఈ రెస్టారెంట్‌ను త్వరలోనే నగర శివార్లలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా దీన్ని ప్రారంభించే అకాశముంది.
కలల విమానంలో కడుపారా..
సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు. భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇక శామీర్‌పేట చెరువు అందాలను వీక్షిస్తూ.. నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకొని తింటుంటే ఈ మజానే వేరు.
త్రివేండ్రంలో కొనుగోలు
హోటల్‌రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న ప్రయోగాలు చేసే పిస్తా హౌస్ యజమాని మహ్మద్ అబ్దుల్ మజీద్ మదికి విమాన రెస్టారెంట్ ఆలోచన తట్టింది. ఇప్పటికే లైవ్ ఫ్లైట్ కాకుండా.. మోడల్ విమానాల్లో రెస్టారెంట్లు నడుస్తున్నా ఆయన ఆలోచన లైవ్ ఫ్లెయిన్‌పైనే పడింది. దీంతో చెడిపోయిన, ఫిట్‌నెస్ లేని విమానాల కోసం ఆయన విమానయాన సంస్థలను సంప్రదించారు.
ఈ క్రమంలోనే కేరళ త్రివేండ్రంలో ఎయిర్ ఇండియా వద్ద ఎ– 320 ఉందని తెలిసింది. దీన్ని వేలం ద్వారా కొనుగోలు చేసి.. ఇక్కడకు చేరుస్తున్నారు. ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న ఈ లోహ విహంగం ఈ వారాంతానికి నగరానికి చేరుకోనుంది. ఈ విమానం కొనుగోలు, తరలింపు ఖర్చు రూ.కోటి. ఈ ఫ్లైట్‌ను సమూలంగా మార్చి లోపలిభాగంలో అధునాతన సీటింగ్, విమానంలోకి ప్రవేశించేందుకు ఎస్కలేటర్, విమానం ఆగిన ప్రదేశాన్ని రన్‌వే తరహాలో తీర్చిదిద్దనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment