NASA Astronaut Christina Koch To Be First Woman To Go To Moon - Sakshi
Sakshi News home page

చంద్రుడి దాకా తొలి మహిళ

Published Wed, Apr 5 2023 1:39 AM | Last Updated on Wed, Apr 5 2023 9:38 AM

First woman to the moon - Sakshi

నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు ‘మానవాళి ముందంజ’ అని అభివర్ణించారు. కాని మానవాళి నిజమైన ముందంజ ఇకపై పడనుంది. వచ్చే సంవత్సరం చంద్రుణ్ణి చుట్టి రావడానికి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల్లో ఒక మహిళా వ్యోమగామిని ఎంపిక చేసింది నాసా. ఆ విధంగా చంద్రుని దాకా వెళ్లనున్న తొలి మహిళగా  వ్యోమగామి క్రిస్టినా కోచ్‌ చరిత్ర సృష్టించనుంది.

50 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడి మీద అడుగు మోపినప్పుడు సమస్త మానవాళి అబ్బురపడింది. పులకించింది. మానవ చరిత్రలో శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన అపూర్వ ఘటనగా లిఖించుకుంది. భూమ్మీద నుంచి నిత్యం కనపడే, వెన్నెల కురిపించే, వేల ఏళ్లుగా ఎన్నో కథలకూ గాథలకూ ఆలవాలమైన చంద్రుడిపై అడుగుపెట్టడం అంటే సామాన్యమా మరి.

ఈ చంద్రుణ్ణి అందుకోవడానికి అమెరికా నాసా ద్వారా 1968 నుంచి 72 మధ్య ‘అపోలో’ ద్వారా 24 మంది వ్యోమగాములను పంపితే 12 మంది చంద్రుడిపై దిగగలిగారు. అయితే వారంతా పురుషులు. ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా చంద్రుడిని తాకలేదు. కాని త్వరలో తాకబోతోంది. ‘అర్టిమిస్‌–2’ పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రుని ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒక మహిళ ఎంపికైంది.

ఆమే క్రిస్టినా కోచ్‌. ఆ విధంగా చంద్రుడి వరకూ వెళ్లగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది. చంద్రుడికి వీలైనంత దగ్గరగా వెళ్లి దాని చుట్టూ తిరిగి వచ్చే ఈ యాత్ర విజయవంతమైతే 2025లో జరిగే చంద్రయానంలో ఒక స్త్రీని పంపాలని నాసా నిర్ణయం. ఆ అసలు యాత్రకు కావలసిన ధైర్యం క్రిస్టినా ఇవ్వనుంది.

ఆర్టిమిస్‌–2 అంటే?
ఆర్టిమిస్‌–2 ప్రయోగంలో వ్యోమగాములు చంద్రుడి మీద కాలు పెట్టరు. చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోనూ తిరుగాడరు. చంద్రుడికి కొంత దూరం నుంచి ప్రయాణిస్తారు. దీన్నే ఫ్లై బై అని పిలుస్తారు. చంద్రునిపై రోబోలు, మనుషులతో పరిశోధనలు చేపట్టేందుకు నాసా చేపట్టిన కార్యక్రమమే ఆర్టిమిస్‌.

గత ఏడాది ఆర్టిమిస్‌–1 పేరుతో  వ్యోమగాములు లేకుండా ఒరాయెన్  అనే స్పేస్‌క్యాప్సూల్‌ను చంద్రుని చుట్టూ తిప్పా రు. వచ్చే ఏడాది ఆర్టిమిస్‌–2 పేరుతో ఒరాయెన్  స్పేస్‌ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తారు. ఈ నలుగురిలోనే క్రిస్టినా ఉంది. దాదాపు 10 రోజుల కాలంలో వీరంతా చంద్రుణ్ణి చుట్టి నేరుగా భూమిపైకి వస్తారు.

ఒరాయెన్  క్యాప్సూల్‌లో వ్యోమగాముల కోసం చేసిన ఏర్పాట్లు, లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఇది విజయవంతమైతే 2025లో ఆర్టిమిస్‌–3 ద్వారా వ్యోమగాములు, రోబోలు చంద్రుడిపైకి చేరి ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్టిమిస్‌–3లో పాల్గొనబోయే స్త్రీ వ్యోమగామి మళ్లీ క్రిస్టినాయే కావచ్చు.

ఎవరీ క్రిస్టినా కోచ్‌?
చంద్రుణ్ణి చుట్టి రావడానికి నలుగురు వ్యోమగాముల బృందంలో ఎంపికైన క్రిస్టినా కోచ్‌ ఆర్టిమిస్‌–2 యాత్రలో మిషన్‌ స్పెషలిస్ట్‌గా పని చేయనుంది. ఈమెతోపాటు మరో ముగ్గురు– జెరెమి హాన్సన్, విక్టర్‌ గ్లోవర్, రీడ్‌ వైజ్‌మెన్‌ ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిలో విక్టర్‌ గ్లోవర్‌ చంద్రుడి దాకా వెళ్లనున్న తొలి నల్ల జాతీయుడిగా చరిత్ర నమోదు చేయనున్నాడు. నార్త్‌ కరోలినాలో పుట్టి పెరిగిన క్రిస్టినా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేసింది.

2013లో నాసాలో చేరి స్పేస్‌ సైన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ల తయారీలో నైపుణ్యం సంపాదించింది. అంతే కాదు అంతరిక్షంలో ఒక్కరుగా గడిపే సమయంలో ఏర్పడే వొత్తిడి, రేడియేషన్‌ ప్రభావం, మెక్కల పెంపకం లాంటి అంశాల మీద పరిశోధనలు చేసింది. అందుకే 2019 మార్చి 14 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకూ ఐ.ఎస్‌.ఎస్‌ (ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌)లో గడిపి సుదీర్ఘకాలం అంటే 328 రోజులు అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా రికార్డు స్థాపించింది.

ఇంకా విశేషం ఏమిటంటే 2019 అక్టోబర్‌ 18న మరో మహిళా వ్యోమగామి జెస్సికా మెయర్‌తో కలిసి ఐ.ఎస్‌.ఎస్‌ నుంచి బయటకు వచ్చి దాని వెలుపల ఉండే ఒక భాగాన్ని రీప్లేస్‌ చేసింది. ఫలితంగా ఆల్‌ విమెన్‌ స్పేస్‌వాక్‌ చేసిన రికార్డు వీరిరువురూ నమోదు చేశారు. 

సొంత నేలపై ప్రేమ


క్రిస్టినా కోచ్‌కు ఫొటోలు తీయడం ఇష్టం. తరచూ ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతుంది. కాని అంతరిక్షం నుంచి ఆమె తీసిన ఒక ఫోటో మాత్రం ఆమె మరువలేదు. అది తను పుట్టి పెరిగిన నార్త్‌ కరోలినాప్రాంంతం ఫొటో. అంతరిక్షం నుంచి నార్త్‌ కరోలినాను మొదటిసారి చూసినప్పుడు ఆమె ఉద్వేగంతో ఊగిపోయింది. ఈ గడ్డలోనే కదా నేను ఇంతదాన్నయ్యాను అనుకుందామె. ఇటువంటి అనుభూతే ఆమెకు చంద్రుణ్ణి సమీపించినప్పుడు కలగవచ్చు. ఎందుకంటే చంద్రుడికి అతి దగ్గరగా వెళ్లిన తొలి మహిళ కదా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement