ప్రతీకాత్మక చిత్రం
Do Not Hold Urine For Long Time: మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేయలేం కదా? అది ఎప్పుడు వస్తే అప్పుడే విసర్జన చేసేది కదా... దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అని చికాకు పడకండి. ఎందుకంటే స్కూలుకెళ్లే పిల్లలు మూత్రానికి వెళ్లవలసి వచ్చినా, టీచర్‌ని అడగడానికి సిగ్గుపడి అడగరు. ఒకోసారి అడిగినా, టీచర్లు పంపకపోవచ్చు వాళ్లు ఆ వంక పెట్టి బయటకు వెళ్లొస్తుంటారని!
దాంతో వాళ్లు ఆపుకోలేక చాలా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్లు కూడా ఒకోసారి కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తుంటారు. అయితే అలా మూత్రం వచ్చిన వెంటనే ఆ పని కానివ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వైద్యులు. అవేమిటో చూద్దాం. ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతోపాటు బయటకి తీసుకెళ్ళే ద్రవపదార్థమే మూత్రం. మరి ఆ మలినాలను ఎప్పటికప్పుడు బయటకి పంపాలి కాని ఆపితే ఎలా? ఇది మంచి అలవాటు కాదు. దీనివలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? మీరే చూడండి.
సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి. బ్లాడర్ పరిమాణం ఇంకొద్దిగా పెరుగుతుంది. ఇలా పెరగడం మంచిదనుకుంటున్నారేమో...కానే కాదు. ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి.
దాంతో మూత్ర విసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోవచ్చు. ఇలా చేయడం వలన మలినాలు ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి. మూత్రాన్ని అలా ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారతాయి. ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారతాయి. ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటే, అవి ఇంకా బంకగా మారి, మరింత పెద్ద రాళ్లు వస్తాయి.
ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. మూత్రాన్ని ఆపుకోవడం వలన కిడ్నీల్లో స్టోన్స్, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ మహిళల్లోనే ఎక్కువ. ఎందుకంటే పురుషుల మాదిరి ఎక్కడపడితే అక్కడ మహిళలు మూత్రాన్ని విసర్జించలేరు కాబట్టి ఆపుకునే అలవాటు వారిలో ఎక్కువగా ఉండటం ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. ఈ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మాటిమాటికి మూత్రం వస్తుంది, మూత్రంలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి బ్లాడర్ ఖాళీగా ఉన్నా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది.
అదే తీవ్రమైన సమస్య. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అందుకే ద్రవపదార్థాలను ప్లాన్డ్ గా తీసుకోవాలి. బస్సుల్లో దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసు మీటింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోవడం కొంత మెరుగు, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మాత్రం డ్రైవర్‌కి చెప్పి బస్ ఆపించడానికి మొహమాటపడద్దు. ఎందుకంటే ఒకోసారి అది ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment