సాక్షి, గుంటూరు మెడికల్: ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడడం, పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడడం, ఇంట్లో వంట తగ్గించేసి హోటళ్లలో సమయపాలన లేకుండా మసాలాలతో కూడిన ఆహారం అమితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు.
జీర్ణకోశ వ్యాధులపై ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఏళ్ల తరబడి ఎడాపెడా మందులు వాడుతూ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ చివరకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఒకింత వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రాథమిక దశలోనే జీర్ణకోశ వ్యాధులను కట్టడి చేయడంతోపాటు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
సొంత వైద్యంతో మొదటికే మోసం..
అల్సర్ సోకగానే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై వైద్యుల సలహాలు పాటించకుండా ఇష్టానుసారంగా మందులు వాడేస్తుంటారు. అల్సరుకు నెలల తరబడి గ్యాస్ మాత్రలు వాడవలసిన అవసరం లేదు. అల్సర్‌కు కారణం కేవలం (యాసిడ్) కాదు. హెచ్. పైలొరి బ్యాక్టీరియా లేదా నొప్పి మాత్రల వల్ల అల్సర్ సోకుతోంది.
అల్సరు తగ్గడానికి ఆ బ్యాక్టీరియా కోర్సు వాడితే సరిపోతోంది. అతిగా నొప్పి మాత్రలు వాడితే జీర్ణాశయానికి పుండ్లు పడతాయి. ఆ్రస్పిన్, నొప్పి మాత్రలు వాడుతున్న వారికి పొట్టనొప్పి, మంట వచ్చినా, నల్ల విరోచనాలు, నోటిలో రక్తం వచ్చినా వెంటనే ఎండోస్కోపి చేయించుకోవాలి.
జీర్ణాశయ క్యాన్సర్‌ను గుర్తించండి
ఫ్యాషన్ కోసం అలవాటు చేసుకునే చెడు వ్యసనాలు జీర్ణ కోశ వ్యాధులకు ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. సిగరేట్, మద్యం సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. అతిగా మద్యం తాగితే క్లోమం దెబ్బతింటుంది. తీవ్రమైన పొట్టనొప్పి, వాంతులు, నడుం నొప్పి, షుగరు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు.
సిగరెట్, మందు తాగేవారు. 50 సంవత్సరాల పైబడినవారు బరువు తగ్గుతున్నా, ఆకలిలేకున్నా, మింగటంలో ఇబ్బంది, రక్త హీనత, అతిగా వాంతులు ఉన్నా, వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు తాగితే నోటి, జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది. ఆహారనాళం పూర్తిగా మూసుకు పోతుంది. నోటిద్వారా ఆహారం తీసుకోలేరు. ఈలక్షణాలు ఉన్నవారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి.
పిల్లలకు చిల్లర ఇవ్వొద్దు
పిల్లలు తినుబండారాల కొనుగోలు కోసం మారం చేసి డబ్బులు అడిగినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో వారి చేతికి చిల్లర డబ్బులు ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆటలు ఆడుకునే సమయంలో నోటిలో పట్టేంత చిన్న బొమ్మలు, వస్తువులు ఇవ్వవద్దు. తద్వారా పిల్లలు అమాయకత్వంతో వాటిని నోటిలో పెట్టుకుని మింగుతారు. కొన్ని సందర్భాల్లో అది గొంతులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తలెత్తే ప్రమా దం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలకు ఏమీ తినిపించకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదిస్తే ఎండోస్కోపి ద్వారా చిల్లర నాణేలు, కడుపులో మింగిన వస్తువులు తొలగించవచ్చు.
చదవండి: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు!
ఆపరేషన్‌లు కొంత మందికి మాత్రమే..
ఈమధ్య బిజీ లైఫ్‌లో పడి సక్రమంగా మంచినీరు తీసుకోకపోవడం, త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, జీర్ణం కావడానికి సరిపడా సమయం ఇవ్వకపోవడం ద్వారా పసరు తిత్తుల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. పసరుతిత్తిలో రాళ్లు ప్రతి 100మందిలో 10మందికి ఉంటాయి. వీరిలో 75 శా తం మందికి వీటివలన ఏ ఇబ్బందీ రాదు. కేవలం పొట్టనొప్పి, కామెర్లు వచ్చినవారికి మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పసరు తిత్తి మార్గంలో రాళ్లు అడ్డుపడితే ఆపరేషన్ లేకుండా ఇ.ఆర్.సి.పి అను ఎండోస్కోపి పద్ధతిద్వారా తొలగించ వచ్చు.
తక్కువ తినండి..
జీర్ణకోశ వ్యాధులు రావడానికి మితిమీరిన ఆహారం తీసుకోవడమే కారణమవుతోంది. తిన్న ఆహారం జీర్ణం కాక శరీర బరువు పెరిగిపోయి వ్యాయామం లేకపోవడంతో లివరులో కొవ్వు చేరే ప్రమాదం ఉంది. మద్యం బాగా తాగే వారికి వచ్చే లివరు జబ్బులన్నీ వీరికి రావచ్చు. తక్కువ తిని ఎక్కువగా నడవాలి. కోతకుట్టులేకుండా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పొట్టలో ఎటువంటి గడ్డలు అయినా పరీక్షించి ముక్క పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
– డాక్టర్ షేక్ నాగూర్ బాషా, లివర్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment