ఒంటి పైన బంగారం ఉన్న మహిళ వరలక్ష్మిలా ఉంటుంది. అదేంటి! ధన లక్ష్మిలా కదా ఉండాలి? అవుననుకోండి. బంగారం.. ధనానికి (సంపదకు) ఒక రూపం మాత్రమే. బంగారానికి పూర్తి స్వరూపం మాత్రం స్త్రీమూర్తే.
భారతీయ స్త్రీ బంగారానికి ప్రాణం ఇస్తుంది అంటారు కానీ, నిజానికి అనవలసింది.. బంగారానికే ఆమె ప్రాణం పోస్తుందని. గనుల్లో ఉండే బంగారానికి ఏం ‘వెయిట్’ ఉంటుందని! ఇంతులు ధరిస్తేనే కదా తులాలకు విలువ!
బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది. బంగారాన్ని ఇష్టంగా, అదొక నిష్ఠగా, వేడుకగా, అందంగా, ఆచారంగా.. వాటన్నిటినీ కలిపి నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు. ఎంత నిండుగానో తెలుసా? ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ తాజా సర్వే ప్రకారం భారతీయ మహిళల దగ్గరున్న బంగారం 24 వేల టన్నులు!
అత్యధికంగా బంగారం ఉన్న మొదటి ఐదు దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువ. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల బంగారం మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో మూడో స్థానంలో ఉంది.
నాలుగు, ఐదు స్థానాల్లో ఫ్రాన్స్ (2,400 టన్నులు), రష్యా (1,900) ఉన్నాయి. మొత్తం కలిపినా భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువ (40 శాతం వరకు) బంగారం ఉంది. ఆ నలభైలో 28 శాతం తమిళనాడు మహిళలదే.
బంగారం ధరించిన మహిళల్ని వరలక్ష్ములు అనటం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర్నుంచి కూడా వారు ‘వరాలు’ పొందారు. వివాహిత స్త్రీలు ఎలాంటి పన్నూ చెల్లించకుండానే అరకిలో వరకు బంగారాన్ని కొనుక్కోవచ్చు. అవివాహిత మహిళలకు పావు కిలో వరకు పన్నులుండవు.
మరి పురుషులకు? వంద గ్రాములు దాటితే వారిపై కన్ను, పన్ను రెండూ పడతాయి. కనుక, ఈ కొత్త సంవత్సరంలో బంగారం వెయిట్ పెంచే బాధ్యత మహిళలదే. ఒంటిపైన బంగారం ఉన్న మహిళ మాత్రమే కాదు, మహిళ ఒంటిపై ఉన్న బంగారం కూడా వరలక్ష్మీ అమ్మవారే!
Comments
Please login to add a commentAdd a comment