సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది.
ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు..
ఈ కొత్త సర్క్యూట్‌లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్‌లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది.
రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు.
చార్జీలు ఇలా
- ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300
- స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800
- కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100
- ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు.
తొలిరోజే 300 టికెట్ల అమ్మకం..
ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment