పాలక్ చపాతీ, ఆలూ చపాతీ, మేతీ చపాతీ ఇలా చాలా రకాలుగా రుచికరమై చపాతీలను చేసుకోవచ్చు. కానీ చపాతీలు చేయాలంటే.. మెత్తగా వస్తాయో రావోనని చాలామందికి భయం. పిండి సరిగ్గా కలపకపోయినా, ఇంగ్రీడియంట్స్ సమ పాళ్లలో పడకపోయినా, చపాతీలు మన మాట వినవు. మరి సొరకాయ (లౌకీ, బాటిల్ గార్డ్, ఆనపకాయ) చపాతీ ఎపుడైనా ట్రై చేశారా? మెత్తగా దూదుల్లాంటి సొరకాయ చపాతీ ఎలా చేయాలో చూద్దాం.
కావలసినవి: సొరకాయ తురుము – రెండు కప్పులు; పచ్చిమిర్చి తరుగు–టీ స్పూన్, గోధుమపిండి – రెండున్నర కప్పులు, గరం మసాలా – అర టీ స్పూన్ ; ఉప్పు – చిటికెడు; ఇంగువ– చిటికెడు, నూనె – రెండు టేబుల్ స్పూన్‌లు.
తయారీ: ∙వెడల్పుగా ఉన్న పాత్రలో గోధుమపిండి, సొరకాయ తురుము, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. మొదట తేమ సరిపోదనిపించినప్పటికీ సొరకాయలో నీరు వదిలేకొద్దీ సరిపోతుంది. పది నిమిషాల సేపు పక్కన ఉంచితే నీరు బయటకు వస్తుంది. నీరు వదిలిన తర్వాత పిండిని కలిపి చూసుకుని అప్పటికీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించుకుని మిశ్రమం మొత్తాన్ని చపాతీ పిండిలా చేసుకుని వస్త్రాన్ని కప్పి పావు గంట సేపు పక్కన ఉంచాలి. పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకుని చ΄ాతీల్లా వత్తుకుని పెనం వేడి చేసి నూనె వేస్తూ చపాతీని రెండు వైపులా కాల్చాలి.
గమనిక: చపాతీ వత్తేటప్పుడు పిండి జారుడుగా ఉన్నట్లనిపిస్తే పొడి పిండి చల్లుకుని బాగా కలిసే వరకు మర్దనా చేసి అప్పుడు చపాతీ చేసుకోవాలి. సొరకాయ చపాతీ సాధారణ గోధుమ పిండి చపాతీలా సమంగా ఒకే మందంలో రావడం కష్టం. మరీ పలుచగా కూడా వత్తకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. వేడిగా తింటే మృదువుగా, రుచిగా ఉంటాయి. వేసవిలో చపాతీలు తింటే వేడి చేస్తుందని భయపడేవాళ్లు సొరకాయ చపాతీ ప్రయత్నించవచ్చు. ఈ చపాతీలను మనకు నచ్చిన కూర, చట్నీతోగానీ, లేదంటే వేసవి కాలం చల్లని పెరుగుతో తిన్న బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment