చట్టప్రకారం చనిపోయినా.. తల్లిదండ్రుల పోరాటం!
ఏ తల్లిద్రండులకైనా తమ బిడ్డలు ఆయురారోగ్యాలతో హాయిగా బతకాలని ఉంటుంది. వాళ్లకు చిన్న జ్వరం వస్తే చాలు.. కోలుకోవాలని కోటి మొక్కులు మొక్కుతూనే ఉంటారు. అలాంటిది కళ్లెదుటే ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తున్న తమ బిడ్డ చనిపోయిందని చట్టం చెప్పినా ఆ తల్లిదండ్రులు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఆ చిన్నారి గుండెచప్పుడే తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ఎదురు చూస్తున్నారు. ఆమెలో చలనం వచ్చి లేచి రావాలన్న ఆశతో అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు.
రంగుల దుప్పటి కప్పుకొని నల్లని పొడవైన జుట్టుతో దిండుపై హాయిగా నిద్రిస్తున్నట్లున్న 15 ఏళ్ల జుహి మెక్ మాథ్ ఫొటో ఇప్పుడు ఫేస్ బుక్ లో సంచలనం రేపుతోంది. కేవలం టాన్సిల్ తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్స ఆమెకు ప్రాణాంతకమైంది. బ్రెయిన్ డెడ్ కావడంతో 2013లో ఆమె మరణించినట్లు ధ్రువీకరిస్తూ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ గతవారం ఫేస్ బుక్ లో కొన్ని వేలసార్లు షేర్ అయ్యింది. చూసేందుకు మెక్ మాథ్ సజీవంగా కనిపించినా ఆమె చట్టప్రకారం చనిపోయింది. నాడీవ్యవస్థ నిలిచిపోయి, ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా పేషెంట్లు బతుకుతారేమో కానీ, బ్రెయిన్ డెడ్ అయినవారు తిరిగి కోలుకునే అవకాశమే లేదు. అందుకు వైద్యం అసలే లేదు. బ్రెయిన్ డెడ్ అయినవారు నడవలేరు, మాట్లాడలేరు, కనీసం కళ్లు కూడా తెరవలేరు.
ఇప్పుడు అదే స్థితిలో మెక్ మాథ్ ఉంది. ఇలాంటి వారి శరీర అవయవాలు మాత్రం జీవితకాలం పనిచేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. అంతేకాదు వారి జుట్టు వంటి కొన్ని శరీర భాగాలు పెరిగే అవకాశం ఉంది. చట్టప్రకారం మాత్రం మెక్ మాథ్ మరణించినట్లే. కొన్ని మతాలు ధర్మాల ప్రకారం ఊపిరి ఆగినప్పుడే ప్రాణం పోయినట్లు నమ్ముతారు. అదే నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు మెక్ మాథ్ మరణాన్నిఅంగీకరించడం లేదు. ఆమె మరణించినట్లు ధ్రువీకరించిన పత్రాన్ని వారు స్వీకరించడం లేదు.
వోక్ ల్యాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెక్ మాథ్ మరణించినట్లు ధ్రువీకరించిన తర్వాత వారు ఆమెను మత ప్రాతిపదికన చట్టం కలిగిన న్యూ జెర్సీకి తీసుకెళ్లారు. బ్రెయిన్ డెడ్ అయి రెండేళ్లపాటు సజీవంగా ఉన్న ఆమె ఏదో ఒకరోజు బతికి బట్టకడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా మెక్ మాథ్ కు చికిత్స అందించి ప్రోత్సహించాలని కోరుతున్నారు. సంరక్షణ, పోషణతో ఆమె బ్రతికే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఓక్లాండ్ ఆస్పత్రి, సర్జన్ ఫ్రెడరిక్ రోసెన్ పై మెడికల్ మాల్ ప్రాక్టీస్ కింద.. మెక్ మాథ్ తల్లి లతాషా నైలా వింక్ఫైల్డ్, ఆమె కుటుంబం గత మార్చిలో దావా వేసింది. ఈ కేసులో మెక్ మాథ్ తీవ్ర రక్త స్రావంతో బ్రెయిన్ డెడ్ కు గురైందని సర్జన్ వివరణ ఇచ్చారు. అయితే మెక్ మాథ్ సజీవంగా ఉందా, మరణించిందా అన్న విషయం అలమెడా సుపీరియర్ న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. మెక్ మాథ్ చనిపోయినట్లు పరిగణిస్తే సర్జన్ల నిర్లక్ష్యం కారణమైందన్న దృష్టితో కాలిఫోర్నియా మాల్ ప్రాక్టీస్ లా ప్రకారం 250,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బతికే ఉన్నట్లు నిర్థారించినా ఆమె సంరక్షణకు కుటుంబానికి ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఇదే విషయంపై వింక్ఫైల్డ్ తన కుమార్తె మెక్ మాథ్ దగ్గర కూచుని ఉన్న ఫొటోతో ఫేస్ బుక్ పేజీలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. 'కీప్ జహి మెక్ మాథ్ ఆన్ లైఫ్ సపోర్ట్' పేరున కొనసాగుతున్న పేజీలో మెక్ మాథ్ బతికే ఉందని కొందరు, మరణించి ఉండొచ్చని కొందరు తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఓ మద్దతుదారుడు మెక్ మాథ్ బతికే ఉందని... ఆమె మెదడుకు కేవలం గాయం అయిందని, త్వరలోనే కోలుకుంటుందని మద్దతు పలికాడు. మాటలకు, మ్యూజిక్ కు తన మనుమరాలు స్పందిస్తోందని, చేతులు శరీరం కదుపుతోందని ఆమె తప్పకుండా బతుకుతుందని మెక్ మాథ్ బామ్మ సాండ్రా చెబుతోంది. శరీరంలో చిన్నపాటి కదలికలు వారిలో ఆశలు కల్పిస్తున్నా... ఒక్కోసారి బ్రెయిన్ డెడ్ వ్యక్తుల్లో మెదడు చర్య లేకుండానే కదలికలు కలుగే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రస్తుతం ఎవరెన్ని చెప్పినా మెక్ మాథ్ మరణంపై కోర్టు విచారించిన అనంతరం ధ్రువీకరించాల్సి ఉంది.