బ్యూటీ టిప్స్
►బీట్‌రూట్ ఒకటి తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. రెండు ఉసిరి కాయలను గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. వీటికి పన్నెండు రెమ్మల కరివేపాకు, గ్లాసు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద మరిగించాలి. చక్కగా మరిగాక దించేసి చల్లారిన తరువాత ఈ రసాన్ని వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ టానిక్‌ను వారానికి రెండు మూడుసార్లు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. రెండు గంటల తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చే స్తే కుదుళ్లకు పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు ఊడడం తగ్గుతుంది. చివర్లు చిట్లకుండా చక్కగా పెరుగుతాయి.
► మరుగుతున్న రెండు గ్లాసుల నీటిలో మూడు టేబుల్ స్పూన్ల టీ పొడి, పది గులాబీ పువ్వులు వేసి పదినిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో పోయాలి. తలస్నానం చేసిన జుట్టుకు ఈ డికాషన్‌ను పట్టించి, టవల్ చుట్టుకోవాలి. నీటితో కడగకూడదు. ఇది కండీషనర్‌లా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
► చాలామంది జుట్టుకు నూనె రాసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు జీవం కోల్పోతుంది. అందుకే తలస్నానానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనెను తలంతా పట్టించాలి. 2 గంటల తర్వాత స్నానం చేస్తే జుట్టు పుట్టుకుచ్చులా మెరుస్తుంది.
► కోడిగుడ్లులోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. వారానికి ఒకసారి ఎగ్‌వైట్‌ను కుదుళ్లకు పట్టించి 20-30 నిమిషాలు పట్టించి, ఆ తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, సిల్కీగా మారుతుంది.
► రెండు టేబుల్ స్పూన్ల మందారం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
► రెండు టేబుల్ స్పూన్ల ఎండిన మందారాల పొడికి కలబంద, ఉసిరి పొడి, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే తెల్లని జుట్టు సమస్య తగ్గుతుంది.
జెల్ మెరుపులు
టేబుల్ స్పూను పంచదార పొడిలో స్పూను వేడినీళ్లు పోసి కలపాలి. దీన్లో రెండు టీస్పూన్ల పచ్చి పాలు, స్పూను అలోవెరా జెల్ వేసి కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. పదినిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మానికి తేమ అంది, మృదువుగా నిగారింపుతో కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment