వంట చేయడం ఓ కళ. అందరికీ తెలిసిన రెసిపే అయినా ఒకొక్కరి చేతిలో అమృతంలా మారుతుంది. దాన్నే చేతి మహిమ అంటుంటాం. అయితే ఇక్కడున్న పాకశాస్త్ర ప్రవీణులంతా తలలు పండిన పెద్దలు కాదు. బుల్లిబుజ్జాయిలు. ఎవరైనా తినిపిస్తే కానీ తినడం చేతకాని వయసులోనే గరిటె పట్టిన అభినవ నలభీములు.
నిహాల్ రాజ్
‘లిటిల్ షెఫ్ కిచ్చా’ అనే పేరుతో పాపులర్ అయిన నిహాల్ రాజ్.. దేశీవాసులకు సుపరిచితుడే. కేరళకు చెందిన పిల్లోడు. 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ విజేతగా నిలిచాడు. నిహాల్ తయారు చేసిన ‘మిక్కీ మౌస్ మ్యాంగో ఐస్ క్రీమ్’కి ప్రత్యేకమైన హక్కులను పొందేందుకు ఫేస్‌బుక్ ఈ అబ్బాయికి 2,000 డాలర్లు చెల్లించింది. పదమూడేళ్ల ఈ లిటిల్ షెఫ్.. తన యూట్యూబ్ చానెల్‌లో రకరకాల వంటలు వండుతూ, ఎవరికీ తెలియని రుచులను పరిచయం చేస్తున్నాడు. సోషల్ మీడియాలోని భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.
ఒమారీ మెక్‌క్వీన్
లండన్ కి చెందిన ఒమారీ మెక్‌క్వీన్ అనే 14 ఏళ్ల కుర్రాడు వెజిటేరియన్ వంటగాడు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో వేల మంది హృదయాలను కొల్లగొట్టాడు. ఎనిమిదేళ్ల వయస్సులోనే యూట్యూబ్ చానెల్‌ని స్టార్ట్ చేశాడు. ఇంగ్లండ్, క్రోయ్‌డన్‌లోని ‘"Dipalicious (డిలీషియస్)’ అనే రెస్టారెంట్‌కి సీఈఓ కూడా. శాకాహారి షెఫ్‌గా ఈ బుల్లోడు ఎన్నో అవార్డ్‌లను అందుకున్నాడు. వంటలకు సంబంధించి పలు చిట్కాలను చెబుతూ పుస్తకాలూ రాశాడు. ఒమారీకి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోవర్స్ ఎక్కువే. ఇన్‌స్టాలో తన కుకింగ్ వీడియోలతో పాటు.. కుటుంబంతో గడిపే ఆత్మీయ క్షణాలను రీల్స్‌లా మలచి షేర్ చేస్తుంటాడు.
కేంబ్రియా
కాలిఫోర్నియాకు చెందిన కేంబ్రియా.. నాలుగేళ్ల వయసు నుంచే జూనియర్ షెఫ్‌గా తన ఫాలోవర్స్‌కి రకరకాల వంటకాలను ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచంలోనే అతి పిన్న వయసు షెఫ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నెలల వయసు నుంచే కేంబ్రియా మంచి ఫుడీ. ప్రస్తుతం ఈ పాపకు పదేళ్లు దాటాయి. సోషల్ మీడియాలో వంటల వీడియోలు, రీల్స్‌తో బిజీగా ఉంటుంది. పలు రెస్టారెంట్స్‌కి వెళుతూ అక్కడి వంటకాలను రుచి చూసి.. రివ్యూలు ఇస్తూంటుంది. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా అక్కడున్న షెఫ్ దగ్గర ఒక కొత్త వెరైటీ వంటకాన్ని నేర్చుకుని.. వీలైతే అక్కడే స్వయంగా వండి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment