నోరూరించే ఆలూ శాండ్‌ విచ్‌ తయారీ విధానం.. | How to make aloo sandwich at home | Sakshi
Sakshi News home page

Aloo sandwich: నోరూరించే ఆలూ శాండ్‌ విచ్‌ తయారీ విధానం..

Published Mon, May 2 2022 10:07 AM | Last Updated on Mon, May 2 2022 11:26 AM

How to make aloo sandwich at home - Sakshi

పన్నిర్‌ పొటాటో కార్న్‌బాల్స్‌ 

కావలసినవి: ఉడికించిన బంగాళ దుంప ముక్కలు – ఒకటిన్నర కప్పు, సన్నగా తరిగిన పన్నిర్‌ – కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను, ఉడికించిన స్వీట్‌ కార్న్‌ – అర కప్పు, చీజ్‌ తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, గోధుమ పిండి – ముప్పావు కప్పు (కప్పు నీళ్లల్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి), బ్రెడ్‌ పొడి – రోలింగ్‌కు సరిపడా, ఆయిల్‌ – డీప్‌ ఫ్రైకు సరిపడా, ఉప్పు – రుచికి తగినంత. 
సాస్‌: బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, మైదా – రెండు టేబుల్‌ స్పూన్లు, పాలు – ముప్పావు కప్పు.  

తయారీ: ∙ముందుగా స్టవ్‌ మీద బాణలి పెట్టి బటర్‌ వేయాలి. బటర్‌ వేడెక్కిన తరువాత మైదా వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు పాలు పోసి సన్నని మంట మీద మూడు నిమిషాలు తిప్పుతూ ఉడికిస్తే సాస్‌ రెడీ అవుతుంది. దీనిని పక్కన పెట్టాలి. ∙బంగాళ దుంప ముక్కలు , పన్నీర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్వీట్‌ కార్న్, చీజ్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలోనే సాస్‌ కూడా వేసి కలపాలి.

∙ఈ మిశ్రమాన్ని గుండ్రని మీడియం సైజు బాల్స్‌లా చుట్టుకోవాలి. ∙బాల్స్‌ను కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో ముంచి, తరువాత బ్రెడ్‌ పొడిలో ముంచాలి. ∙బాల్‌కు చక్కగా కోటింగ్‌ పట్టిన తరువాత డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ∙గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి బాల్స్‌ మారితే పన్నిర్‌ పొటాటో కార్న్‌ బాల్స్‌ రెడీ. చట్నీ, టొమాటో కెచప్‌లతో వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. 

మూంగ్‌ దాల్‌ చిల్లా 
కావలసినవి: పొట్టుతీసిన పెసరపప్పు – కప్పు, పసుపు – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను, వేయించిన జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, అల్లం తరుగు – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్‌ – చిల్లా వేయించడానికి సరిపడా. 
తయారీ: ∙ముందుగా పెసరపప్పుని మూడు నాలుగు సార్లు కడిగి మూడు కప్పులు నీళ్లుపోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. సమయం తక్కువగా ఉన్నప్పుడు కనీసం నాలుగు గంటలైనా నానబెట్టాలి. 

∙పప్పు నానాక నీళ్లు తీసేసి గరిట జారుడుగా  రుబ్బుకోవాలి. ∙రుబ్బిన పిండిలో పసుపు, కారం, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙ఈ మిశ్రమంలోనే కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, ఇంగువ వేసి కలిపి ఇరవై నిమిషాలపాటు పక్కనబెట్టాలి. ∙ఇరవై నిమిషాల తరువాత పిండి మరీ మందంగా అనిపిస్తే..కొద్దిగా నీళ్లు పోసుకుని దోశపిండిలా కలుపుకోవాలి ∙వేడెక్కిన పెనంపై కొద్దిగా ఆయిల్‌ వేసి దోశలా పోసుకోవాలి. ∙దోశను రెండు వైపులా క్రిస్పీగా, బ్రౌన్‌ రంగులోకి మారేంత వరకు కాల్చితే మూంగ్‌ దాల్‌ చిల్లా రెడీ. ∙టొమాటో సాస్, చట్నీతో రుచిగా ఉంటుంది. 
ఆలూ శాండ్‌ విచ్‌ 
కావలసినవి: ఉడికించిన బంగాళ దుంపలు – రెండు (మెత్తగా చిదుముకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను, కారం – అరటీస్పూను, చాట్‌ మసాలా – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, బ్రెడ్‌ స్లైసులు – ఎనిమిది, టొమాటో సాస్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు, గ్రీన్‌ సాస్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు, టొమాటో – ఒకటి( సన్నగా చక్రాల్లా తరగాలి), మిరియాల పొడి – టీస్పూను, చీజ్‌ తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు, బటర్‌ – రోస్ట్‌కు సరిపడా. 

తయారీ: ∙గిన్నెలో చిదుముకున్న బంగాళ దుంపలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, కొత్తిమీర తరుగు, కారం, చాట్‌ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙రెండు బ్రెడ్‌ స్లైసులను తీసుకుని ఒక స్లైసుకు టొమాటో సాస్, మరో స్లైసుకు గ్రీన్‌ చట్నీ రాయాలి. ∙గ్రీన్‌ చట్నీ రాసిన స్లైసు మీద టొమాటో ముక్కలు పరిచి, వాటి మీద దుంపల మసాలా మిశ్రమాన్ని పెట్టాలి. దీని మీద మిరియాలపొడి, చీజ్‌ను చల్లాలి. ∙ఈ స్లైస్‌కు టొమాటో సాస్‌ రాసిన  బ్రెడ్‌స్లైస్‌ను పెట్టి బటర్‌తో రోస్ట్‌ చేస్తే ఆలూ    శాండ్‌ విచ్‌ రెడీ.  
బ్రెడ్‌ వడ 
కావలసినవి: బ్రెడ్‌ స్లైసులు – ఆరు, బొంబాయి రవ్వ – పావు కప్పు, బియ్యప్పిండి – అరకప్పు, పెరుగు – ముప్పావు కప్పు, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి),  అల్లం పేస్టు – టీస్పూను, పచ్చిమిర్చి – ఒకటి( సన్నగా తరగాలి), కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – రుచికి తగినంత, ఆయిల్‌ – డీప్‌ ఫ్రైకిసరిపడా. 

తయారీ: ∙గిన్నెలో బ్రెడ్‌ స్లైసులను ముక్కలు చేసి వేసుకోవాలి. ∙దీనిలో బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ముద్దగా కలపుకోవాలి. ∙మరీ గట్టిగా అనిపిస్తే పిండిలో మరో రెండు టేబుల్‌ స్పూన్లు పెరుగు వేసి కలుపుకోవచ్చు. ∙ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్‌ రాసుకుని పిండిని  గారెల్లా చేసి ఆయిల్‌లో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ∙మీడియం మంట మీద క్రిస్పీ, గోల్డెన్‌ బ్రౌన్‌ లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే బ్రెడ్‌ వడ రెడీ.  

పెరుగుప్మా 
కావలసినవి: పెరుగు – అరకప్పు, బొంబాయి రవ్వ – కప్పు, పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, మినపపప్పు – అర టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. 
తయారీ: ∙ముందుగా ఒక గిన్నెలో పెరుగు, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఉప్పు, రెండున్నర కప్పులు నీళ్లుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

∙స్టవ్‌ ఆన్‌ చేసి బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి. ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ∙తరువాత మినప పప్పు, కరివేపాకు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ∙ఉల్లిపాయ దోరగా వేగిన తరువాత బొంబాయి రవ్వ వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ∙రవ్వ వేగిన తరువాత కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ∙మధ్యమధ్యలో తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికిస్తే పెరుగుప్మా రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement