కితాబ్‌తో విజ్ఞానాన్ని పంచుతూ..
లైబ్రరీల ఏర్పాటు పరంపర కొనసాగిస్తూ..
ఇప్పటివరకూ 15 గ్రంథాలయాల ఏర్పాటు..
25 లైబ్రరీల లక్ష్యం దిశగా అడుగులు..
చిన్నారి ఆకర్షణ సంకల్పబలం..
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏపీ మాజీ సీఎం అభినందనలు..
25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి హాజరవుతానని ప్రధాని హామీ..
పుస్తక పఠనంపై ఆసక్తి రేపుతూ..
పుస్తకం తోడుంటే వెలకట్టలేని స్నేహితుడు వెన్నంటే ఉన్నట్టే. మంచి పుస్తకం నిండైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మదిని కమ్మేసిన నిరాశ నిస్పృహలను దూరం చేసి ధైర్యాన్ని కూడగడుతుందంటారు సాహితీవేత్తలు. పుస్తక సాహిత్యం జీవన విధానాన్ని, పోరాట పటిమను అలవర్చుతుందంటారు. అలాంటి పుస్తక విలువను విశ్వవ్యాప్తం చేసేందుకు చిన్నారి ఆకర్షణ కంకణం కట్టుకుంది. పిన్న వయస్సులోనే కితాబ్ గొప్పతనాన్ని గుర్తించి ఎందరికో చదువుకునే భాగ్యాన్ని కలిగిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9,536 పుస్తకాలను సేకరించి 15 లైబ్రరీలను ఏర్పాటుచేసి తోటి చిన్నారులతో పాటు ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని రేపుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ఈ చిన్నారి లైబ్రరీల ఏర్పాటు యజ్ఞం గురించి తెలుసుకుని, ఆమెను కలుసుకుని ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆకర్షణ ఆమెకు ప్రేరణ కలిగించిన అంశాలు, లక్ష్యాలను గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు.
సాక్షి: ఎన్నో ఏట నుంచి పుస్తక సేకరణ ప్రారంభించారు? ప్రేరణ కలిగించింది ఎవరు ?
ఆకర్షణ: తొమ్మిది సంవత్సరాల వయస్సు నుంచి పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టాను. 2021లో ఎంఎన్‌జే క్యాన్సర్ చి్రల్డన్ ఆస్పత్రిలోని రోగులకు, వారి సహాయకులకు ఆహారాన్ని అందించేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను. అక్కడి పిల్లల అవసరాలను గుర్తించాను. ముఖ్యంగా కలరింగ్ బుక్స్‌తో పాటు వారు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఊరటనిస్తాయని అనిపించింది. దీంతో పుస్తకాలను సేకరించి లైబ్రరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. నన్ను ప్రేరేపించిన ఎంఎన్‌జే కేన్సర్ హాస్పటల్‌లోనే మొట్టమొదటి లైబ్రరీని ఏర్పాటుచేశాను.
సాక్షి: ఇప్పటి వరకూ ఎన్ని లైబ్రరీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. ?
ఆకర్షణ: ఇప్పటివరకూ 15 లైబ్రరీలను ఏర్పాటు చేశాను. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, బోరబండ అల్లాపూర్ గాయత్రీనగర్ అసోసియేషన్, బాలికల కోసం జువైనల్ అబ్జర్వేషన్ హోమ్, కోయంబత్తూర్ సిటీ పోలీస్–స్ట్రీట్ లైబ్రరీ, చెన్నై బాయ్స్ క్లబ్–నోలంబూర్ పోలీస్‌స్టేషన్, సనత్‌నగర్ ఓల్డ్ ప్రభుత్వ పాఠశాల, సిద్దిపేట ఉమెన్ సేఫ్టీవింగ్ భరోసా సెంటర్, తమిళనాడు కన్యాకుమారి జిల్లాల్లోని కలితురై గ్రామం, అమీర్‌పేట స్టేడియం, ఏఎస్‌రావునగర్ బాలగోకులం భాగ్యనగర్, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని ఎయిడ్స్ అనాథ చిన్నారుల గృహం, బోరబండ ఆదర్శ ఫౌండేషన్, బోయిగూడ అనాథ బాలికల వసతి గృహం, బొల్లారంలోని కలాడీ ఆది శంకర మేడోమ్‌లలో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగింది.
సాక్షి: ప్రధాని మన్‌కీ బాత్‌లో మాట్లాడే అవకాశం ఏ విధంగా వచ్చింది. ?
ఆకర్షణ: నేను లైబ్రరీల ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భారత ప్రభుత్వ విద్యా
మంత్రిత్వ శాఖ కూడా లైబ్రరీ కార్యక్రమాల నిమిత్తం వెయ్యి పిల్లల పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకువచి్చంది. ఈ నేపథ్యంలోనే 2023, సెపె్టంబర్ 24న ప్రధానమంత్రి మన్‌కీ బాత్ 105వ ఎపిసోడ్‌లో స్వయంగా మాట్లాడే అవకాశం దక్కింది.
సాక్షి: స్వయంగా ప్రధానితో ముచ్చటించినప్పుడు మీ ఫీలింగ్? ఆయన ఏమన్నారు ?
ఆకర్షణ: ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచి్చన ప్రధాని నరేంద్రమోదీని రాజ్‌భవన్‌లో స్వయంగా కలిసే అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిరి్వరామంగా కొనసాగించు అని ఎంతగానో ప్రోత్సహించి అభినందించారు. నేను ఏర్పాటుచేయబోయే 25వ లైబ్రరీ ప్రారం¿ోత్సవానికి స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు పలువురు అధికారుల అభినందనలు మరువలేనివి.
సాక్షి: పుస్తకాల సేకరణకు ఇంకా ఎవరెవరి ప్రోత్సాహం ఉంది ?
ఆకర్షణ: తెలంగాణ ఆధారిత మానేరు రచయితల సంఘం, బాల సాహిత్య పరిషత్, దక్కన్ సాహిత్య సభలు లైబ్రరీల ఏర్పాటుకు గాను వెయ్యి పుస్తకాలు విరాళంగా అందజేసేందుకు ముందుకువచ్చాయి.
సాక్షి: పిన్న వయస్సులోనే మీరు సాధించిన మరుపురాని జ్ఞాపకాలు ?
ఆకర్షణ: న్యూఢిల్లీలో జరిగిన 75వ గణతంత్ర వేడుకలకు రక్షణ శాఖ నుంచి ఆహ్వానం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పత్రం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కడం మధురానుభూతిని కలిగించింది.
సాక్షి: మీ కుటుంబ నేపథ్యం
ఆకర్షణ: తండ్రి సతీష్ హెల్త్‌కేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి ప్రవిత గృహిణి. సనత్‌నగర్ లోధా అపార్ట్‌మెంట్‌లో ఉంటాం.
సాక్షి: ఇప్పటివరకూ ఎన్ని పుస్తకాలు సేకరణ చేశారు? ఎలా సేకరిస్తారు
ఆకర్షణ: ఇప్పటివరకూ 9,536 పుస్తకాలను సేకరించాను. ఇందులో 8000 పుస్తకాలు ఇతరులు డొనేట్ చేసినవే. అపార్ట్‌మెంట్ల నివాసితులు, క్లాస్‌మేట్స్, బంధువుల కుటుంబాల నుంచి సేకరిస్తుంటాను. వారంతా చదివేసిన అనంతరం తమ వద్ద ఉన్న పుస్తకాలు నాకు అందజేస్తుంటారు. వాటిని కలుపుకుని స్వతహాగా నేను కొనుగోలు చేసిన కొన్ని పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేశాను.
Comments
Please login to add a commentAdd a comment