ఓ కాంపౌండర్ చేసిన పొరపాటు.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వచ్చీరాని వైద్యంతో గర్భిణికి కాన్పు చేయడంతో ఆమె మరణించింది. పండంటి మనవడిని ఇస్తుందనుకున్న కన్నకూతురు కాస్తా శవంగా తిరిగిరావడంతో గుండెపగిలిన ఆమె తండ్రి కూడా ప్రాణాలు వదిలేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది.
ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన వోగిబోయిన నాగలక్ష్మి (19) అనే మహిళ కాన్పు కోసం గురువారం సాయంత్రం వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు రాత్రి 11 గంటలకు ఆమెకు కాన్పు అయ్యింది. అయితే డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో కాంపౌండర్ కాన్పు చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.
ఆ సమయంలో కాంపౌండర్ అజాగ్రత్త వల్ల బాలింతకకు అధిక రక్తస్రావం కావటంతో చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో శుక్రవారం మృతిచెందింది. ఈ వార్త విన్న నాగలక్ష్మి తండ్రి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కాంపౌండర్ కాన్పు చేయటంపై మృతురాలి బంధువులు ప్రభుత్వ వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు.
కూతురి మరణం: గుండెపోటుతో తండ్రి మృతి
Published Sat, Jul 19 2014 1:11 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement