గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్‌ వర్కౌట్స్‌ ఇవే! | Have A Desk Job These Incredibly Exercises If You Sit A Lot | Sakshi
Sakshi News home page

గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్‌ వర్కౌట్స్‌ ఇవే!

Published Sun, Nov 3 2024 2:03 PM | Last Updated on Mon, Nov 4 2024 9:42 AM

Have A Desk Job These Incredibly Exercises If You Sit A Lot

డెస్క్‌ జాబ్‌ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం సహజం. చెయిర్‌లో లేదా యోగా మ్యాట్‌ మీద కూర్చుని చేసే  వ్యాయామాలు కొన్ని ఉంటాయి. వీటిని సాధన చేయడం వల్ల పొట్ట భాగం చదునుగా అవుతుంది. దీంతోపాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాల గురించి తెలుసుకొని, ఆచరణ లో పెడదాం.. 

సీటెడ్‌ లెగ్‌ లిఫ్ట్స్‌
కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలపై అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలిని కూడా అదేవిధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. 

కుర్చీ హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్లపాటు అదే పొజిషన్‌లో ఉంచాలి. దీనివల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఈ ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు చెయిర్‌ గట్టిగా, ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. 

ఆబ్లిక్‌ ట్విస్ట్‌
నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది.  

సీటెడ్‌ క్రంచెస్‌
చెయిర్‌ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్‌ మీద నుంచి అదే భంగిమలో కొద్దిగా పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధాస్థితికి రావాలి. ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ వ్యాయామాన్ని చేయచ్చు. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. 

సీటెడ్‌ బైస్కిల్‌ పెడల్స్‌ 
చెయిర్‌లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్‌ చూసుకొని, కాళ్లను సైకిల్‌ పెడల్‌ తొక్కినట్టుగా కదలికలు చేయాలి.  ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. 

టో టచెస్‌
కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధాస్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది.  

(చదవండి: ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాదులను నివారించొచ్చు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement