‘మేగజీన్ వచ్చిందా’ నుంచి ‘సీరియల్ వస్తోంది టీవీ ఆన్ చెయ్యి’ వరకూ కాలం ప్రవహించింది. ఫేస్‌బుక్, వాట్సప్ చెక్ చేసుకుంటే తప్ప రోజు గడవని రోజూ వచ్చింది. ఒకప్పుడు పాఠకుల కంటే పాఠకురాళ్లే ఎక్కువ. వారి కోసమే మేగజైన్లు, ప్రత్యేక సీరియళ్లు నడిచేవి. కాని ఇప్పుడు తమ పుస్తక పఠనాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలు కూడా ప్రయాస పడాల్సి వస్తోంది. నేటి నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ జనవరి 1 నుంచి విజయవాడలో. స్త్రీలు ఏం చదువుతున్నారు... ఎటువంటి పుస్తకాలు ఆశిస్తున్నారు... అసలు చదివే సమయం మిగిలిందా? చూద్దాం.
మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలు చదివి ఉండాలి
ఇంట్లో పుస్తకాలు ఉండే వాతావరణం వల్ల పుస్తకాలు చదివే అలవాటైంది. అయితే కాలక్షేపం పుస్తకాలు కాదు. హైస్కూల్‌లోనే ‘ఏడుతరాలు’ చదివేశా. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉద్యోగం, కుటుంబం రెంటి మధ్య సమయం వెతుక్కుని పుస్తకాలు చదవాల్సి వస్తోంది. నేనైతే ప్రయాణాల్లోనే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నాను. ‘అంటరాని వసంతం’ వంటి గొప్ప పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. కనీసం మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలను కొన్నైనా ప్రతి ఒక్కరూ చదివి ఉండాలి. ఇటీవల నేను కొత్త జనరేషన్ ఏం రాస్తున్నారా అని ఆసక్తిగా చూస్తున్నాను. పుస్తక పఠనం నా పిల్లలకు అలవాటు చేశాను. వాళ్లు నాకంటే ఎక్కువ చదువుతారు. కాకపోతే ఇంగ్లిష్‌లో. ఒక ప్రిన్సిపాల్‌గా విద్యార్థులకు పుస్తకాలు అలవాటు చేయడానికి లైబ్రరీలో కనీసం గంట కూచోవాలని చెబుతున్నా.
– ఎం. ప్రగతి, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, హిందూపురం
చదివేవాళ్లు సాకులు చెప్పరు
పుస్తకాలు చదవడం మా నాన్నగారు, అమ్మగారు అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్‌ఫ్రెండ్ పుస్తకాలే. నా ఎమోషన్ వాటితోనే షేర్ చేసుకునేదాన్ని. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు మొదట పుస్తకమే గుర్తుకు వస్తుంది. నేను మనుషులను డైరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కంటే పుస్తకాల ద్వారానే అర్థం చేసుకున్నా. కాబట్టి నా మంచిచెడ్డలు రెంటికీ పుస్తకాలే బాధ్యులు. ‘ఏడుతరాలు’ వంటి పుస్తకాలు చిన్నప్పుడే చదివి పనిమనుషులతో ఎంత మర్యాదగా వ్యవహరించాలో నేర్చుకున్నాను. రావిశాస్త్రి ‘రత్తాలు– రాంబాబు’ చదివి టీనేజ్‌లో కంగారు పడ్డాను. పుస్తకం చదివే అలవాటు ఉన్నవాళ్లు వాటిని చదవలేకపోతే గిల్ట్ ఫీలవుతారు. పుస్తకాలు చదవడానికి టైం లేకపోవడాన్ని నేను నమ్మను. టైమ్ దొరుకుతుంది. కొంతమంది ఈ కాలం పిల్లల్ని గమనిస్తే ఇవాళ్టి జనరేషన్ కూడా పుస్తకాలు చదువుతున్నారన్న ఆశ ఉంది.
– అరుణ ప్రసాద్, గృహిణి, నిజాంపేట, హైదరాబాద్
ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదవాలి
నేను కాలేజీలో ఉండగా పుస్తకాలు చదవడం మొదలెట్టా. సీరియస్ సాహిత్యానికి నాన్ సీరియస్ సాహిత్యానికి తేడా సీరియస్ సాహిత్యంలో కూరుకుపోయా. సెంట్రల్ యూనివర్సిటీలో చదివేప్పుడు పుస్తకాలంటే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. నామిని పుస్తకం ‘పచ్చనాకు సాక్షిగా’ అక్కడే చదివా. చలం పుస్తకాలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి, మహా ప్రస్థానం, జాషువా గబ్బిలం, శివసాగర్... ఇలా ఎన్ని పుస్తకాలో. అవన్నీ ఏ జనరేషన్ అయినా చదువుతూ ఉండాల్సిందే. టెక్నాలజీ వచ్చింది. కొంతమంది యూట్యూబ్‌లో కథలు వింటున్నారు. ఆడియో లిటరేచర్ వింటున్నారు. కాని నాకు పుస్తకం చదవడమే బాగుంటుంది. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఆనందం వేరు. పుస్తకం ఇచ్చే ఆలోచన వేరు.
–చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
ఇవాళ కావాల్సింది ఆలోచన రేపే పుస్తకాలు
నేను ఆర్ట్ స్టూడెంట్‌ని. మా నాన్నగారు ఆర్ట్ స్టూడెంట్స్ సాహిత్యం కూడా చదవాలని‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్‌స్పియర్’ చదివించేవారు. ఆ రోజుల్లో నాకు ప్రకృతి అంటే ఇష్టం ఉండేది. వర్డ్స్‌వర్త్, షెల్లీ... ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఓ హెన్రీ కథలు చాలా నచ్చాయి. మెల్లగా లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. మనం టీవీ చూడకపోతే చాలా పుస్తకాలు చదవొచ్చు. టీవీ ఐదు నిమిషాలైనా చూడగలమా? ఎప్పటికైనా సరే పుస్తకమే ముఖ్యమైనది. మనల్ని జంతువుల నుంచి వేరు చేసేది ఆలోచన. ఆ ఆలోచన పుస్తకం నుంచే వస్తుంది. ఈ రోజు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. వాటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. వివక్ష, సామాజిక సమస్యలు, మతతత్వం... వీటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి.
–కె.ఉషారాణి, ప్రజాశక్తి బుక్ హౌస్ మాజీ ఎడిటర్, విజయవాడ
పుస్తకాల షెల్ఫ్‌లు లేని ఇళ్లు తయారయ్యాయి!
మా ఇంట్లో మా నాన్న, మేనత్తలు పుస్తకాలు చదివేవారు. కనుక మాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంట్లో అందుబాటులో పుస్తకాలు ఉంటే పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు వాటిని చదువుతారు. మేము కొన్ని కారణాల రీత్యా ఇల్లు, ఊరు మారాం. కాని ఇంత పెద్ద ఫ్లాట్‌లో పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ లేవు. ఇలాంటి ఇళ్లు తయారైతే ఎలా? మా చిన్నప్పుడు ఇంట్లో పుస్తకాలు లేకపోతే పక్కింటివాళ్లైనా ఇచ్చేవారు. ఇవాళ ఆ వాతావరణం మళ్లీ రావాలి. చలం ‘స్త్రీ’ వంటి పుస్తకం చదవకపోతే ఎలా? ఓటిటిలు, షాపింగులు స్త్రీల సమయాన్ని తీసుకున్నా ఆ ఆకర్షణకు మించిన పుస్తకాలు కూడా బోలెడు వచ్చి పడుతున్నాయి. వాటిలో చదవదగ్గది ఉంటే పఠనాభిలాష ఎక్కడికీ పోదు. మంచి పుస్తకాన్ని ఎవరు వదిలిపెడతారు? చదవడానికి ట్యూన్ కావాలి. అది ముఖ్యం.
– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రచయిత, కాకినాడ
ట్రాఫిక్‌లోనే చదవాల్సి వస్తోంది
నేను చదివిన సెయింట్ ఫిలోమినా స్కూల్లో లైబ్రరీ ఉండేది. రోజూ ఒక గంట అందులో కూచుని చదవాలి. అలా నాకు పుస్తకాలు అలవాటయ్యాయి. మా చర్చిలో ఒక తాతకు చదువురాదు. ఆయన నా చేత పుస్తకాలు చదివించుకుని వాటి ఆధారంగా మాట్లాడేవాడు. అలా కూడా నేను పుస్తకాలు చదివాను. సీరియస్ సాహిత్యం అంటే 2002లో విశాలాంధ్ర వారు పెట్టిన వ్యాసరచన పోటీలో బహుమతి వస్తే వాళ్లు 3000 రూపాయల పుస్తకాలు గిఫ్ట్ చేశారు. వాటిలో విశ్వంభర, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఉండటంతో పొయెట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత ఫేస్‌బుక్ వల్ల చాలా పుస్తకాలు తెలిశాయి. ముఖ్యంగా జయకాంతన్ కథలు నాకు నచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్‌లో మాత్రమే పుస్తకాలు చదివే వీలు దొరుకుతోంది. నాకే కాదు.. చాలామందికి. టెక్నాలజీ పెరిగాక ఆఫీస్ కాల్స్ 24 గంటలు అవుతున్నాయి. పుస్తకం చదవాలంటే టైమ్ చూసుకోవాల్సిందే.
– మెర్సీ మార్గరెట్, గురుకుల స్పెషల్ స్కూల్ ఇన్‌చార్జ్, ఘట్‌కేసర్.
స్త్రీలు పుస్తక ప్రియులు
Published Sat, Dec 18 2021 12:31 AM | Last Updated on Sat, Dec 18 2021 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment