రీల్స్‌ పిచ్చి వర్సెస్‌ చదువు..! | Health Tips, How Social Media Is Impacting Children Focus And Learning, Know How Parents Can Guide Teens In The Age Of Reels | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి వర్సెస్‌ చదువు..!

Mar 1 2026 9:03 AM | Updated on Mar 1 2026 12:13 PM

Health Tips: How social media is impacting children's focus and learning

ఒకప్పుడు పిల్లలు ‘పెద్దయ్యాక కలెక్టర్‌ అవుతాను’ అనేవారు, కానీ నేడు ‘ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవుతాను’ అంటున్నారు. చదువును పక్కన పెట్టి, గంటల తరబడి స్క్రోలింగ్‌ చేస్తూ, నిరంతరం రీల్స్‌ షూటింగులతో బిజీగా ఉంటున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం అలవాటు కాదు, ఒక తీవ్రమైన మానసిక పరిణామం. చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్ళల్లో రీల్స్‌ కలలు ఉన్న టీనేజర్లను సరిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు.

మెదడులో డోపమైన్‌ యుద్ధం
టీనేజర్ల మెదడులో ‘ప్రీ–ఫ్రంటల్‌ కార్టెక్స్‌’ (నిర్ణయాలు తీసుకునే భాగం) పూర్తిగా అభివృద్ధి చెందదు. కాని, ఆనందాన్ని వెతికే ‘రివార్డ్‌ సిస్టమ్‌’ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ లేదా వీడియో గేమ్స్‌ ‘వేరియబుల్‌ రివార్డ్స్‌’ సూత్రంపై పనిచేస్తాయి.  

స్వైప్‌ చేసిన ప్రతిసారి, తర్వాతి వీడియోలో ఏముందో తెలియని ఆ కుతూహలం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. చదువులో ఫలితం రావడానికి ఏడాది పడుతుంది కాని, రీల్‌కు లైక్స్‌ రావడానికి సెకన్లు చాలు. అందుకే ఈ ‘తక్షణ తృప్తి’ కోసం మళ్లీ మళ్లీ రీల్స్‌ చూస్తుంటారు, చేస్తుంటారు. 

చదువు వర్సెస్‌ వైరల్‌ ఫేమ్‌
చాలామంది టీనేజర్లు చదువు మానేసి రీల్స్‌ చేయడం వెనుక ‘గుర్తింపు కాంక్ష’ ఉంటుంది. కాని, పదివేల మంది ఫాలోవర్లు ఉండటం వల్ల జీవితం సెటిల్‌ అయిపోదు. సోషల్‌ మీడియా అల్గారిథమ్స్‌ మారగానే ఆ గుర్తింపు కనుమరుగవుతుంది.నిరంతరం షూటింగులు, ఎడిటింగ్‌ ఆలోచనలతో ఉండటం వల్ల మెదడు ‘హైపర్‌–యాక్టివ్‌’ స్థితిలో ఉంటుంది. 

ఫలితంగా, నిశ్శబ్దంగా కూర్చుని చదువుకోవడం వారికి అసాధ్యంగా మారుతుంది.చదువును నిర్లక్ష్యం చేస్తూ, కేవలం ‘వైరల్‌’ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీనేజర్లను డీల్‌ చేయడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. వారిని మొండితనం వైపు నెట్టకుండా, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడానికి ఉపయోగపడే ఐదు కౌన్సెలింగ్‌ చిట్కాలు మీకోసం.

1. ‘వై నాట్‌’కి బదులుగా ‘హౌ’
పిల్లలు రీల్స్‌ చేస్తామంటే ‘వద్దు, చేయకూడదు’ అని మొండిగా చెప్పకండి. అది వారిని తిరుగుబాటు వైపు నెడుతుంది. ‘నువ్వు కంటెంట్‌ క్రియేటర్‌ అవ్వాలనుకోవడం మంచిదే కాని, ఒక సక్సెస్‌ఫుల్‌ క్రియేటర్‌ కావాలంటే నీకు కమ్యూనికేషన్‌ స్కిల్స్, స్క్రిప్ట్‌ రైటింగ్, అనలిటికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అవి నీకు చదువు ద్వారానే వస్తాయి’ అని వారితో ఒక ప్రొఫెషనల్‌లాగా మాట్లాడండి. చదువును వారి ఎదుగుదలకు ఒక అడ్డంకిగా కాకుండా, ఒక సాధనంగా చూపించండి.

2. ‘ఇన్‌స్టంట్‌ ఫేమ్‌’ వర్సెస్‌ 
‘లాంగ్‌ టర్మ్‌ సెక్యూరిటీ’ టీనేజర్లకు భవిష్యత్తు గురించి స్పష్టత ఉండదు. అందుకే క్లాసులో వచ్చే మొదటి ర్యాంక్‌ కంటే రీల్స్‌కు వచ్చే లైక్స్‌ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ‘ఈ రోజు వైరల్‌ అయిన వీడియో రేపు ఉండదు. కాని, నువ్వు సంపాదించే డిగ్రీ లేదా నైపుణ్యం జీవితాంతం నీకు అన్నం పెడుతుంది’ అని సోషల్‌ మీడియా వెనుక ఉన్న ‘షెల్ఫ్‌ లైఫ్‌’ గురించి వివరించండి. ముఖ్యంగా ఫేడౌట్‌ అయిపోయిన పాత ఇన్‌ఫ్లూయెన్సర్ల ఉదాహరణలు చెప్పండి.

3. ‘ప్రొడక్షన్‌ టైమ్‌’ ఫిక్స్‌ చేయండి
పిల్లలు చదువు మధ్యలో రీల్స్‌ షూటింగ్‌ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. వారానికి ఒక రోజు, రెండు గంటలు మాత్రమే షూటింగ్‌ సమయంగా కేటాయించండి. మిగిలిన ఆరు రోజులు చదువుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నీ చదువు గ్రాఫ్‌ పడిపోతే, ఈ షూటింగ్‌ టైమ్‌ రద్దవుతుంది’ అనే పాజిటివ్‌  కండిషన్‌ పెట్టండి.

4. అకడమిక్‌ రివార్డ్‌ సిస్టమ్‌
వారికి నచ్చిన రీల్స్‌ చేసే హక్కును వారు ‘సంపాదించుకోవాలి’. ఉదాహరణకు ఒక చాప్టర్‌ పూర్తి చేస్తే 15 నిమిషాల ఎడిటింగ్‌ టైమ్‌. వీక్లీ టెస్ట్‌లో మంచి మార్కులు వస్తే, ఒక కొత్త రీల్‌ షూట్‌ చేసుకునే అవకాశం. ఇలా చేయడం వల్ల వారు చదువును ఒక శిక్షలా కాకుండా, తమకు నచ్చిన పనిని చేయడానికి ఒక మార్గంగా చూస్తారు.

5. డిజిటల్‌ ఐడెంటిటీని గౌరవించండి
పిల్లలకు గుర్తింపు కావాలి. ఇంట్లో ఆ గుర్తింపు దొరకనప్పుడు వారు బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తారు. అందుకే రీల్స్‌ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తించండి. వారిని ఒక ‘క్రియేటర్‌’గా గౌరవిస్తూనే, ఒక ‘స్టూడెంట్‌’గా బాధ్యతలను గుర్తు చేయండి.

నైవర్‌ మైండ్‌..!
ప్రతిరోజూ మన మెదడులో దాదాపు 50 వేల నుంచి 70 వేల ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. వీటిలో సుమారు 60 నుంచి 70 శాతం ప్రతికూలమైన ఆలోచనలే! కాబట్టి పరీక్షల సమయంలో తలెత్తే ప్రతికూల ఆలోచనలను పెద్దగా పట్టించుకోకండి. 
సైకాలజిస్ట్‌ విశేష్‌, ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌ 

(చదవండి: ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! లోపాలను దాచొద్దు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement