సైన్స్ వైఫల్యాలలో మనిషి మరణం ఒకటి. ఎన్నో వింతలు, విడ్డూరాలు చేయగలిగిన టెక్నాలజీ, మరణాన్ని జయించడంలో పదేపదే విఫలమవుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం చనిపోయిన వారిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా మార్చడంలో మాత్రం విజయవంతమైంది. మృతదేహాన్ని దహనం చేశాక మిగిలే బూడిదతో వజ్రాలను తయారుచేసి, ఆత్మీయులకు చిరకాల జ్ఞాపికలుగా అందిస్తోంది. అమెరికా, స్విట్జర్లాండ్, యూకే వంటి పలు దేశాల ప్రజలు మరణించిన తమవారిని చెక్కుచెదరని వజ్రాభరణాలుగా మార్చుకుంటున్నారు. వాటిని నిత్యం ధరిస్తూ మరణించిన ఆత్మీయులు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని లక్కీ డైమండ్స్, మెమోరియల్ డైమండ్స్ అని పిలుచుకుంటున్నారు.
మనిషి శరీరంలోని ఘన మూలకాల్లో కార్బన్ అత్యధికంగా ఉంటుంది. మనిషి శరీరం దహనమైపోయినా, అధిక పరిమాణంలో మిగిలే కార్బన్ తో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను కొన్నేళ్ల కిందటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు అందించిన పరిజ్ఞానంతో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇలా ఆత్మీయుల చితాభస్మంతో వజ్రాలను తయారు చేసి, వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు అందిస్తున్నాయి.
అయితే, ఇదంతా పెద్ద స్కామ్ అని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి డబ్బులు గుంజడానికే కంపెనీలు ఇలా మోసం చేస్తున్నాయని, డైమండ్ తయారీకి చితాభస్మం నుంచి 10% కార్బన్ మాత్రమే వాడుతున్నారని, మిగిలిన 90% సాధారణ స్టాక్ కార్బన్ వాడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అయినా.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ఇది విపరీతంగా విస్తరించింది.
కోవిడ్ మహమ్మారి కారణంగా అయిన వారిని కోల్పోయి, కనీసం కడసారి చూపులకైనా నోచుకోలేని స్థితిలో అల్లాడిపోయిన ఎందరికో ఈ విధానం ఊరటనిస్తోంది. తమవారు లేరనే విషాదం నుంచి కోలుకునేందుకు ప్రేమపూర్వక జ్ఞాపికగా మిగులుతోంది. స్నేహితుల్ని, ఆత్మీయుల్ని ఎంతో మంది ఈ వజ్రాలను తయారు చేయించుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. నిజానికి ఈ మనిషి చితాభస్మంతో తయారైన వజ్రాలు (మ్యాన్ మేడ్ స్టోన్) మొదట 1980లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చినా, ఇటీవలి కాలంలోనే వీటికి ఆదరణ పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment