readers
-
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్‌ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్‌లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్‌తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
స్త్రీలు పుస్తక ప్రియులు
‘మేగజీన్ వచ్చిందా’ నుంచి ‘సీరియల్ వస్తోంది టీవీ ఆన్ చెయ్యి’ వరకూ కాలం ప్రవహించింది. ఫేస్బుక్, వాట్సప్ చెక్ చేసుకుంటే తప్ప రోజు గడవని రోజూ వచ్చింది. ఒకప్పుడు పాఠకుల కంటే పాఠకురాళ్లే ఎక్కువ. వారి కోసమే మేగజైన్లు, ప్రత్యేక సీరియళ్లు నడిచేవి. కాని ఇప్పుడు తమ పుస్తక పఠనాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలు కూడా ప్రయాస పడాల్సి వస్తోంది. నేటి నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ జనవరి 1 నుంచి విజయవాడలో. స్త్రీలు ఏం చదువుతున్నారు... ఎటువంటి పుస్తకాలు ఆశిస్తున్నారు... అసలు చదివే సమయం మిగిలిందా? చూద్దాం. మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలు చదివి ఉండాలి ఇంట్లో పుస్తకాలు ఉండే వాతావరణం వల్ల పుస్తకాలు చదివే అలవాటైంది. అయితే కాలక్షేపం పుస్తకాలు కాదు. హైస్కూల్లోనే ‘ఏడుతరాలు’ చదివేశా. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉద్యోగం, కుటుంబం రెంటి మధ్య సమయం వెతుక్కుని పుస్తకాలు చదవాల్సి వస్తోంది. నేనైతే ప్రయాణాల్లోనే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నాను. ‘అంటరాని వసంతం’ వంటి గొప్ప పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. కనీసం మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలను కొన్నైనా ప్రతి ఒక్కరూ చదివి ఉండాలి. ఇటీవల నేను కొత్త జనరేషన్ ఏం రాస్తున్నారా అని ఆసక్తిగా చూస్తున్నాను. పుస్తక పఠనం నా పిల్లలకు అలవాటు చేశాను. వాళ్లు నాకంటే ఎక్కువ చదువుతారు. కాకపోతే ఇంగ్లిష్‌లో. ఒక ప్రిన్సిపాల్‌గా విద్యార్థులకు పుస్తకాలు అలవాటు చేయడానికి లైబ్రరీలో కనీసం గంట కూచోవాలని చెబుతున్నా. – ఎం. ప్రగతి, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, హిందూపురం చదివేవాళ్లు సాకులు చెప్పరు పుస్తకాలు చదవడం మా నాన్నగారు, అమ్మగారు అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్‌ఫ్రెండ్ పుస్తకాలే. నా ఎమోషన్ వాటితోనే షేర్ చేసుకునేదాన్ని. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు మొదట పుస్తకమే గుర్తుకు వస్తుంది. నేను మనుషులను డైరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కంటే పుస్తకాల ద్వారానే అర్థం చేసుకున్నా. కాబట్టి నా మంచిచెడ్డలు రెంటికీ పుస్తకాలే బాధ్యులు. ‘ఏడుతరాలు’ వంటి పుస్తకాలు చిన్నప్పుడే చదివి పనిమనుషులతో ఎంత మర్యాదగా వ్యవహరించాలో నేర్చుకున్నాను. రావిశాస్త్రి ‘రత్తాలు– రాంబాబు’ చదివి టీనేజ్‌లో కంగారు పడ్డాను. పుస్తకం చదివే అలవాటు ఉన్నవాళ్లు వాటిని చదవలేకపోతే గిల్ట్ ఫీలవుతారు. పుస్తకాలు చదవడానికి టైం లేకపోవడాన్ని నేను నమ్మను. టైమ్ దొరుకుతుంది. కొంతమంది ఈ కాలం పిల్లల్ని గమనిస్తే ఇవాళ్టి జనరేషన్ కూడా పుస్తకాలు చదువుతున్నారన్న ఆశ ఉంది. – అరుణ ప్రసాద్, గృహిణి, నిజాంపేట, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదవాలి నేను కాలేజీలో ఉండగా పుస్తకాలు చదవడం మొదలెట్టా. సీరియస్ సాహిత్యానికి నాన్ సీరియస్ సాహిత్యానికి తేడా సీరియస్ సాహిత్యంలో కూరుకుపోయా. సెంట్రల్ యూనివర్సిటీలో చదివేప్పుడు పుస్తకాలంటే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. నామిని పుస్తకం ‘పచ్చనాకు సాక్షిగా’ అక్కడే చదివా. చలం పుస్తకాలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి, మహా ప్రస్థానం, జాషువా గబ్బిలం, శివసాగర్... ఇలా ఎన్ని పుస్తకాలో. అవన్నీ ఏ జనరేషన్ అయినా చదువుతూ ఉండాల్సిందే. టెక్నాలజీ వచ్చింది. కొంతమంది యూట్యూబ్‌లో కథలు వింటున్నారు. ఆడియో లిటరేచర్ వింటున్నారు. కాని నాకు పుస్తకం చదవడమే బాగుంటుంది. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఆనందం వేరు. పుస్తకం ఇచ్చే ఆలోచన వేరు. –చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఇవాళ కావాల్సింది ఆలోచన రేపే పుస్తకాలు నేను ఆర్ట్ స్టూడెంట్‌ని. మా నాన్నగారు ఆర్ట్ స్టూడెంట్స్ సాహిత్యం కూడా చదవాలని‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్’ చదివించేవారు. ఆ రోజుల్లో నాకు ప్రకృతి అంటే ఇష్టం ఉండేది. వర్డ్స్‌వర్త్, షెల్లీ... ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఓ హెన్రీ కథలు చాలా నచ్చాయి. మెల్లగా లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. మనం టీవీ చూడకపోతే చాలా పుస్తకాలు చదవొచ్చు. టీవీ ఐదు నిమిషాలైనా చూడగలమా? ఎప్పటికైనా సరే పుస్తకమే ముఖ్యమైనది. మనల్ని జంతువుల నుంచి వేరు చేసేది ఆలోచన. ఆ ఆలోచన పుస్తకం నుంచే వస్తుంది. ఈ రోజు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. వాటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. వివక్ష, సామాజిక సమస్యలు, మతతత్వం... వీటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. –కె.ఉషారాణి, ప్రజాశక్తి బుక్ హౌస్ మాజీ ఎడిటర్, విజయవాడ పుస్తకాల షెల్ఫ్‌లు లేని ఇళ్లు తయారయ్యాయి! మా ఇంట్లో మా నాన్న, మేనత్తలు పుస్తకాలు చదివేవారు. కనుక మాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంట్లో అందుబాటులో పుస్తకాలు ఉంటే పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు వాటిని చదువుతారు. మేము కొన్ని కారణాల రీత్యా ఇల్లు, ఊరు మారాం. కాని ఇంత పెద్ద ఫ్లాట్‌లో పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ లేవు. ఇలాంటి ఇళ్లు తయారైతే ఎలా? మా చిన్నప్పుడు ఇంట్లో పుస్తకాలు లేకపోతే పక్కింటివాళ్లైనా ఇచ్చేవారు. ఇవాళ ఆ వాతావరణం మళ్లీ రావాలి. చలం ‘స్త్రీ’ వంటి పుస్తకం చదవకపోతే ఎలా? ఓటిటిలు, షాపింగులు స్త్రీల సమయాన్ని తీసుకున్నా ఆ ఆకర్షణకు మించిన పుస్తకాలు కూడా బోలెడు వచ్చి పడుతున్నాయి. వాటిలో చదవదగ్గది ఉంటే పఠనాభిలాష ఎక్కడికీ పోదు. మంచి పుస్తకాన్ని ఎవరు వదిలిపెడతారు? చదవడానికి ట్యూన్ కావాలి. అది ముఖ్యం. – వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రచయిత, కాకినాడ ట్రాఫిక్‌లోనే చదవాల్సి వస్తోంది నేను చదివిన సెయింట్ ఫిలోమినా స్కూల్లో లైబ్రరీ ఉండేది. రోజూ ఒక గంట అందులో కూచుని చదవాలి. అలా నాకు పుస్తకాలు అలవాటయ్యాయి. మా చర్చిలో ఒక తాతకు చదువురాదు. ఆయన నా చేత పుస్తకాలు చదివించుకుని వాటి ఆధారంగా మాట్లాడేవాడు. అలా కూడా నేను పుస్తకాలు చదివాను. సీరియస్ సాహిత్యం అంటే 2002లో విశాలాంధ్ర వారు పెట్టిన వ్యాసరచన పోటీలో బహుమతి వస్తే వాళ్లు 3000 రూపాయల పుస్తకాలు గిఫ్ట్ చేశారు. వాటిలో విశ్వంభర, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఉండటంతో పొయెట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత ఫేస్బుక్ వల్ల చాలా పుస్తకాలు తెలిశాయి. ముఖ్యంగా జయకాంతన్ కథలు నాకు నచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్‌లో మాత్రమే పుస్తకాలు చదివే వీలు దొరుకుతోంది. నాకే కాదు.. చాలామందికి. టెక్నాలజీ పెరిగాక ఆఫీస్ కాల్స్ 24 గంటలు అవుతున్నాయి. పుస్తకం చదవాలంటే టైమ్ చూసుకోవాల్సిందే. – మెర్సీ మార్గరెట్, గురుకుల స్పెషల్ స్కూల్ ఇన్చార్జ్, ఘట్కేసర్. -
పురాతన భవనంలో ‘గ్రంథాలయం’
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్రలోని శాఖ గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతుంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ గ్రంథాలయం విషయంలో గ్రామస్థుల తలరాత మారడంలేదు. కొన్నేళ్లుగా గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. భవనం పై కప్పుకున్న సిమెంట్ రేకులకు రంధ్రాలు కావడంతో వర్షాకాలంలో పాఠకులు పడే అవస్థలు వర్ణణాతీతం. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా గ్రంథాలయం పరిస్థితి మారిపోయింది. పాఠకులకు కావల్సిన పుస్తకాలు అన్ని ఉన్నప్పటికీ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటికి భద్రత లేకుండా పోయింది. కొన్నేళ్లుగా గ్రామస్థులు పలు సార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు హామీలిస్తున్న పాలకులు ఎన్నికలైపోయాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యాలయాలకు వెళ్లే అధికారులు , ప్రజాప్రతినిధులు గ్రంథాలయం భవనం ముందు నుంచే వెళ్తారు. కానీ ఏ ఒక్కరోజు కూడా గ్రంథాలయం గురించి పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయ భవనం ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా పాఠకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చొరవ చూపి శి«థిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని నూతన భవనంగా మార్చేలా కృషి చేయాలని పాఠకులు కోరుతున్నారు. నెరవేరని చైర్మన్ హామీ.. దేవరకద్ర శాఖ గ్రంథాలయ భవనానికి కొత్త భవనం మంజూరుజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ హామీ ఇచ్చారు.ఇటీవల గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు. అప్పుడు పాఠకులు సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.త్వరలో కొత్త భవనం మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. నిర్లక్ష్యం తగదు గ్రంథాలయ భవనం విషయంలో నిర్లక్ష్యం తగదు. భవనం పక్షులకు నిలయంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధకరం. ఈ విషయంలో నాయకులు తగు చొరవ చూపితే బాగుంటుంది. –నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర -
శిథిలావస్థలో గ్రంథాలయ భవనం
కనీస వసతులు కరువు పట్టించుకోని అధికారులు ఇబ్బందుల్లో పాఠకులు తానూరు: మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు లేక పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అధికారి గుండెపోటుతో మతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రంథాలయానికి అధికారిని నియమించ లేదు. దీంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుబీర్ మండల గ్రంథాలయాధికారికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించడంతో అయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో గ్రంథాలయంలో తగిన సౌకర్యాలు లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయంలో పలు మార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని పాఠకులు వాపోతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో... మండల కేంద్రంలో గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన వ్యవసాయ గోదాంలోని పాత భవనంలో గ్రం«థాలయం కొనసాగిస్తున్నారు. గ్రంథాలయంలో పాఠకులకు సరిపడేంత సౌకర్యాలు లేకపోవడంతో పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రంథాలయం కోసం స్థలం కేటాయిస్తే గ్రం«థాలయం నిర్మిస్తామని అధికారులు చేప్పడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో పాటు మెంబర్లు స్థలం అందించేందుకు ఎకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నత శాఖ అధికారులకు నివేదికలు పంపించారు. కాని ఇప్పటి వరకు గ్రంథాలయ భవనం మంజూరి కాలేదని స్థానికులు తెలిపారు. గ్రంథాలయం వెనుక భాగంలో ప్రయాణికులు మలవిసర్జన చేయడంతో దుర్గంధం నెలకొందని పాఠకులు వాపోతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో గ్రంథాలయం కొనసాగించడంతో వర్షం కురుస్తే నీరు గ్రంథాలయంలోకి చేరుతోంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారిని నియమించాలి... మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తిచేసేవిధంగా చూడాలని పాఠకులు వాపోతున్నారు. అధికారి లేకపోవడంతో పాఠకులకు కనీస సౌకర్యాలు, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రంథాలయానికి అధికారిని నియమించి, నూతన భవనం ఏర్పాటు చేసి పాఠకుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – సమస్య పరిష్కరించాలి గ్రంథాలయంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తిచేసి పాఠకుల సమస్యలు పరిష్కరించాలి. అధికారి లేకపోవడంతో గ్రంథాలయంలో తగిన పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అధికారిని నియమించి పాఠకుల సమస్య పరిష్కరించాలి. 27ఎండీఎల్152, మానిక్, తానూరు – నూతన భవనం నిర్మించాలి గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన భవనం నిర్మించి, గ్రంథాలయంలో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి పాఠకుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 27ఎండీఎల్153, కాత్రే రమేష్