arunachalam
-
19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: గురుపౌర్ణమి సందర్భంగా భక్తు లు అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఆసక్తి చూపుతారు. గత కొన్నేళ్లుగా అక్కడికి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో ఈసారి స్పెషల్ బస్సులు పెంచాలని సంస్థ నిర్ణయించింది.ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర పట్టణాల నుంచి వీటిని నడపనుంది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా, 19 నుంచి 22 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది. అరుణాచలంతోపాటు కాణిపాకం, శ్రీపురం కూడా దర్శించుకునేలా ఈ ప్యాకేజీని ఏర్పాటు చేసింది. -
రజనీకాంత్‌పై 'రంభ' వైరల్ కామెంట్లు.. సోషల్‌మీడియాలో వివాదం!
రంభ 90వ దశకంలో తమిళ,తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా కొనసాగింది. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, చిరంజీవి వంటి ప్రముఖ నటులందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నటి రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రంభ షూటింగ్ స్పాట్లో నటుడు రజనీకాంత్‌తో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది., నటుడు రజనీకాంత్ చిలిపి పనులలో మునిగిపోతారని రంభ చెప్పిన మాటలను కట్ చేసి రజనీకాంత్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోను కొందరు ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 1997లో సుందర్ సి దర్శకత్వంలో అరుణాచలం చిత్రంలో రజనీ, సౌందర్య, రంభ నటించారు. ఈ సినిమాలో రంభ కీలక పాత్ర పోషించింది. అందులో రజనీకాంత్‌కు అసిస్టెంట్‌గా ఆమె మెప్పించింది. ఆ సినిమా సెట్లో జరిగిన సంఘటన గురించి ఆమె ఇలా తెలిపింది. 'అరుణాచలం సినిమాతో పాటు నేను ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌తో బంధన్ చిత్రం కూడా ఒప్పుకున్నాను. అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్ షూటింగ్ చేశాను. ఆ సమయంలో రజనీకాంత్‌ను కలిసేందుకు హిందీ నటుడు సల్మాన్ ఖాన్ వచ్చాడు.. అప్పుడు నేను ఆయన్ను చూసి వెంటనే వెళ్లి కౌగిలించుకుని పలకరించాను.. ఆ సమయంలో రజనీ దూరంగా కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు.. ఆ తర్వాత రజనీ షూటింగ్ ఆపి దర్శకుడు సుందర్ సితో మాట్లాడుతున్నారు. సల్మాన్ ఖాన్ వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయ్యింది. సెట్లో గందరగోళం.. నెలకొంది. రజనీకాంత్ టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు సుందర్ సి నా వైపు కంగారుగా చూశారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న కెమెరామెన్ కలుగచేసుకుని ఏంటి మేడమ్..? ఇలా చేశారు, ఇకపై మీతో నటించను అని రజినీసార్ అంటున్నారని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో నేను వెంటనే ఏడ్చేశాను . అప్పుడు నేను ఏడుస్తున్నట్లు రజనీ సార్ గమనించి భయపడి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆమెను ఎందుకు ఏడిపించారని అక్కడున్న వారందరిపై మండిపడ్డారు. నేనేం తప్పు చేశాను సార్.. ఏం జరిగింది..? అని నేను అడిగాను. అప్పడు వెంటనే షూటింగ్ స్పాట్లో ఉన్న వారందరినీ రజనీ అక్కడికి పిలిచారు. ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ వెంటనే పరుగెత్తుకుంటు వెళ్లి కౌగిలించుకుంది.. ఇక్కడ ఎవరినైనా ఎప్పుడైనా అలా హగ్ చేసుకుందా అంటూ దానిని ఆయన ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. అదే మా సినిమా సెట్లో అయితే.. గుడ్ మార్నింగ్ సార్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోతుంది. తన బాలీవుడ్ సినిమా హీరో అయితే కౌంగిలించుకుని మరీ విష్ చేస్తుంది అంటూ అందరి రజనీకాంత్ సరదాగా నన్ను ఆటపట్టించారు. నన్ను ఇలా ఆట పట్టించాలని వారు ముందే ప్లాన్ చేసుకున్నారని తర్వాత అర్థం అయింది. అదేం నాకు తెలియకపోవడంతో చాలా సమయం పాటు నేను ఏడ్చాను. అలా సరదాగా రజనీ సార్ నన్ను ఏడిపించారు.' అని ఆనాటి విషయాలను రంభ గుర్తు చేసుకుంది. ఏదేమైనా రజనీ సర్ని ఎప్పుడూ అలా చూడలేదని రంభ చెప్పింది. ఇది ఉత్తర భారత సంస్కృతి అని ఆయనతో చెప్పాను. వెంటనే తను రేపటి నుంచి యూనిట్లో అందరూ వరుసలో నిలుచోవాలని కోరారు. రేపటి నుంచి రంభ వచ్చి అందరినీ కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ చెపుతుందని మరోసారి రజనీ సార్ ఆటపట్టించారని ఆమె గుర్తుచేసుకుంది. కానీ కొందరు సోషల్ మీడియాలు రంభ వ్యాఖ్యలను కొంత వరకు మాత్రమే కట్ చేసి రజనీ కాంత్ పట్ల నెగటివ్‌ను వ్యాప్తి చేయడం గమనార్హం. #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 -
వేప తెగులు స్వల్పకాలికమే
సాక్షి, సాగుబడి డెస్క్ :వాతావరణంలో, వర్షపాతంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులే వేప చెట్లకు శాపంగా మారినా, దీని వల్ల వేప కాయల ఉత్పత్తికి విఘాతం కలగటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రాథమిక అధ్యయనంలో నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేప చెట్ల చిగుర్లు మాడిపోతుండటం, మరికొన్ని చోట్ల చెట్లు నిలువునా ఎండిపోతుండటం గత కొన్నేళ్లుగా రివాజుగా మారిన విషయం తెలిసిందే. టీ మస్కిటో పురుగు (టిఎంబి) సోకటం వల్ల కొన్ని నెలల పాటు (మే–సెప్టెంబర్) వేప చెట్ల కొమ్మలు ఎండిపోతూ.. తిరిగి వాటికవే తిప్పుకుంటున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన తర్వాత తగ్గిపోయే సమస్యేనని, దీని వల్ల వేప కాయల దిగుబడికి పెద్దగా నష్టం లేదని ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసీఏఆర్– కేంద్రీయ ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ (సిఎఎఫ్‌ఆర్‌ఐ–కాఫ్రి) సంచాలకులు డా. ఎ. అరుణాచలం వెల్లడించారు. అయితే, క్రిమిసంహారక స్వభావం కలిగిన వేపను టిఎంబి గతమెన్నడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆశిస్తోందన్న అంశంపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. గాలిలో అధిక తేమ వల్లనే పురుగు ఉధృతి ఆగ్రోఫారెస్ట్రీపై జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి సాగుబడి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మే నుంచి అకాల వర్షాలు, వర్షపాతంలో అసాధారణ మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండటం మూలంగా ట్రీ మస్కిటో పురుగు ఉధృతి పెరుగుతోందన్నారు. తెలంగాణలో కూడా కనిపించడం విచిత్రమే సముద్ర తీర రాష్ట్రాల్లో ఇది ప్రధాన సమస్యగా ఎదురవుతున్నదని, కానీ తెలంగాణలో కూడా ఇది తీవ్రంగా కనిపిస్తుండటం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. 96 దేశాల్లో వేప చెట్లు పెరుగుతున్నాయని, అయితే, టీ మస్కిటో పురుగు సోకుతున్నట్లు చైనా తప్ప మరే దేశమూ వెల్లడించలేదన్నారు. గాలి ద్వారానే టిఎంబి విస్తరిస్తోందని, ఒక ప్రదేశంలో దగ్గర దగ్గరగా ఉన్న చెట్లకు ఎక్కువగా సోకుతోందని, ఇది మనుషులకు హానికరం కాదని డా. అరుణాచలం అన్నారు. ఇలా అరికట్టవచ్చు పొటాషియం లోపించిన నేలల్లో పెరుగుతున్న వేప చెట్లకు టీఎంబీ ఎక్కువగా సోకుతున్నట్లు కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. పొటాషియం పుష్కలంగాఉన్న నేలల్లో చెట్లకు పెద్దగా సోకలేదు. పశువుల ఎరువులో ట్రైకోడెర్మా విరిడి కలిపి వేపచెట్లకు వేస్తే కొమ్మెండు సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చని డా. అరుణాచలం వివరించారు. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
అరుణాచల గిరి ప్రదక్షిణ: భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి,హైదరాబాద్: తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సర్వీసు నంబర్ 98889 గల ఈ బస్సు.. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి.. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. ఈ మేరకే టీఎస్ఆర్టీసీ అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ప్యాకేజీలాగా అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణయించింది. ‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.’ ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ సూచించారు. చదవండి: జోగిపేట ఆక్స్ఫర్డ్ స్కూల్‌పై కేసు నమోదు.. కారణం ఇదే.. -
అరుణాచల గిరి ప్రదక్షిణ: భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తియ్యటి వార్త
సాక్షి, విశాఖపట్నం: అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. 3న విశాఖలోని ద్వారక బస్‌స్టేషన్ నుంచి బయలు దేరి కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి క్షేత్రాల దర్శనం ఉంటుందన్నారు. 5న పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం 7న తేదీన విశాఖకి చేరుకుంటోందన్నారు. టికెట్స్ కావాల్సిన www.apsrtconline.inలో ద్వారా ఆన్ లైన్లో బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. అలాగే అదనపు సర్వీసులు కూడా నడపడానికి ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధంగా ఉందని రవికుమార్ పేర్కొన్నారు. చదవండి: అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం -
కమల్‌హాసన్‌కు అరుణాచలం ఝలక్
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు కమల్‌హాసన్‌కు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది. మక్కల్ నీది మయ్యం ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఝలక్ ఇచ్చారు. కమల్‌తో పాటు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ అరుణాచలం ఎంఎన్ఎంను వీడి బీజేపీలో చేరారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతునివ్వాలని కోరితే కమల్ తిరస్కరించారని, అందుకే పార్టీని వీడినట్లు అరుణాచలం చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం అరుణాచలం మీడియాతో మాట్లాడుతూ ఎంతో దూరదృష్టితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుదామని ఉన్నతస్థాయి పార్టీ సమావేశంలో కమల్‌ను కోరానని అన్నారు. అయితే రైతు సంక్షేమాన్ని విస్మరించి పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన వ్యవహరించడం వల్లనే కమలదళంలో చేరానని చెప్పారు. కమల్ పార్టీ పెట్టిన నాటి నుంచి మక్కల్ నీది మయ్యం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అరుణాచలం ఆ పార్టీని వీడడం గమనార్హం. కమల్‌పై ఫిర్యాదు: చెన్నైలో కమల్ ఇటీవల నిర్వహించిన పార్టీ మహిళా విభాగం సమావేశంలో హిందువుల దేవుళ్లను అసభ్యంగా విమర్శించి మహిళల మనోభావాలను గాయపరిచిన కమల్‌హాసన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెన్నై ఆర్కే నగర్ పోలీసులకు సెల్వం అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశాడు. ప్రజలను హింసాత్మక ధోరణివైపు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. -
దీప కాంతుల శోభితం అరుణాచలం
తిరుమలలో బ్రహ్మోత్సవాలు, శబరిమలైలో మకరజ్యోతి ఉత్సవం ఎంత వైభవంగా జరుగుతాయో ..... ప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలంలో కార్తీగ దీపోత్సవాలు అంతటి వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన మొదలైన ఉత్సవాలు 14వ తేదీ దాకా జరుగుతాయి. అతి ముఖ్యమైన భరణీ దీపాన్ని ఈ నెల 10వ తేదీన అంటే వచ్చే మంగళవారం వెలిగిస్తారు. ఆ రోజు సాయంత్రం అరుణాచలం కొండ మీద అత్యంత భారీగా దివ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. పున్నమి రాత్రుల వెన్నెలతో పోటీ పడుతూ వెలిగిపోయే దివ్య జ్యోతి కాంతుల్ని దర్శించుకొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు అరుణగిరికి పయనం అవుతున్న తరుణం ఇది. దాదాపు 10, 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జ్యోతి దర్శనం ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అనేక విశిష్టతలు గోచరిస్తాయి. వీటినే కార్తీక బ్రహ్మోత్సవాలు అనికూడా అంటారు. ఇందులో మొదటి రోజున అంటే ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన .. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు. అంటే వినాయకుడు, కుమారస్వామి, చండీశ్వర స్వామి సహా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇక ప్రతీ రోజూ రెండు పూటలా ఉదయం సమయంలో చంద్రశేఖరమూర్తిగా, రాత్రి సోమస్కంధ మూర్తిగా ఊరేగింపు నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఎనిమిదో రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకోవటం జరుగుతుంది. పదో రోజు కార్యక్రమాన్ని దృష్టిలోపెట్టుకొని చాలా మంది భక్తులు ముందుగానే విచ్చేస్తుంటారు. ఎనిమిదో రోజు అంటే నేటి ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం 4 గంటల నుండి భిక్షాటనమూర్తి మాఢవీధులలో ఊరేగింపు జరుగుతుంది. అదేరోజు రాత్రి పంచకళ్యాణివాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇందులో నాలుగు కాళ్లు కిందకు ఆనని రీతిలో దీన్ని రూపొందించారు. తొమ్మిదోరోజు ఉదయం పురుష మృగ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి కైలాస రావణ వాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇక ఈ సమయానికి నెమ్మదిగా అరుణాచల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది. డిసెంబరు 10న ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణీదీపం వెలిగిస్తారు. ఈ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మార్మోగిపోతుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది. దీనిని దీపనాడార్ వంశస్తులు తీసుకొని రావటం సాంప్రదాయం. 600 మీటర్ల ఒత్తితో 2500 కేజీల ఆవునెయ్యితో అత్యంత వైభవంగా మహాదీపోత్సవం కాగానే అరుణగిరి కోటి కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోతుంది. ఈ వైభవాన్ని చూసేందుకు వెయ్యికనులు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున జరిగే ఊరేగింపును చూస్తుంటే ఒడలు పులకించిపోవటం ఖాయం. అగ్ని రూపుడైన అరుణాచలేశ్వరుడు దేవేరితో కలిసి అరుణ కాంతులతో వెలిగిపోతూ దర్శనం ఇస్తారు. అరుణాచల శివ అంటూ భక్తులు స్వామి వారిని పిలుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది. వేలమంది ఒక్కసారిగా కదులుతూ గిరిని ప్రదక్షిణం చేసుకొంటారు. తర్వాత 11వ రోజున అయ్యన్ కొలనులో చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం. 12వరోజున పరాశక్తి తెప్పోత్సవం, 13వ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం, 14వ రోజున చండికేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది. వాస్తవానికి అరుణాచల క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతాలు గోచరిస్తాయి. అగ్ని లింగ రూపంలో స్వామివారు, అందరినీ అనుగ్రహించే అమ్మవారు, పర్వత రూపంలో నిలిచిన పరమాత్మ, కలియుగంలో మార్గదర్శనం చేసిన రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తాయి. కావ్యకంఠ మహాముని ముక్తినొందిన క్షేత్రం ఇది. అందుచేత అరుణాచల దర్శనం సకలపాప హరణం అని చెప్పుకోవచ్చు. – వై. రమ విశ్వనాథన్ సీనియర్ పాత్రికేయులు -
చిరస్మరణీయం
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు. ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మస్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు అనేవారు రమణ మహర్షి. ఇంతకీ ఎవరీ రమణ మహర్షి? గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా నిలిచి సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని అందించినా... రమణ పథం చాలా భిన్నమైనది. ఆ రమణుని చెంత సేదతీరి తమ ఐహిక దుఃఖాలను, ఆధ్మాత్మిక తృష్ణను తీర్చుకునేందుకు వందలాది జనం నిత్యం అరుణాచలానికి బారులు తీరేవారు. భక్తులు అడిగే ప్రతి ప్రశ్నకూ రమణులు తనదైన శైలిలో జవాబుని అందించేవారు. వాటిలో చాలావరకూ జవాబులు ‘నిన్ను నువ్వు ముందుగా తెలుసుకో’ అన్న సూచనతో ముగిసేవి. మరికొన్ని సందర్భాలలో రమణులు తనంతట తానుగా ఏదో ఒక విషయం గురించి అభిప్రాయాన్ని వెల్లడించేవారు. వెంకట రామన్ అనే పేరున్న రమణులకు అసలు ఆ పేరెలా వచ్చిందో చూద్దాం...ఒకసారి తపస్సు కోసమని తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లాడు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ అరుణగిరిపై వెలిసిన అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనీ దర్శించుకున్నాడు. ‘‘శక్తి, ఈశ్వరుడు ఇక్కడ నాకు పూర్ణానుగ్రహ స్వరూపులై కనిపిస్తున్నారు. నా తపస్సు ఇక్కడే సిద్ధి పొందుతుంద’’ని తన సోదరునితో చెప్పారు గణపతిశాస్త్రి. మరోసారి తిరువణ్ణామలై వెళ్లి రోజులకు రోజులు తపస్సులో నిమగ్నమయ్యాడు గణపతి. ఒకరోజు హఠాత్తుగా అరుణాచలంపై ఉన్న మౌనస్వామి గుర్తుకువచ్చారు. మూడు నాలుగేళ్లకిందట తాను స్వామిని ఒకసారి దర్శించుకున్నాడు. మళ్లీ స్వామిని దర్శించుకోవడానికి మండుటెండలో అరుణగిరి ఎక్కనారంభించారు. విరూపాక్ష గుహ బయట స్వామి ఒక్కరే ఒక తిన్నెపై కూర్చుని ఉన్నారు. ఆయన పాదాలను పట్టుకున్నాడు గణపతి. కన్నీరు కారుస్తూ.. ‘‘స్వామీ! మనసారా తపస్సు చేశాను. అయినా దేవుడు ప్రసన్నుడు కాలేదు. నా సాధనలో ఏదో లోపం ఉందనిపిస్తోంది! తపస్సు స్వరూపం ఏమిటో అనుగ్రహించండి’’ అని కోరాడు. గణపతి ప్రార్థనను ఆలకించిన మౌనస్వామి.. ‘‘నాయనా! ‘నేను’ అనే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తున్నదో విచారిస్తే... మనసు అందులో అణగిపోతుంది. అదే తపస్సు. మంత్ర శబ్దోత్పత్తి ఎక్కడ జరుగుతుందో గమనిస్తే.. మనసు అందులో లీనమవుతుంది. అదే తపస్సు’’ అని ఉపదేశించాడు. ఆ ఉపదేశంతో పొంగిపోయిన గణపతి ముని... స్వామి పరిచారికుడు పళనిస్వామిని అడిగి స్వామి పేరు వెంకటరామన్ అని తెలుసుకున్నాడు. ఆ పేరుని ‘రమణ’గా సంక్షిప్తం చేశారు గణపతి. మోక్షానికి దారి చూపారు కాబట్టి ‘మహర్షి’ అనీ.. సర్వమంగళ ప్రదాత కావున ‘భగవాన్’ అనీ స్ఫురించేలా స్వామికి.. ‘భగవాన్ శ్రీ రమణ మహర్షి’ అని నామకరణం చేశారు. మహర్షిని తన గురువుగా స్వీకరించారు. ఆ తర్వాత వెంకటరామన్ పేరు ‘రమణ మహర్షి’గా స్థిరపడిపోయింది. సందేశ రమణీయం మహర్షిని దర్శించుకోవడానికి ఎందరో సాధకులు వస్తూ ఉండేవారు. వాళ్లడిగిన ప్రశ్నలు, మహర్షి ఇచ్చిన సమాధానాలతో ‘శ్రీరమణ గీత’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు గణపతి ముని. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం. ∙మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏదీ లేదో అదే ఉన్నదని, యథార్ధానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసుమాట వినకుండా, హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్నదానిని చూసుకుంటే, ఇక బయట ప్రత్యేకంగా చూసుకుని ఆనందించవలసిన అవసరం లేదు. ∙‘ఈ ప్రపంచం సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా?’ అనే ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారంటే... ‘సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది. ∙మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది. ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగంతుడికంత పక్షపాతం ఉంటుందా? ∙సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది. కానీ పక్కనే రుచికరమైన తిండి ఉండగా ఒక క్షుథార్తుడు దానివైపు చేయిజాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు, మానవుడు çసృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదలిపెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు. కాని మనుష్యుల అదృష్టం కొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుని ఎన్నడూ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, కొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనేలా చేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు. ∙ చాలామంది సంతోషం బయట నుంచి వస్తుందనీ, భౌతికమైన సంపదలతో ఏర్పుడుతుందనీ అనుకుంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగేట్లయితే సంపద పెరుగుతున్న కొద్దీ అది పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివాడి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. కానీ నిజంగా అలా జరుగదు కదా! మనిషి ఏ సంపదనీ అనుభవించలేని... కనీసం శరీరస్పృహ కూడా లేని నిద్రావస్థలో చాలా సంతోషంగా ఉంటాడు. అలాంటి స్థితి కోసమే తనకు గాఢంగా నిద్ర పట్టాలని కోరుకుంటాడు. దీనిని బట్టి సంతోషం మనిషి అంతరంగంలోనే ఉందని తేలిపోతోంది కదా! మనల్ని మనం తెలుసుకున్న రోజున, అలాంటి స్వచ్ఛమైన సంతోషాన్ని నిరంతరం పొందగలుగుతాము. – డి. పూర్ణిమాస్వాతి -
ఆ విషయంలో సిగ్గెందుకు!
ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకుంది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికిది నిదర్శన. ‘‘అవును నా చేతిలో ఉన్నది ప్యాడ్ – నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు... అది చాలా సహజమైనది! పీరియడ్’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకొనె, ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకుంటూ. ‘ప్యాడ్ మ్యాన్’ ఈ నెల 9వ తేదీ విడుదలవుతున్న అక్షయ్ కుమార్ సినిమా. అరుణాచలం మురుగనంతం జీవితాన్ని ఇది మనకు చూపిస్తుంది. అరుణాచలం తమిళనాడుకి చెందిన వ్యక్తి. తన భార్య నెలసరి రోజులలో పాత గుడ్డముక్కలు, కాగితాలు వాడటం చూసి కలత చెంది, దానికో పరిష్కార మార్గం చూపించాలని భావించాడట. ఈ పరిశోధనలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాలనుంచి దిగుమతి అయ్యే శానిటరీ నాప్కిన్ తయారీ మెషీన్ విలువ మూడున్నరకోట్లు. ఇంత ఖరీదైన మెషీన్‌తో ప్యాడ్లు తయారు చేయడం వలన మార్కెట్‌కు చేరేప్పటికీ ప్యాడ్ ఖరీదు పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని గ్రహించాడు. చివరికి అన్ని అడ్డంకులనూ అధిగమించి రూ. 65 వేలకే వచ్చే ప్యాడ్ ఉత్పత్తి మెషీన్‌ను ఆయన కనుగొన్నాడు. పైగా ఆ మెషీన్‌ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు మాత్రమే అమ్ముతానని భీష్మించుకున్నాడు. ఈయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 100 మంది వ్యక్తులలో ఒకరని టైం మేగజైన్ ప్రకటిం చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది. ఇండియాలో అధిక శాతం ప్రజలు అల్పాదాయ వర్గాల వారే. వారికి మార్కెట్లో దొరికే ప్యాడ్లను కొనగలిగే స్థోమత ఉండదు. 2016లో చేసిన ఒక పరిశోధన ప్రకారం దేశంలో 84% అమ్మాయిలూ, 92.2% శాతం తల్లులూ ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డని వాడుతున్నారు. వారిలో కొందరే ఆ గుడ్డని ఎండలో ఆరబెడుతున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం మనదేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్లు వాడగలిగే స్థితిలో ఉండటం వలన 37.8% పెళ్లి కాని పిల్లలు యోని దగ్గర దురదతో, దుర్వాసనతో బాధపడుతున్నారు. స్త్రీలను అమితంగా బాధించే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (ఆర్టీఐ)కి, సర్వైకల్ కేన్సర్‌కు 70% కారణం నెలసరి సమయంలో శుభ్రమైన ప్యాడ్లు వాడకపోవడమేనని 97% మంది గైనకాలజిస్టులు అఇ నీల్సన్ సర్వేలో చెప్పారు. మహిళలకు ఏమీ చేయడంలేదనిపించుకోకుండా ప్రభుత్వం 2011లో రుతు సంబంధమైన శుభ్రతా పథకం (ఎమ్హెచ్ఎస్)ని ప్రారంభించి, 100 కోట్లను కేటాయించింది. అయితే ఈ కార్యక్రమం గురించి నెల్లూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ని అడిగినపుడు ఆమె తన అనుభవాలను పంచుకున్నది. రెండేళ్ల క్రితం ఒకే ఒకసారి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం క్రింద (ఆర్కెఎస్కె) గ్రామాలలో ప్యాడ్లు పంచడం జరిగిందట. ప్యాకెట్టు విలువ రూ. 6లు. అందులో ఆశా వర్కర్‌కి రూపాయి. మరి గ్రామాలలో స్పందన ఎలా ఉండింది అంటే ‘‘చాలా బాగుండిందమ్మా. రేటు తక్కువ కాబట్టి ‘కౌమార బాలికలు’ ఉత్సాహంగా కొన్నారు’’ అన్నది. ‘కానీ అంత రేటు పెట్టి కొనగలిగే స్థోమత తమకు లేద’ని 83% మంది దిగువ తరగతి వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆడవారి రుతుస్రావం చుట్టూ నొప్పుల బాధలు ప్రకృతి ఎలాగూ పెట్టింది. అది కాక రోగాలు రాకుండా శుభ్రతను పాటించాలంటే నెలనెలా ఖర్చు పెట్టాల్సి రావడం చాలామందికి స్థోమతకు మించిన బాధ. అలాంటిది ప్రభుత్వం సానిటరీ ప్యాడ్లను 12% జీఎస్టీలోకి నెట్టడం ఇంకా బాధాకరం. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థిని జర్మినా ఇస్రార్ ఖాన్ గత ఏడాది ఈ 12% ట్యాక్స్ రాజ్యాంగ విరుద్ధమూ, అన్యాయమూ అని ఢిల్లీ కోర్టులో కేసు వేసినా ప్రభుత్వం చలించలేదు. ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయాలనే డిమాండ్‌కి స్పంది స్తూ అరుణ్‌జైట్లీ ‘12 శాతాన్ని తగ్గించినట్లయితే... భారతీయ ఉత్పత్తిదారులు ఎవరూ మిగలరు’ అని వ్యాపార సూత్రాన్ని చెప్పారు. ఈ జనవరి 22న సుప్రీం కోర్టు ముంబై ఢిల్లీ కోర్టులలో ఉన్న ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై స్టే విధించి, దీన్ని తన పరిధిలోకి తీసుకోవడంపై పరిశీలిస్తానని పేర్కొన్నది. ‘తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ’ వారు 2015లో విడుదల చేసిన ‘రుతుసంబంధమైన ఆరోగ్య నిర్వహణ మార్గదర్శకాలు’ చదువుతూ, నేను నా కూతుర్ని ‘మీ స్కూల్ లో ప్యాడ్స్ ఎలా వాడాలో ఎప్పుడన్నా చెప్పారమ్మా’ అని అడిగాను. నా కూతురు ‘అవంతా చెప్పలేదమ్మా, ఎక్కడ పడేయాలో మాత్రం చెప్పారు అంటూనే, ఆ.. ఇంకా మేల్ స్టాఫ్‌తో మాట్లాడొద్దని కూడా చెప్పారమ్మా’ అన్నది. ఆడపిల్లల్ని మగవాళ్ళకి దూరంగా ఉంచి పద్దతిగా పెంచడంలో ఉండేంత శ్రద్ధ.. వాళ్ల బడి వాళ్లకు ఆ పిల్లల శుభ్రత మీద లేదు. దీని వెనుకనున్న భావజాలం పేరు పితృస్వామ్యం. ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకున్నది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికి ఇది నిదర్శన. దీపికా వంటి సెలెబ్రిటీలు ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకోవాల్సింది, ప్యాడ్‌ని ప్రదర్శించడానికి కాదు, వీటన్నిటి గురించీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తీసుకోవాలి, అప్పుడే అరుణాచలంపై సినిమాకి ఒక అర్థం ఉంటుంది. - సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
అరుణాచలం మేడిన్ అమెరికా!
ఆ సీన్ - ఈ సీన్ జార్జ్‌బార్ మెక్‌కుచ్చన్ అనే అమెరికన్ రచయిత ‘బ్రెస్టర్ మిలియన్స్’ నవలను 1902లో రాశాడు. హాలీవుడ్లో ఈ నవల ఆధారంగా ఆరు సినిమాలు వచ్చాయి. మన దగ్గర మూడు వచ్చాయి. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు హీరోగా ‘వద్దంటే డబ్బు’ సినిమాకు మూల కథను ‘బ్రెస్టర్ మిలియన్స్’ కథాగమనాన్ని అనుసరించి సంగ్రహించారు. 1988లో బాలీవుడ్లో నిసీరుద్దీన్ షా ప్రధానపాత్రలో ‘మాలామాల్’ రూపొందింది. జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ‘బాబాయ్ అబ్బాయ్’లోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే మెక్ నవల, 1985లో వచ్చిన ‘బ్రెస్టర్ మిలియన్స్’ సినిమాల జాడ ఎక్కువగా కనిపించేది మాత్రం ‘అరుణాచలం’ సినిమాలో మాత్రమే. సినీ సృజనలో కాపీ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అయితే కాపీ చేసినప్పుడు అసలైన సృజనకారులకు క్రెడిట్ ఇస్తే... కాపీ కొట్టిన వాళ్లు కూడా గొప్పవాళ్లే అవుతారు. భారతీయ కాపీ రాయుళ్లలో ఇలాంటి స్పృహ కనిపించదు. కానీ, ప్రేక్షకులు మాత్రం స్పృహలోనే ఉంటారు. కాపీ కథల జాడను పట్టేస్తారు. ఈ అరుణాచలం కూడా అంతే. అడ్డపంచెలో వచ్చి పలకరించినా ఇతడి మూలాలు మాత్రం అమెరికాలో ఉన్నాయి! ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. గడువు ముప్పై రోజులే. ఆస్తులు కొనకూడదు, అప్పుగా ఇవ్వకూడదు. దానధర్మాలు చేయరాదు. అంతా ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టడంపై విసుగొచ్చేలా ఖర్చు పెట్టాలి. డబ్బుపై మమకారం పోయేలా ఖర్చు చేయాలి. అరుణాచలం సినిమాలో ఒక తండ్రి తనయుడికి పెట్టే పరీక్ష ఇది. ఈ ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే పరీక్షలో ఉత్తీర్ణుడు అయితేనే తన మూడువేల కోట్ల రూపాయల ఆస్తి తనయుడికి దక్కేలా వీలునామా రాసి ఉంటాడాయన. రజనీకాంత్ హీరోయిజాన్ని సరికొత్త రీతిలో ఎలివేట్ చేసిన సినిమా ‘అరుణాచలం’ మూల కథ ఇది. సుందర్.సి దర్శకత్వంలో 1997లో వచ్చిన ఈ సినిమా దక్షిణాదిలో సూపర్‌హిట్ అయింది. కేవలం రజనీకాంత్ స్టైల్స్, మ్యానరిజమ్స్ మాత్రమే కాకుండా అత్యంత ఆసక్తిగల రీతిలో సాగే ఈ సినిమా కథ, కథనాలు కూడా ‘అరుణాచలం’ సినిమా సూపర్‌హిట్ కావడానికి కారణాలే. ఇందులో రజనీకాంత్ స్టైల్స్ మాత్రమే ఒరిజినల్. కథాగమనం కాపీ కొట్టిందే. ఆ నవల పేరు, సినిమా పేరు కూడా ‘బ్రెస్టర్ మిలియన్స్’. మాంటీ బ్రెస్టర్ ఓ క్లబ్లో బేస్‌బాల్ ప్లేయర్. స్పైక్ నోలన్ అనే బెస్ట్‌ఫ్రెండ్ కోసం ఓ గొడవలో తలదూర్చి అరెస్ట్ అవుతాడు. నోలన్ కూడా జైలు పాలవ్వడంతో వీరిని విడిపించేవాళ్లే ఉండరు. ఇలాంటి సమయంలో ఒక అపరిచితుడు వచ్చి తనతో పాటు న్యూయార్క్ సిటీకి రావాలనే షరతు మీద బెయిల్ ఇప్పిస్తాడు. జైలు నుంచి బయటపడితే చాలని ఆ షరతుకు ఒప్పుకొని స్నేహతుడితో కలసి న్యూయార్క్ వెళతాడు బ్రెస్టర్. బ్రెస్టర్కు పెదనాన్న వరుసయ్యే రూపర్ట్ హార్న్ శ్రీమంతుడు. తనకంటూ ఎవరూ లేని స్థితిలో మరణించిన ఆ పెద్దాయన తన ఆస్తిపాస్తులన్నింటినీ రక్తసంబంధీకులకే దక్కాలనుకుంటాడు. అయితే వారికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు, మనీమేనేజ్మెంట్లో గొప్ప నైపుణ్యం ఉండి తీరాలనే భావనతో... ముప్పై రోజుల్లో ముప్పై మిలియన్ల మొత్తాన్ని ఖర్చు పెట్టే షరతు పెడతాడు. తన వీలునామాను వివరించే వీడియో క్యాసెట్‌ను, తన ఆస్తులను సన్నిహితులయిన పెద్దమనుషులకు అప్పగించి ఉంటాడు. బ్రెస్టర్ను న్యూయార్క్‌కు తీసుకొచ్చిన అపరిచితుడు ఈ కథంతా వివరించడంతో... ముప్పై మిలియన్‌డాలర్ల చాలెంజ్‌ను స్వీకరిస్తాడు హీరో. ఆ తర్వాత ఎలా విజయం సాధించాడనేది అరుణాచలం సినిమాలో చూసేశాం. మిలియన్లు మన కరెన్సీలో కోట్లు అయ్యాయి. ముప్పై రోజుల కాన్సెప్ట్ మారలేదు. హీరోను పరిచయం చేసే బ్యాక్‌గ్రౌండ్‌ను సెంటిమెంట్లతో లోకల్ టచ్ ఇచ్చారు. అరుణాచలం తమిళ, తెలుగు వెర్షన్లలో డబ్బును ఖర్చు పెట్టడానికి హీరో ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డంకులు సృష్టించే పన్నాగాలు, వ్యూహాలు, హీరో ఎత్తులు కూడా మూలంలోనివే. - బి. జీవన్‌రెడ్డి -
సత్వం: మన చలం
మెడలో మల్లెపూల దండ వేసుకుని, వాటి పరిమళం పక్కవాళ్లకూ పంచుతూ, తెనాలి వీధుల్లో తిరిగిన చలం సాయంత్రాల్ని ఒకసారి ఊహలోకి తెచ్చుకుంటే...! సాక్షాత్తూ ఆనందరూపుడిగా కనబడతారు చలం. ఆయనకన్నీ, అంతటా ఆనందమే! ఊయల్లో ఉత్తినే కాళ్లూపుకుంటూ గడిపే పసిపిల్లల్ని చూసినా, పంది వెంబడి పడి రాయితో బెదిరిస్తున్న తుంటరి బాలుడిని కాంచినా, పరికిణీ రెపరెపల్తో, మువ్వల సవ్వడుల్తో వయ్యారాలుపోయే కన్నెపిల్ల ఎదురైనా, ఇంకా ఉడతలూ గోరింకలూ భీమిలి సముద్రమూ నక్షత్రాల వెలుగూ... దేనికైనా బాధపడటానికి ఏముందని? ‘అసలు బాధలో అంత బాధ లేదు’. విశ్వనాథ అన్నట్టు, ఏనాడూ ‘ఎంగిలి మాటలు’ వాడని చలం, అనవసర పదం ఒక్కటి అదనంగా రాసినా నేరమేనన్న చలం, తానే సాహిత్యంగా బతికిన చలం- మైదానం, పురూరవ, జీవితాదర్శం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, శశిరేఖ, అమీనా, అరుణ... కథలు, నవలలు, వ్యాసాలు, సంభాషణలు, ప్రేమలేఖలు, ఉత్తరాలు, కవితలు, మ్యూజింగ్స్... ఏ రూపంలోనైనా ఆనందం చుట్టూ తాను తిరుగుతూ, అక్షరాల చుట్టూ పాఠకుల్ని తిప్పాడు, దోసిళ్లకొద్దీ జీవనరసం తాగిస్తో. ఒక్కోసారి ‘గీతాంజలి’ని చలమే రాసి తమాషాకి టాగూర్ పేరు పెట్టాడేమోనని అనిపించదూ! జీవితాన్ని ఏలుకునే తెలివిడిలేనివాళ్లకు మళ్లీ గుడిపాటి వెంకటాచలమే వచ్చి అన్నీ చెప్పాలని ఉడుక్కున్నాడు. ‘ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏదీ చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’ అని మనుషుల సౌందర్యలేమినీ, వేగపుయావనీ నిరసించాడు. ఆయన్ని ఎవరు ఎలా ఆరాధించినా, ప్రత్యేకించి స్త్రీవాదీ, పురుషవాదీకాని స్వేచ్ఛావాది... చలం. ఆయన ఎంపిక స్వేచ్ఛను కోరుకున్నాడు. స్త్రీ పురుషులు సమానంగా, హిపోక్రసీ లేకుండా, చిరునవ్వుల్తో పరస్పరం హృదయాల్ని వెలిగించుకుంటూ, ఒకరి ప్రపంచం మరొకరయ్యేంత గాఢంగా జీవించే కలగన్నాడు; ఒక్కోసారి అది తాత్కాలిక నీతిచట్రంతో భేదించేదే కావొచ్చుగాక! ఇప్పటి ‘నైతిక ముద్ర’ అప్పటి ఆయన గాయాలకు లేపనం ఎటూకాలేదుగానీ... ఆయన పొందినట్టుగా కనబడిందంతా ఆయన పొందాలనుకున్న కల్పనేనేమో! స్త్రీ లాంటి ఒక బలమైన ఇచ్ఛేదో లేకుండా రోజువారీ బతుకులోని నిస్సారత ఆయనకు తెలుసు. అందుకే అంటాడు: ‘నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను’. ఆయన స్వేచ్ఛ జీవితానికీ, కళకూ కూడా సంబంధించినది: ‘ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకరతిప్పే అలవాటు, కళని ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం, క్రమంగా అతని ఆత్మలోకి పాకి, అతని జీనియస్‌ని, స్వేచ్ఛని, ధైర్యాన్ని చంపేస్తుంది’. ప్రేమికుడినుంచి అన్వేషిగా, అన్వేషకుడినుంచి ఆధ్యాత్మికుడిగా రూపాంతరం చెందుతూ... అసలు తొలినుంచీ అన్నీ ఆయనలో కలగలిసే ఉన్నాయి, ఆయన వచనంలోనే కవిత్వం మిళితమైనట్టుగా! అందుకే, తనలో ఉన్న చీకటినే కాగితం మీద పెట్టానేతప్ప ఏ బోధలూ చేయడం కోసం కాదన్నాడు. చీకాకు పరిచే ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి ఎప్పటికి కుదురుతుందోనని వాపోయాడు. సత్యం లోపల్నుంచే దొరకాలి తప్ప, బయటెక్కడో కాదన్నాడు. చలం అనేవాణ్ని మరిచిపోయేంతగా నిత్యనూతన జీవితాన్ని, పాత మకిలి లేని జీవితాన్ని అభిలషించాడు. తనలో ఉన్న ప్రశ్నలకు ఒక మేరకైనా సమాధానపడాల్సిన పక్వస్థితికి వచ్చాక ‘అరుణాచలం’లో స్థిమితపడ్డాడు. ‘మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్లీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?’ తనలోని చివరి ప్రశ్నలు, వాటికి దొరికీ దొరకని సమాధానాలతోనే కన్నుమూసిన చలం- ఎక్కడైనా నిజంగానే మేలుకున్నాడేమో! ఈ జీవితపు కొనని అక్కడ అందుకుని ఇదంతా కలని చెప్పేందుకు కాచుకుని కూర్చున్నాడేమో! - పూడూరి రాజిరెడ్డి