తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అద్భుతమైన మానవీయ సంబంధాలు. వారి సమక్షం ఒక విశ్వవిద్యాలయమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక పాఠశాల ఉంది. పాఠశాలల్లో పేరంట్స్ డే జరపడం సర్వసాధారణమే.. కానీ అక్కడ గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుతారు. అటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత గొప్ప విశేషమో తెలియ చేయడానికి వారిని ఎందుకు గౌరవించాలో బోధపరచడానికి వారీ ఉత్సవం నిర్వహిస్తారని తెలిసి చాలా సంతోషమేసింది. తాతలు, నానమ్మలు, అమ్మమ్మల దగ్గర పెరిగిన పిల్లల్లో ధైర్యం, సంస్కారం ఎక్కువగా ఉంటుందని ఆ పాఠశాల ప్రిన్సి΄ాల్ తన ప్రసంగంలో తెలియచేసారు. అటువంటి పెద్దల సమక్షంలో పెరిగే పిల్లల మానసిక పరిణతి, సంస్కారబలం వృద్ధి చెందుతాయి. పెద్దల విలువని ఎంతని లెక్కగట్టగలం!!!
వారు లేరని బాధపడేవాళ్ళుంటారు చాలా మంది... అటువంటప్పుడు వారిని ఓల్డ్ ఫర్నీచర్ అని తప్పించడం ఎంత నీతిబాహ్యమైన చర్య? తండ్రి పెద్దవాడయిపోయాడు. కొడుకు భుజం మీద చెయ్యివేసుకుని వెళ్ళడం ఒక ఠీవి. తండ్రి చేతిని కొడుకు పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెడితే అదొక ఠీవి. నా కొడుకును సహాయంగా తీసుకుని బయటకు వెళ్ళి రావడం నా అవసరం, నా ఆనందం. దాని ప్రయోజనం మరొకరికి ఎలా తెలుస్తుంది? కొదుకు ఎక్కడ ఉంటే అక్కడ ఉపశమనం. కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఊరట. మనసుకు గొప్పశాంతి. అది సంపద.
అంత గొప్ప సంపదకు దూరంగా ఏకాకిగా బతకడమా!!! మనుమలతో కలసి బతకడం భగవంతుడిచ్చిన గొప్ప భాగ్యం. వారిలో తమను తాము చూసుకోవడం పెద్దలకు పెద్ద ఓదార్పు. ఈశ్వరుడిచ్చిన ఇంత గొప్ప సంపద నాకు ఎవరి వలన లభిస్తున్నది... కోడలు వలన. అంటే వివాహం అనేది ఈ సంపద సృష్టికి మూల కారణం అవుతున్నది. స్థిరచరాస్తులు ఎంత పోగేసుకున్నాం అన్నదానికంటే... కుటుంబంలో మనుషుల మధ్య మనసులు ఎంతగా కలిసాయన్నది ఈ ఆనందాలకన్నింటికీ హేతువవుతుంది. ఆరోగ్యకర సమిష్టి జీవనానికి దారివేస్తుంది.
జీవితాన్ని కూడా గాలికి వదిలేసి సంపాదన లో మునిగితేలేవాడికి సంసార సుఖం తెలియదు. సంపాదన అవసరమే, కానీ సంసార జీవితాన్ని కలిసికట్టుగా ఆస్వాదించపోతే ఇక గహస్థాశ్రమ వైభవం ఎక్కడుంది? దాని ఫలాలను నీవెక్కడ ఆస్వాదిస్తున్నావు? అంటే బతకడానికి సం΄ాదన... అంతే తప్ప సంపాదన కోసం బతకడం కాదు కదా! శ్రీమంతుల ఇంట అయినా పేదల ఇంటయినా... అరమరికలు లేకుండా ఉమ్మడిగా బతకడం వర్తమానంలో సంతోషాలకే కాదు, తరువాత తరాలకు కూడా సంతోషకారకాలను అందిస్తున్నాం. అందుకే కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, మనుమలు.. ఇదంతా గొప్ప సంపద. ఈ సంపదకు మూలం వివాహ వ్యవస్థ. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం ఒక వైభవానికి నాంది.
Comments
Please login to add a commentAdd a comment