బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు.
అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్‌ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్‌లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది.
పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్‌కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు.
ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్‌లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా.
‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది.
వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ జహీదుల్ ఇస్లామ్‌ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం.
సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్‌ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment