అభిషేక్, నిర్మల్
నవ్వడానికి... బడా బ్యాంకు బ్యాలెన్స్ అక్కర్లేదు. ఆధార్ కార్డ్ అంతకంటే అక్కర్లేదు. ఫ్రీగా నవ్వండి టెన్షన్‌ల నుంచి ఫ్రీ అవ్వండి’ అంటున్నారు ఈ రాజులు. నవ్వులరాజ్యం రారాజులు..
వార్తల నుంచి వంటల వీడియోల వరకు మనం రోజూ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో గడుపుతుంటాం. ‘స్టాటిస్టా’ లెక్కల ప్రకారం భారతీయులు రోజుకు సుమారు 2 గంటల 36 నిమిషాల సమయాన్ని సోషల్‌మీడియా కోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది.
‘కంటెంట్ క్రియేటర్’గా మారడం అనేది ట్రెండీయెస్ట్ కెరీర్‌గా మారింది. అనుకున్నంత మాత్రాన ‘కంటెంట్ క్రియేటర్’ అయిపోతారా? అనే ప్రశ్నకు ‘అదేం కాదు’ అని రెండు ముక్కల్లో జవాబు చెప్పవచ్చు. కంటెంట్ క్రియేటర్స్‌గా రాణించడానికి తారకమంత్రాలు...కష్టపడేతత్వం, సృజనాత్మకత, స్థిరత్వం.
ఫోర్బ్స్ ఇండియా, ఐన్‌సిఏ (గ్రూప్‌ఎం–సెల్ఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ సొల్యూషన్స్) తాజాగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, ఫిట్‌నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సోషల్‌వర్క్...ఇలా తొమ్మిది విభాగాల్లో నుంచి ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాను రూపొందించింది. ఈ తొమ్మిది విభాగాల్లో కామెడీ అగ్రస్థానంలో ఉంది.
కామెడీ విభాగంలో స్టార్స్‌గా మెరుస్తున్న కొందరు యువకులు...
ఇరవైనాలుగు సంవత్సరాల నిర్మల్ పిళ్లై కామెడీ కెరీర్‌ను సీరియస్ బిజినెస్‌గా చూస్తాడు. చెన్నైకి చెందిన ఈ మలయాళీ కుర్రాడు కాలేజీ రోజుల్లో కలం పట్టుకున్నాడు. కామెడీ ప్లేలు రాశాడు. అయితే అవి కాలేజీ ఆడిటోరియంకే పరిమితం.
కరోనా కాలంలో, లాక్‌డౌన్ రోజుల్లో అతడి కామెడీ స్కిట్‌లకు సోషల్ మీడియా వేదిక అయింది. ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది. ‘ఎవరీ పిళ్లై?’ అనే ఆసక్తిని పెంచింది. ప్రసిద్ధ ‘హ్యారీపోటర్’ను హాస్యరీతిలో అనుకరిస్తూ తాను సృష్టించిన కామెడీకి ఎంతో పేరు వచ్చింది.
ప్రయాణంలో ఉన్నప్పుడు చుట్టు జరిగే సంభాషణలను వినడం, హావభావాలను గమనించడం పిళ్లై అలవాటు. వాటిలో నుంచే కామెడినీ సృష్టించడానికి అవసరమైన అంశాలను ఎంచుకుంటాడు.
భోపాల్‌లో ఏప్రిల్ 1 సాయంత్రం..
‘ఏప్రిల్‌ఫూల్ డే’ సందర్భంగా కామెడీ షో ఏర్పాటు చేశారు. ఇలాంటి షో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దిల్లీ నుంచి ఎవరో కుర్రాడు వస్తున్నాడట...అనుకున్నారు జనాలు. దిల్లీ కుర్రాడు వచ్చేశాడు. ఆ ఉక్కపోతల ఎండాకాలపు సాయంత్రం ఊహించని భారీవర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు. నవ్వుల వర్షం!
‘తోడా సాప్ బోలో’ షోతో దేశ, విదేశాల్లో స్టాండ్–అప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు అభిషేక్. అభిషేక్‌ను చూసీ చూడగానే... ‘ఈ కుర్రాడా! కమెడియన్ పోలికలు బొత్తిగా లేవు. ఏం నవ్విస్తాడో ఏమో’ అనుకుంటారట ప్రేక్షకులు.
ఎప్పుడైతే అతడు మైక్ అందుకుంటాడో వారు మైమరిచి నవ్వుతారు. పాత నవ్వులను గుర్తు తెచ్చుకొని మళ్లీ నవ్వుతారు. ‘అబ్బ! ఏం నవ్వించాడ్రా కుర్రాడు’ అని అభిషేక్‌కు మౌఖిక సర్టిఫికెట్ ఇస్తారు.
గుర్‌గ్రామ్‌కు చెందిన విష్ణు కౌశల్ కామెడీ కంటెంట్ క్రియేటర్. నిత్యజీవిత వ్యవహారాలు, సంఘటనల్లో నుంచి కంటెంట్‌ను తీసుకొని కామిక్ వీడియోలను రూపొందిస్తుంటాడు. ఆ వీడియోల్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ‘అరే! నాకు కూడా అచ్చం ఇలా జరిగిందే’ అనుకోవచ్చు. యూట్యూబ్ కామిక్ వీడియోల నుంచి మొదలైన విష్ణు ప్రస్థానం ఇప్పుడు వోటీటీ కామెడీ సిరీస్, అడ్వర్‌టైజ్‌మెంట్‌ల వరకు వచ్చింది.
‘హాబీగా మొదలు పెట్టాను. ఇప్పుడు నవ్వించడమే నా వృత్తి అయింది’ నవ్వుతూ అంటున్నాడు విష్ణు కౌశల్.
‘ఈయన పరమ సీరియస్ మనిషి. నవ్వించండి చూద్దాం’ అని థానే (మహారాష్ట్ర)కు చెందిన ధృవ్ షా, శ్యామ్ శర్మలతో ఎప్పుడూ పందెం కాయవద్దు. ఈ హాస్యద్వయం గాలి తగిలితే ఆ సీరియన్ మనిషి నవ్వడమే కాదు, నవ్వు......తూనే ఉంటాడు!
ఫోర్బ్స్ ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటుచేసుకున్న కామెడిస్టార్స్‌లో వీరు కొందరు మాత్రమే. మరొక సందర్భంలో మరి కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment