
పరేడ్‌లో ఇన్‌స్పెక్టర్ మహేశ్వరి
తమిళనాడు తిరునల్వేలిలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎన్. మహేశ్వరి జీవితం గత రెండు వారాలుగా ఉద్వేగభరితంగా, సంఘటనాయుతంగా ఉంది. ఆమె భర్త బాలమురుగన్ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. అతణ్ణి కోవిడ్ పేషెంట్స్ రాకపోకల సమాచార నిఘా కోసం తిరునల్వేలి మెడికల్ కాలేజీ దగ్గర డ్యూటీ వేశారు. ఆ డ్యూటీ చేస్తున్న బాలమురుగన్ కోవిడ్ బారిన పడ్డాడు. క్వారంటైన్‌కు వెళ్లక తప్పలేదు. మహేశ్వరి ఒకవైపు డ్యూటీ చేస్తూ ఇంట్లో పిల్లలను చూస్తూ భర్త ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సి వచ్చింది.
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్‌లో ఆమె ప్రతి సంవత్సరం గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుంది. ఈసారి కూడా ఆమే ఇవ్వాలి. దానికోసం రిహార్సల్స్‌కు హాజరవుతోంది. శుక్రవారం (ఆగస్టు 14)న కూడా అలాగే పరేడ్ రిహార్సల్స్‌లో పాల్గొని ఇంటికి చేరిన మహేశ్వరికి తండ్రి మరణవార్త తెలిసింది. తిరునల్వేకి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే వడమాదురైలో 83 ఏళ్ల ఆమె తండ్రి ఆనారోగ్య కారణాల రీత్యా మరణించాడు. చివరి చూపులకు మహేశ్వరి వెళ్లాలి. కాని తెల్లవారితే పరేడ్ ఉంది. ఆమె లేకపోతే అది డిస్టర్బ్ అవుతుంది.
అప్పటికే క్వారంటైన్ ముగించుకుని ఇల్లు చేరిన భర్త కూడా పరేడ్‌కు హాజరయ్యాకే ఊరికి వెళదాం అన్నాడు. ఇద్దరూ ఈ విషయం పైఅధికారులకు చెప్పలేదు. శనివారం–ఆగస్టు పదిహేను ఉదయం పోలీస్ యూనిఫామ్‌లో తన దళాన్ని లీడ్ చేస్తూ మహేశ్వరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సమక్షంలో పరేడ్‌లో పాల్గొంది. ఆమె ముఖంలోని విషాదాన్ని మాస్క్ కప్పిపెట్టింది. ఆమె వేదనను గంభీరమైన గళం తొక్కి పట్టింది. పరేడ్ విజయవంతం అయ్యింది. ఆ మరుక్షణం భర్తతో కలిసి హుటాహుటిన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి మహేశ్వరి బయలుదేరింది. అప్పటికిగాని ఈ సంగతి తెలియని అధికారులు మహేశ్వరి అంకితభావం పట్ల ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. సినిమాల్లో ఇలాంటివి చూస్తాం. కాని నిజ జీవితపు వ్యక్తులే అలాంటి సినిమాలకు ప్రేరణ.
Comments
Please login to add a commentAdd a comment