అవుట్‌ ఫిట్‌.. వ్యాయామం హిట్‌.. | How to Wear Workout Clothes | Sakshi
Sakshi News home page

అవుట్‌ ఫిట్‌.. వ్యాయామం హిట్‌..

Published Mon, Oct 28 2024 9:38 AM | Last Updated on Mon, Oct 28 2024 9:38 AM

How to Wear Workout Clothes

తీరైన దుస్తులతోనే సరైన వ్యాయామ ఫలాలు 

నప్పని డ్రెస్సింగ్‌తో చేసే వర్కవుట్స్‌ వల్ల కష్టాలే.. 

చేసే ఎక్సర్‌సైజ్‌ను బట్టి దుస్తులను ఎంచుకోవాలి 

అవగాహన లేక అనారోగ్యాల పాలవుతున్న నగరవాసులు 

ఎన్ని గంటలు చేయాలి? ఏం డైట్‌ తీసుకోవాలి? సరిగా వర్కవుట్‌ చేస్తున్నానా లేదా? వ్యాయామం చేయాలనుకునే/ చేసే వారిలో ఎన్నో సందేహాలు.. మరి డ్రెస్‌ సంగతేంటి? వ్యాయామానికి తగ్గ అవుట్‌ ఫిట్‌ ధరిస్తున్నానా?అనేది ఆలోచించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు. దీనిపై నగరానికి చెందిన వ్యాయామ నిపుణులతో కలిసి హామ్‌స్టెక్‌ ఫ్యాషన్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. 

నిశ్చల జీవనశైలి, ఎక్కువ గంటలు కూర్చోడం వల్ల వచ్చే మధుమేహం, రక్తపోటు గుండె సమస్యలు వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కోడంలో రెగ్యులర్‌ వ్యాయామం అవసరం. ఇది ఎండార్ఫిన్స్‌ను రిలీజ్‌ చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్రనిస్తుంది. అయితే వర్కవుట్‌ సమయంలో సరైన యాక్టివ్‌ వేర్‌ ఉంటేనే ఇవన్నీ సాధ్యం. అనుచితమైన జిమ్‌వేర్‌ వ్యాయామాలకు అవసరమైన కండరాల సపోర్ట్‌ని అందించవు. మన ఫిట్‌నెస్‌ లక్ష్యాలకు సహకరించవు. 

జిమ్‌ వేర్‌.. టేక్‌ కేర్‌.. 
వ్యాయామ సమయంలో సరైన యాక్టివ్‌వేర్‌ ఉత్సాహం పెంచడంతో పాటు అధిక చెమట, దుర్వాసనల నుంచి రక్షిస్తుంది. గాయాలను నివారించి శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి పనిచేసే కండరాలకు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు  సామర్థ్యం మేరకు వ్యాయామాలు చేసేలా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సులభమైన కదలికలకు సహకరిస్తూ బరువులు ఎత్తడంలో సహాయపడి కండరాల పునరుద్ధరణను సులభతరం చేస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం నుంచి తేమ ఆవిరైపోవాలి. కాబట్టి తేమను సులభంగా ఆరబెట్టడానికి, చెడు వాసనను నిరోధించడానికి చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి మైక్రోఫైబర్‌తో కూడిన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పాలియెస్టర్, స్పాండెక్స్, పాలీ–డ్రై, నైలాన్‌ కూడా మంచివే.   

👉 కొన్నిరకాల దుస్తులు అంటువ్యాధులు, దద్దుర్లు, దురదలకు దారితీయవచ్చు. శరీరపు సహజ ఉష్ణోగ్రతను దెబ్బతీసి, డీ హైడ్రేషన్, అలసట లేదా బరి్నంగ్‌ సెన్సేషన్‌కు దారితీస్తాయి.  

👉 వేసవి కాలంలో సౌకర్యవంతమైన, చల్లదనాన్నిచ్చే దుస్తులు, వర్షాకాలంలో అంటువ్యాధులు, అలెర్జీలు, చర్మ వ్యాధులను నివారించడానికి పొడిగా, తాజా అనుభూతిని కలిగించే దుస్తులను ఎంచుకోవాలి.  శీతాకాలంలో వెచ్చగా ఉంచేవి, అవుట్‌డోర్‌ వ్యాయామ సమయంలో లేయర్‌లలో దుస్తులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అనుసరించి ఒక్కో లేయర్‌ను తొలగించొచ్చు.  

👉 గుండె ఆరోగ్యానికి, శక్తికి రన్నింగ్, సైక్లింగ్‌ వంటి కార్డియోవాస్క్యులర్‌ వ్యాయామాలు అవసరం. రన్నింగ్, జాగింగ్‌ చేసేవారి కోసం లైట్‌ వెయిట్‌ స్వెట్‌ అబ్సార్బింగ్, టీషర్ట్స్, షార్ట్స్, బి రన్నింగ్‌ అండ్‌ కార్డియో హెచ్‌ఆర్‌ఎక్స్‌ తదితర బ్రాండ్స్‌ అందిస్తున్నాయి. 

👉కీళ్ల మధ్య సమన్వయం, బ్యాలెన్సింగ్‌కి యోగా, స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు ఉపకరిస్తాయి. దీనికి యోగా ఫ్లెక్సిబులిటీ, బ్లిస్‌ క్లబ్‌ వంటి బ్రాండ్స్‌ హై స్ట్రెచ్‌ లెగ్గింగ్స్, తేమను పీల్చుకునే స్పోర్ట్స్‌ బ్రాల తదితర అవుట్‌ఫిట్స్‌ను అందిస్తున్నాయి. జీవమే బ్రాండ్‌ కూడా ఫ్లెక్సిబులిటీ, సౌకర్యంగా ఉండే స్ట్రెచ్‌బుల్‌ యోగా గేర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  

👉 బ్రీతబుల్‌ ఫ్యాబ్రిక్స్‌కి, మన దేశపు నేలకు తగ్గట్టుగా మెత్తగా ఉండే కుషన్‌ కలిగిన షూస్‌ని ప్యూమా ఇండియా అందిస్తోంది. యోగాతో పాటు స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌కి ఉపకరించే లైట్‌ వెయిట్, ఎకో ఫ్రెండ్లీ దుస్తుల్ని ప్రయోగ్‌ తయారు చేస్తోంది.  

👉 స్టైలిష్‌ అత్లీజర్, ఫ్యాషన్, ఫంక్షన్‌ రెండింటి మేలి కలయికతో డి.అథ్లీజర్‌ అం ఆల్‌ డే యాక్టివ్‌ వేర్‌ను లులులెమన్‌ ఇండియా అందిస్తోంది. తేలికపాటి వ్యాయామాలతో పాటు రోజువారీ ఉపకరించే దుస్తులను నష్‌ యాక్టివ్‌ సమరి్పస్తోంది.  

👉  చేసే వ్యాయామంపై అవగాహనతో పాటు ధరించే అవుట్‌ఫిట్‌పై కూడా జాగ్రత్తలు అవసరం. ప్రస్తుతం పలు రకాల బ్రాండ్స్, ఏ వ్యాయామ శైలికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులను అందిస్తున్నాయి. వాటిలో నుంచి లేదా తామే ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న కస్టమైజ్డ్‌ దుస్తులను ఫిట్‌నెస్‌ లవర్స్‌ వినియోగించుకోవచ్చు.  
– హామ్‌స్టెక్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫ్యాకల్టీ  

అవుట్‌ ఫిట్‌.. ఇంపార్టెంట్‌
వ్యాయామం చేసే సమయంలో సరైన అవుట్‌ ఫిట్‌ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్‌. ఆ విషయంలో ఇప్పుడు చాలా మందిలో అవగాహన పెరిగింది. చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి జిమ్‌ వర్కవుట్‌కి డ్రై ఫిట్‌ పేరిట అందుబాటులోకి వచ్చిన దుస్తులు, అదే విధంగా యోగ డ్రెస్సింగ్‌కు వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్‌ ఫ్యాబ్రిక్‌ వినియోగిస్తున్నారు. జాగింగ్‌ చేసేవారికి జాగర్స్‌ సూట్స్, సైక్లింగ్‌కి స్కిన్‌ టైట్‌ ప్యాంట్‌ ఇలా వర్కవుట్‌ స్టైల్‌ని బట్టి ప్రత్యేక దుస్తులు అందుబాటులోకి వచ్చేశాయి.  – విజయ్‌ గంధం, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement