సెమినార్‌లో మేఘా భాటియా (ఫైల్)
మేఘా భాటియా... యానిమేటెడ్ చిత్రాల రూపకర్త. పిల్లల లైంగిక దోపిడీ గురించి అర్థం అయ్యేలా చెప్పాలనే ఆమె ప్రయత్నం ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. తను రూపొందించిన చిత్రాల ద్వారా ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ని పిల్లలు అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. మేఘా మొదట పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ చేసింది. దీనిని హిందీతోపాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేసింది. సినిమా పేరు ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’. మేఘాకు ‘అవర్ వాయిస్’ అనే ఎన్జీఓ కూడా ఉంది. దీని ద్వారా ఆమె సెమినార్లను నిర్వహించి మరీ విషయాలను రాబడుతుంది.
పిల్లల లైంగిక వేధింపులు.. సమాచార సేకరణ
ఢిల్లీలో రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న మేఘా భాటియా లండన్ యూనివర్శిటీ కాలేజ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందింది. అక్కడే ఒక పరిశోధన ప్రాజెక్ట్ సమయంలో పిల్లల లైంగిక వేధింపుల గురించిన సమగ్ర సమాచారం ఆమెకు లభించింది. ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. తను ఎంచుకున్న అంశం మీద ఎంతో సమాచార సేకరణ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పిల్లలతో సంబంధం ఉన్న 1,06,958 కేసులలో 36,022 కేసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డవే. వీరిలో సగం మంది పిల్లలు నేరాలకు పాల్పడతారనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో నివేదికలో రాయడం లేదని తెలిసింది. ఇలాంటి పిల్లలకు సాయం చేయడానికి మేఘ యానిమేషన్ చేయడం ప్రారంభించింది.
పిల్లలకు తెలియదు.. పెద్దలు అర్థం చేసుకోరు!
యానిమేషన్ సినిమాలు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకే, వాటి ద్వారానే పిల్లలకు లైంగిక విద్యను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మేఘ. ‘‘నిజానికి పిల్లలకు సంబంధించిన నేరాలు చాలా మటుకు వారికి తెలియకుండానే జరుగుతాయి. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, ‘నా పట్ల ఒకరు అసహ్యంగా ప్రవర్తించారని అమ్మకు చెప్పాను. మరోసారి ఇలాంటి మాటలు చెబితే కొడతాన’ని చెప్పింది’ అని ఆ పాప చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది’ అన్నారు మేఘ. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలకు సురక్షితమైన వాతావరణం అవసరమని మేఘా గ్రహించింది. ఆ ఆలోచనతోనే ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’ పేరుతో పది నిమిషాల నిడివిగల యానిమేటెడ్ సినిమా రూపొందించింది. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో నివసిస్తున్న 100 మందికి పైగా న్యాయవాదులు, ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత మేఘా ఈ చిత్రాన్ని రూపొందించింది. మేఘ చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లల క్షేమం కోసమే. పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్లో అవగాహన తీసుకురావాలి. పెద్దలూ అర్థం చేసుకోవాలి. (చదవండి: ఆమె ఒక నడిచే గ్రంథాలయం)
Comments
Please login to add a commentAdd a comment