ఇటీవల జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా వేదిక మీద నడుస్తూ ఉంటే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె ధరించిన అచ్చమైన బంగారంతో రూపొందించిన మణిపూర్ సంప్రదాయ బ్రైడల్ డ్రెస్ స్పెషాలిటీని చూపుతిప్పుకోనివ్వలేదు.
ఈ ఏడాది జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో డిజైన్ చేసిన పాట్లోయ్ డ్రెస్‌లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది. ఈ ప్రత్యేక సందర్భం కోసం ఆమె బంగారు జరీ దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు పాట్లోయ్‌ను ధరించింది. సాధారణంగా వధువులు ధరించే సంప్రదాయ దుస్తుల మధ్య ఊర్వశి అద్భుతంగా మెరిసిపోయింది.
ప్రఖ్యాత మణిపురి డిజైనర్ రాబర్ట్ నౌరెమ్ రూపొదించిన ఈ దుస్తులలో మణిపూర్‌లోని మెయిటీ కమ్యూనిటీ సాంస్కృతిక గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాధారణంగా మణిపూర్ వధువులు ఈ దుస్తులను ధరిస్తారు. పాట్లోయ్ అనేది వారి సంప్రదాయంలోని ప్రత్యేకమైన, ఐకానిక్ డ్రెస్.
క్లిష్టమైన వర్క్
స్థూపం, డ్రమ్ ఆకారపు స్కర్ట్‌ని పాట్లోయ్ అంటారు. మణిపురి బ్రైడల్‌ని ప్రత్యేకంగా చూపే వాటిలో ఇది అత్యంత ముఖ్యమైనది. మందపాటి ఫైబర్, వెదురుతో డ్రమ్ ఆకారం చేసి, శాటిన్ క్లాత్‌ని చుడతారు. దానిని థ్రెడ్‌వర్క్, సీక్విన్స్, అద్దాలతో భారీగా అలంకరిస్తారు. స్కర్ట్‌పైన చేసే వారి హస్తకళ చాలా క్లిష్టమైనది. ఒక పాట్లోయ్‌ని పూర్తి చేయడానికి కొన్ని రోజుల పాటు కృషి చేస్తారు. దీనికి అలంకరణగా నడుము పట్టీ, వధువు తలమీదుగా కప్పే షీర్ వీల్, మోచేతులవరకు ఉండే జాకెట్టుతో ఈ డ్రెస్‌కు పూర్తి లుక్ వస్తుంది. ఇతర అలంకరణలో లేయర్డ్ నెక్లెస్‌లు, కోక్‌గీ లీటెంగ్‌గా పిలిచే కేశాలంకరణ ఆభరణాలు ప్రత్యేకమైనవి.
పాట్లోయ్ చరిత్ర
పాట్లోయ్ మూలాలు మెయిడింగు భాగ్యచంద్ర మహారాజ్ (1763–1798) పాలనలో గుర్తించినట్టు చారిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతను శాస్త్రీయ రాస్–లీలా నృత్యానికి ఈ దుస్తులను పరిచయం చేశాడు. కాలక్రమేణా ఇది మెయిటీ వధువుల సంప్రదాయ వివాహ దుస్తులలో భాగమైంది. దీంతో వీరికి పాట్లోయిస్ సృష్టించే కళ తరతరాలుగా సంక్రమించింది.
అధికారిక సంస్థల కంటే కుటుంబాలలో నేర్చిన నైపుణ్యాలతో పాట్లోయ్‌ను రూపొందించడం అనేది శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దీని తయారీలో చాలా మంది కళాకారులు పాల్గొంటారు. అందుకే, దీనిని సామూహిక సమాజ ప్రయత్నంగా చెబుతారు. తన వేషధారణ ఎంపిక ద్వారా, ఊర్వశి ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాకుండా మణిపూర్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో సహాయపడింది.
డిజైనర్ రాబర్ట్
రాబర్ట్ నౌరెమ్ ఈశాన్య భారతదేశంలోని సాంప్రదాయ ఫ్యాషన్‌ను హైలైట్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. అతను గతంలో సుస్మితా సేన్, హర్నాజ్ కౌర్ సంధు, లారా దత్తా వంటి ప్రముఖ వ్యక్తులకు ఇన్నాఫీ, ఫనెక్ వంటి సాంప్రదాయ మణిపురి దుస్తులలో మెరిపించాడు. ఇన్నాఫీ అనేది బ్లౌజ్‌పై ధరించే తేలికపాటి మస్లిన్ శాలువా. ఫనెక్ అనేది మణిపురి మహిళలు సాధారణంగా ధరించే చారలతో కూడిన చీరలాంటి వస్త్రం. ఈ ఏడాది గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో మొదటిసారిగా ఊర్వశి రౌతేలా చేత మణిపురి బ్రైడల్ డ్రెస్‌ను ధరింపజేసి అంతర్జాతీయ ప్రేక్షకులకు
ఆకట్టుకున్నారు.
(చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?)
Comments
Please login to add a commentAdd a comment