![Grihasthashram is unique..special story - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/15/for-chaganti%2012..jpg.webp?itok=yjPa9rsZ)
గృహస్థాశ్రమ వైశిష్ట్యం
ఒక వయసులో ఒక స్త్రీ ఒకపురుషుడికి నచ్చిందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీకి నచ్చాడనీ...కాబట్టి కలసి జీవించడం... అనేది శాస్త్ర సమ్మతం కాదు. కాలం గడిచేకొద్దీ ధనం వెళ్ళిపోతుంది, నీ వాళ్ళనుకున్న వాళ్ళు వెళ్లిపోతారు, అధికారం పోతుంది, జ్ఞాపకశక్తి కూడా పోతుంది.. అన్నీ పోతాయి... అలాగే యవ్వనం కూడా. కానీ మిగిలిపోయేది ఏదయినా ఉంటే.. ఆ వ్యక్తి ధార్మికంగా బతికాడా..అన్నదే!
పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వారిద్దర్నీ ఎందుకు కలుపుతున్నారు... ప్రస్థానం అంటే వారిద్దరూ కలిసి ఏం చేయాలి? అన్న దాని గురించి అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు గురువుని తీసుకొచ్చి మంచి విషయాలు చెప్పిస్తారు. దానిని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి ‘‘మీరు వివాహం చేసుకోవాలి. ఇద్దరూ అన్యోన్యంగా బతకడం మీద ఎన్నో జీవితాల అభ్యున్నతి ఆధారపడి ఉంది.
ఈ ఏర్పాటు మీ వ్యక్తిగత జీవితం కోసం మాత్రమే కాదు సుమా! మీ పెద్దల కీర్తి ప్రతిష్ఠలు, నీ తోబుట్టువుల తృప్తి, మీ బిడ్డల భవిష్యత్తు.. ఇలా చాలా ముడిపడి ఉన్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. దీనిని మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అవగాహనపరిచే ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్న గొప్పదనం.
అన్నపానీయాలుగానీ, మరేవయినాగానీ వాటిని సంస్కరించకుండా స్వీకరించం. అటువంటి ఒక ఏర్పాటును నీవు జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు.. ఇక అక్కడినుంచి నీ జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది బ్రహ్మచర్యం అన్న కట్టువిప్పి గృహస్థాశ్రమం అన్న కొత్తకట్టు వేయడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్నమాట ఉండదు. కారణం – ఆ ఆశ్రమంలో క్రమశిక్షణ, విద్యాభ్యాసం, గురువుపట్ల చూపే గౌరవమర్యాదలు ...ఇవన్నీ ఉన్నాయి.
గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ కట్టుబాటు ఎటు పోయింది? ఎటూ పోలేదు. దాని మీద మరో కట్టు వచ్చి చేరింది. కట్టుమీద కట్టు. ΄పొలంలో పచ్చిగడ్డికోసి మోపుకట్టిన తండ్రిని చూసి కొడుకు ‘‘మోపు గట్టిగా కట్టలేదు’’ అంటే తండ్రి బాధపడతాడని... ‘‘అది వదులుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది, మరో కట్టు వేస్తాను’’ అని మోపును మోకాళ్ళతో అదిమి గట్టిగా కట్టి తలమీద పెట్టుకుని ఇంటిబాట పడతాడు.
తండ్రి వేసిన కట్టును విప్పి ఆయనను అగౌరవ పరచలేదు. ఆ కట్టు వదులుగా ఉన్నందువల్ల ఎక్కడో దానంతట అదే జారిపోయింది. అంతే.గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యంలో ఏ బంధాలున్నాయో అవి, అక్కడ అలవర్చుకున్న సంస్కారం మాత్రం జీవితాంతం ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎలా సంస్కరిస్తే వ్యక్తి జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమయిన విషయాలను అందించి ఆశ్రమాన్ని మారుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment