legally
-
మహిళలు వెయిట్ పెంచండి..!
ఒంటి పైన బంగారం ఉన్న మహిళ వరలక్ష్మిలా ఉంటుంది. అదేంటి! ధన లక్ష్మిలా కదా ఉండాలి? అవుననుకోండి. బంగారం.. ధనానికి (సంపదకు) ఒక రూపం మాత్రమే. బంగారానికి పూర్తి స్వరూపం మాత్రం స్త్రీమూర్తే.భారతీయ స్త్రీ బంగారానికి ప్రాణం ఇస్తుంది అంటారు కానీ, నిజానికి అనవలసింది.. బంగారానికే ఆమె ప్రాణం పోస్తుందని. గనుల్లో ఉండే బంగారానికి ఏం ‘వెయిట్’ ఉంటుందని! ఇంతులు ధరిస్తేనే కదా తులాలకు విలువ!బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది. బంగారాన్ని ఇష్టంగా, అదొక నిష్ఠగా, వేడుకగా, అందంగా, ఆచారంగా.. వాటన్నిటినీ కలిపి నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు. ఎంత నిండుగానో తెలుసా? ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ తాజా సర్వే ప్రకారం భారతీయ మహిళల దగ్గరున్న బంగారం 24 వేల టన్నులు!అత్యధికంగా బంగారం ఉన్న మొదటి ఐదు దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువ. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల బంగారం మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో మూడో స్థానంలో ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో ఫ్రాన్స్ (2,400 టన్నులు), రష్యా (1,900) ఉన్నాయి. మొత్తం కలిపినా భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువ (40 శాతం వరకు) బంగారం ఉంది. ఆ నలభైలో 28 శాతం తమిళనాడు మహిళలదే.బంగారం ధరించిన మహిళల్ని వరలక్ష్ములు అనటం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర్నుంచి కూడా వారు ‘వరాలు’ పొందారు. వివాహిత స్త్రీలు ఎలాంటి పన్నూ చెల్లించకుండానే అరకిలో వరకు బంగారాన్ని కొనుక్కోవచ్చు. అవివాహిత మహిళలకు పావు కిలో వరకు పన్నులుండవు. మరి పురుషులకు? వంద గ్రాములు దాటితే వారిపై కన్ను, పన్ను రెండూ పడతాయి. కనుక, ఈ కొత్త సంవత్సరంలో బంగారం వెయిట్ పెంచే బాధ్యత మహిళలదే. ఒంటిపైన బంగారం ఉన్న మహిళ మాత్రమే కాదు, మహిళ ఒంటిపై ఉన్న బంగారం కూడా వరలక్ష్మీ అమ్మవారే! (చదవండి: 'జీరో వేస్ట్ వెడ్డింగ్'! పర్యావరణమే మురిసే..) -
వివాహం కాకపోయినా పర్లేదు!.. పిల్లలను కనండి అంటున్న చైనా!
పెళ్లి కానీ వారు ఎవరైనా తమ కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటే ఓకే అని డ్రాగన్ కంట్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు మునుపు కేవలం వివాహిత జంటలు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలను కనేలా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి కాకపోయినా పర్వాలేదు చట్టబద్ధంగా పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తోంది చైనా. ఎందుకంటే అక్కడ ఘోరంగా జననాల రేటు పడిపోవటంతో దాన్ని పెంచే క్రమంలో ఇలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. అలాగే చైనాలోని నైరుతీ ప్రావిన్స్‌లో సిచువాన్ ఐదవ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. ఐతే ఈ ప్రాంతం 60 ఏళ్ల కంటే పైబడినవారి పరంగా ఏడో స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో వివాహాలు, జననాల రేటు పడిపోవడంతో ఈ నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు చైనా ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. వివాహిత జంటలే గాక పిల్లలను కావాలనుకునే వారంతా అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకుని కోరుకున్నంత మంది పిల్లలని కనొచ్చని చెప్పింది. చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా తగ్గిపోయింది. దీన్ని చారిత్రాత్మక మలుపుగా పేర్కొనవచ్చు. ఈ మేరకు సిచువాన్ ఆరోగ్య కమిషన్ దీర్ఘకాలిక సమతుల్య జనాభాను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జనాభాను పెంచేలా ప్రజలకు మరిన్ని ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వైద్య బిల్లులు కవర్ అయ్యేలా ప్రసూతి బీమా, ప్రసూతి సెలవుల సమయంలో జీతాన్ని అందించేలా వెసులబాటు వంటి తదితర ప్రోత్సహాకాలను అందించారు. ఇది ఒంటరిగా జీవించే మహిళలకు, పురుషులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. (చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి) -
'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..
కన్నకూతుళ్లను దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి తన లింగాన్ని మార్చుకున్నాడు. చట్టపరంగా పోరాటం చేసి ఐడీ కార్డులో మగ నుంచి ఆడగా మారాడు. ఈక్వేడార్‌లో ఈ ఘటన జరిగింది. చట్టపరంగా లింగాన్ని మార్చుకున్న ఈ వ్యక్తి పేరు రినె సలినాస్ రామోస్(47). భార్యతో విడిపోయాడు. అయితే ఈ దేశ చట్టాల ప్రకారం పిల్లలు తల్లిదగ్గరే ఉండాలనే నిబంధన ఉంది. కానీ తన కూతుళ్లు తల్లి వద్ద సంతోషంగా లేరని, తనకు అప్పగించాలని రామోస్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఐడీ కార్డులో తన లింగాన్ని పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు రామోస్. చట్టపరంగా అనుమతులు తీసుకున్నాడు. ఇప్పుడు తాను కూడా తల్లిని అయ్యానని, పిల్లలను తనకే అప్పగించాలని రామోస్ కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. రామోస్ తన కూతుళ్ల కోసమే లింగాన్ని మార్చుకున్నప్పటికీ దేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము సర్జరీ చేయించుకొని ఆడ నుంచి మగగా, పురుషుడి నుంచి స్త్రీగా మారితే అధికారిక గుర్తింపు లభించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా మహిళగా లింగాన్ని మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాను చేసిన దాంట్లో దురుద్దేశం ఏమీ లేదని రామోస్ పేర్కొన్నాడు. కేవలం తన కూతుళ్ల కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. పురుషులకు కూడా తమ పిల్లలపై హక్కు కల్పించేందుకే తాను పోరాడుతున్నట్లు వివరణ ఇచ్చాడు. చదవండి: బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం -
చట్టప్రకారం చనిపోయినా.. తల్లిదండ్రుల పోరాటం!
ఏ తల్లిద్రండులకైనా తమ బిడ్డలు ఆయురారోగ్యాలతో హాయిగా బతకాలని ఉంటుంది. వాళ్లకు చిన్న జ్వరం వస్తే చాలు.. కోలుకోవాలని కోటి మొక్కులు మొక్కుతూనే ఉంటారు. అలాంటిది కళ్లెదుటే ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తున్న తమ బిడ్డ చనిపోయిందని చట్టం చెప్పినా ఆ తల్లిదండ్రులు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఆ చిన్నారి గుండెచప్పుడే తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ఎదురు చూస్తున్నారు. ఆమెలో చలనం వచ్చి లేచి రావాలన్న ఆశతో అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు. రంగుల దుప్పటి కప్పుకొని నల్లని పొడవైన జుట్టుతో దిండుపై హాయిగా నిద్రిస్తున్నట్లున్న 15 ఏళ్ల జుహి మెక్ మాథ్ ఫొటో ఇప్పుడు ఫేస్ బుక్ లో సంచలనం రేపుతోంది. కేవలం టాన్సిల్ తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్స ఆమెకు ప్రాణాంతకమైంది. బ్రెయిన్ డెడ్ కావడంతో 2013లో ఆమె మరణించినట్లు ధ్రువీకరిస్తూ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ గతవారం ఫేస్ బుక్ లో కొన్ని వేలసార్లు షేర్ అయ్యింది. చూసేందుకు మెక్ మాథ్ సజీవంగా కనిపించినా ఆమె చట్టప్రకారం చనిపోయింది. నాడీవ్యవస్థ నిలిచిపోయి, ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా పేషెంట్లు బతుకుతారేమో కానీ, బ్రెయిన్ డెడ్ అయినవారు తిరిగి కోలుకునే అవకాశమే లేదు. అందుకు వైద్యం అసలే లేదు. బ్రెయిన్ డెడ్ అయినవారు నడవలేరు, మాట్లాడలేరు, కనీసం కళ్లు కూడా తెరవలేరు. ఇప్పుడు అదే స్థితిలో మెక్ మాథ్ ఉంది. ఇలాంటి వారి శరీర అవయవాలు మాత్రం జీవితకాలం పనిచేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. అంతేకాదు వారి జుట్టు వంటి కొన్ని శరీర భాగాలు పెరిగే అవకాశం ఉంది. చట్టప్రకారం మాత్రం మెక్ మాథ్ మరణించినట్లే. కొన్ని మతాలు ధర్మాల ప్రకారం ఊపిరి ఆగినప్పుడే ప్రాణం పోయినట్లు నమ్ముతారు. అదే నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు మెక్ మాథ్ మరణాన్నిఅంగీకరించడం లేదు. ఆమె మరణించినట్లు ధ్రువీకరించిన పత్రాన్ని వారు స్వీకరించడం లేదు. వోక్ ల్యాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెక్ మాథ్ మరణించినట్లు ధ్రువీకరించిన తర్వాత వారు ఆమెను మత ప్రాతిపదికన చట్టం కలిగిన న్యూ జెర్సీకి తీసుకెళ్లారు. బ్రెయిన్ డెడ్ అయి రెండేళ్లపాటు సజీవంగా ఉన్న ఆమె ఏదో ఒకరోజు బతికి బట్టకడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా మెక్ మాథ్ కు చికిత్స అందించి ప్రోత్సహించాలని కోరుతున్నారు. సంరక్షణ, పోషణతో ఆమె బ్రతికే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఓక్లాండ్ ఆస్పత్రి, సర్జన్ ఫ్రెడరిక్ రోసెన్ పై మెడికల్ మాల్ ప్రాక్టీస్ కింద.. మెక్ మాథ్ తల్లి లతాషా నైలా వింక్ఫైల్డ్, ఆమె కుటుంబం గత మార్చిలో దావా వేసింది. ఈ కేసులో మెక్ మాథ్ తీవ్ర రక్త స్రావంతో బ్రెయిన్ డెడ్ కు గురైందని సర్జన్ వివరణ ఇచ్చారు. అయితే మెక్ మాథ్ సజీవంగా ఉందా, మరణించిందా అన్న విషయం అలమెడా సుపీరియర్ న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. మెక్ మాథ్ చనిపోయినట్లు పరిగణిస్తే సర్జన్ల నిర్లక్ష్యం కారణమైందన్న దృష్టితో కాలిఫోర్నియా మాల్ ప్రాక్టీస్ లా ప్రకారం 250,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బతికే ఉన్నట్లు నిర్థారించినా ఆమె సంరక్షణకు కుటుంబానికి ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయంపై వింక్ఫైల్డ్ తన కుమార్తె మెక్ మాథ్ దగ్గర కూచుని ఉన్న ఫొటోతో ఫేస్ బుక్ పేజీలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. 'కీప్ జహి మెక్ మాథ్ ఆన్ లైఫ్ సపోర్ట్' పేరున కొనసాగుతున్న పేజీలో మెక్ మాథ్ బతికే ఉందని కొందరు, మరణించి ఉండొచ్చని కొందరు తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఓ మద్దతుదారుడు మెక్ మాథ్ బతికే ఉందని... ఆమె మెదడుకు కేవలం గాయం అయిందని, త్వరలోనే కోలుకుంటుందని మద్దతు పలికాడు. మాటలకు, మ్యూజిక్ కు తన మనుమరాలు స్పందిస్తోందని, చేతులు శరీరం కదుపుతోందని ఆమె తప్పకుండా బతుకుతుందని మెక్ మాథ్ బామ్మ సాండ్రా చెబుతోంది. శరీరంలో చిన్నపాటి కదలికలు వారిలో ఆశలు కల్పిస్తున్నా... ఒక్కోసారి బ్రెయిన్ డెడ్ వ్యక్తుల్లో మెదడు చర్య లేకుండానే కదలికలు కలుగే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రస్తుతం ఎవరెన్ని చెప్పినా మెక్ మాథ్ మరణంపై కోర్టు విచారించిన అనంతరం ధ్రువీకరించాల్సి ఉంది. -
బాల్య వివాహాలే అధికం...!
ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిల వివాహ వయసు అత్యల్పంగా ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అమ్మాయిల పెళ్ళి వయసును నిర్ణయించినప్పటికీ... సగటున 18 ఏళ్ళ వయసుకు ముందుగానే ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. ఐరోపాలోని అన్ని ప్రాంతాల్లో సగటున ఆడపిల్లల వివాహ వయసును స్పానిష్ ప్రభుత్వం 14 నుంచి 16 కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్టోనియాలో అత్యల్ప వివాహ వయసు 15 ఏళ్ళుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివాహానికి కనీస వయసు అబ్బాయిలకు 17, అమ్మాయిలకు 16 ఉండగా చాలా దేశాల్లో అంతకన్నా ముందే బాలికలకు వివాహాలు చేస్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. యుఎస్ లోని మస్సచుసేట్స్ రాష్ట్రం సహా.. అనేక ప్రదేశాల్లో అమ్మాయిలకు న్యాయమూర్తుల సమ్మతితో 12 సంవత్సరాలకే అసాధారణ పరిస్థితుల్లో వివాహాలను చేస్తున్నారు. చాలా దేశాల్లో వివాహ వయసు 18 ఏళ్ళుగా నిర్ణయించినా.. అంతకు ముందుగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో చాలామంది 13 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలు వద్దు మొర్రో అంటున్నా... తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2020 నాటికి ఏభై మిలియన్ల మంది 15 ఏళ్ళ లోపు బాలికలే వధువులుగా మారతారని అంచనా. లిబియా ఐసిస్ కుటుంబాల్లో ఆడపిల్లలకు రక్షణకోసం బలవంతంగా పన్నెండేళ్ళ వయసులోపే పెళ్ళిళ్లు చేసేస్తున్నారు. దీంతో వారు గర్భస్రావాలు, అనేక రకాలైన లైంగిక సంబంధ వ్యాధులకు గురౌతున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ కు చెందిన మానవ హక్కుల ప్రకారం. మిగతా దేశాల్లో అధికారిక వివాహ వయసు 18 ఉండగా...ముస్లింలు, హిందువుల్లో ప్రత్యేక వివాహ చట్టాలు కలిగి ఉన్నాయి. అయితే చైనాలో ప్రత్యేకంగా స్త్రీ, పురుషులు సుదీర్ఘకాలం వివాహం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చైనా జనాభా నియంత్రణ విధానంలో భాగంగా 22 ఏళ్ళ వయసు వరకు అబ్బాయిలు, 20 ఏళ్ళ వరకూ అమ్మాయిలు పెళ్ళి చేసుకునేందుకు ఆగాల్సిందే. చట్టపరంగా మహిళలకు 18, పురుషులకు 21 ఏళ్ళు వివాహ వయసు నిర్ణయించిన భారతదేశం వంటి దేశాల్లో అంతకు ముందు చేసే చట్ట విరుద్ధమైన పెళ్ళిళ్ళను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా 2013లో 20 నుంచి 24 ఏళ్ళ మధ్య వయసున్న పది మిలియన్ల మహిళలు 18 ఏళ్ళ వయసు లోపే పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా ఫారిన్ రిలేషన్స్ సంయుక్త కౌన్సిల్ లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు 18 ఏళ్ళ వయసు రాకముందే పెళ్ళి చేసుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఇంకా జనన, వివాహ రిజిస్ట్రేషన్ వ్యవస్థలు అమలు కాని అనేక దేశాల్లో బాల్య వివాహాలనుంచి బాలికలను రక్షించలేని దురవస్థ కొనసాగుతూనే ఉంది.