పురాతన భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయం
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్రలోని శాఖ గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతుంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ గ్రంథాలయం విషయంలో గ్రామస్థుల తలరాత మారడంలేదు. కొన్నేళ్లుగా గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. భవనం పై కప్పుకున్న సిమెంట్ రేకులకు రంధ్రాలు కావడంతో వర్షాకాలంలో పాఠకులు పడే అవస్థలు వర్ణణాతీతం. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా గ్రంథాలయం పరిస్థితి మారిపోయింది. పాఠకులకు కావల్సిన పుస్తకాలు అన్ని ఉన్నప్పటికీ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటికి భద్రత లేకుండా పోయింది.
కొన్నేళ్లుగా గ్రామస్థులు పలు సార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు హామీలిస్తున్న పాలకులు ఎన్నికలైపోయాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యాలయాలకు వెళ్లే అధికారులు , ప్రజాప్రతినిధులు గ్రంథాలయం భవనం ముందు నుంచే వెళ్తారు. కానీ ఏ ఒక్కరోజు కూడా గ్రంథాలయం గురించి పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారు.
నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయ భవనం ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా పాఠకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చొరవ చూపి శి«థిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని నూతన భవనంగా మార్చేలా కృషి చేయాలని పాఠకులు కోరుతున్నారు.
నెరవేరని చైర్మన్ హామీ..
దేవరకద్ర శాఖ గ్రంథాలయ భవనానికి కొత్త భవనం మంజూరుజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ హామీ ఇచ్చారు.ఇటీవల గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు. అప్పుడు పాఠకులు సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.త్వరలో కొత్త భవనం మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు.
నిర్లక్ష్యం తగదు
గ్రంథాలయ భవనం విషయంలో నిర్లక్ష్యం తగదు. భవనం పక్షులకు నిలయంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధకరం. ఈ విషయంలో నాయకులు తగు చొరవ చూపితే బాగుంటుంది. –నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర
Comments
Please login to add a commentAdd a comment