Hyderabad Makeover Artist Vimala Reddy Best Beauty Tips For Woman In Telugu - Sakshi
Sakshi News home page

Vimala Reddy: టైమ్‌పాస్‌ కోసం బ్యూటీ కోర్స్‌ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత..

Published Fri, Apr 29 2022 12:51 PM | Last Updated on Fri, Apr 29 2022 5:29 PM

Hyderabad: Makeover Artist Vimala Reddy Tips For Woman - Sakshi

Makeover Tips: ఏ వేడుకకు ఏ డ్రెస్‌ వేసుకోవాలో సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం మనకు తెలిసిందే!  అలాగే, ముఖం రోజంతా ఫ్రెష్‌గా కనిపించాలంటే ఏ మేకప్‌ వాడాలి?! కురులను కొంగొత్తగా సింగారించాలంటే ఏ స్టైల్‌ని ఫాలో అవ్వాలి?! అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మేకప్‌ ఆర్టిస్ట్‌ గురించిన వెతుకులాట తప్పదు.

టాప్‌ టు బాటమ్‌ లుక్‌ స్టైల్‌గా, సంప్రదాయంగా, సందర్భానుసారంగా అతివల కలలకు మెరుగులు దిద్దే  మేకోవర్‌ ఆర్టిస్ట్‌  విమలారెడ్డి చెబుతున్న వివరాలివి.. 

ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌కి ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా క్లాసులు తీసుకున్న లెక్చరర్‌ విమలారెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉంటున్నారు. ఎనిమిదేళ్లుగా మేకోవర్‌ ఆర్టిస్ట్‌గా ఈ రంగంలో రాణిస్తున్నారు. బ్రైడల్, సీజనల్, సెలబ్రిటీ మేకోవర్‌పై వర్క్‌ చేస్తున్న విమలారెడ్డి తన గురించిన విశేషాలే కాదు, మేకప్‌ అండ్‌ హెయిర్‌కి సంబంధించిన వివరాలనూ తెలియజేశారు. 

‘‘లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న నేను పెళ్లయ్యాక ఆరు నెలలు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో పేపర్లో బ్యూటీ కోర్స్‌ ప్రకటన చూసి, టైమ్‌పాస్‌ కోసం వెళ్లి, చేరాను. ఆ తర్వాత తిరిగి లెక్చరర్‌ ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాను. ఏడేళ్ల క్రితం నాతోపాటు కోర్సు చేసిన అమ్మాయి ఓ పెళ్లి ఫంక్షన్‌లో సాయంగా ఉండమని కోరితే వెళ్లాను. రెండు గంటలు సాయం చేస్తే ఆరున్నర వేల రూపాయలు వచ్చాయి.

దీంతో కొన్నాళ్లు టీచింగ్‌ చేస్తూనే బ్యుటీషియన్‌గానూ ఆర్డర్స్‌ మీద బ్రైడల్‌ మేకప్‌ చేస్తుండేదాన్ని. నాకు నచ్చిన టైమ్‌లో వర్క్‌ చేయచ్చు. ఆర్థికంగానూ బాగుందనిపించింది. దీంతో పూర్తిగా మేకోవర్‌నే వృత్తిగా మార్చుకొని ఈ రంగంలోకి వచ్చాను. నాకు పెన్సిల్‌ ఆర్ట్‌ అంటే చిన్నప్పుటి నుంచి ఇష్టం ఉండేది. ఆ ఆర్ట్‌ మేకప్‌లో నాకుబాగా సాయపడింది.

పెళ్లితో పాటు ఇతర సెలబ్రేషన్స్, సెలబ్రిటీస్‌తోనూ వర్క్‌ చేయడం నచ్చింది. కొన్ని షూట్స్‌ వల్ల అవకాశాలు కూడా బాగా వచ్చాయి. ఇటీవల ‘గ్రే’ తెలుగు మూవీకి మేకప్‌ ఆర్టిస్ట్‌గానూ చేశాను. 2019లో మేకప్‌ కాంపిటీషన్‌లో పాల్గొని, గెలుపొందాను. అలాగే, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్స్‌కి సంబంధించిన క్లాసులూ తీసుకుంటున్నాను. 

కంటి మేకప్‌ యూనివర్సల్‌
సహజంగా కనిపించాలని, వేసవిలో కళ్ల వరకు మాత్రమే వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ని కోరుకునేవారున్నారు. పెదాలకు గ్లాసీ లిపిస్టిక్‌ వాడితే సరిపోతుంది. చాలావరకు మనవాళ్లందరికీ కళ్ల చుట్టూ, మూతిచుట్టూ, నుదుటిపైన కొద్దిపాటి నలుపు ఉంటుంది.

వీటిని కవర్‌ చేసుకుంటే చాలు, ఎక్కువ మేకప్‌ లేకపోయినా చేయకపోయినా నీట్‌గా కనిపిస్తుంది. కళ్లు డల్‌గా కనిపించకుండా ఉండటానికి మస్కారా, లిప్‌స్టిక్‌ వేసుకుంటే చాలు ఫ్రెష్‌లుక్‌ కనిపిస్తుంది. 

చర్మరక్షణ ముఖ్యం
పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు కొన్ని నెలల ముందే మమ్మల్ని సంప్రదిస్తుంటారు. వారి ఫొటోస్‌ మాకు పంపిస్తారు. వాళ్ల స్కిన్‌ టోన్‌ (ఆయిలీ, డ్రై, కాంబినేషన్‌ స్కిన్‌) ఏంటో కనుక్కొని అందుకు తగిన జాగ్రత్తలు చెబుతుంటాను. వాడాల్సిన ఫేస్‌వాష్, టోనర్, ఫేషియల్స్‌ గురించి మాత్రమే కాదు తీసుకునే ఆహారం, డెర్మటాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం, వ్యాయామాలు... దాదాపు 6 నెలల ముందే అన్నీ చెబుతాను.

మాంసాహారం తగ్గించమని, జ్యూసులు, నీళ్లు, సలాడ్స్‌ ఎక్కువ తీసుకోమని చెబుతాను. అలాగే, లేట్‌ నైట్స్‌ ఆహారం తీసుకోవద్దని, ఆల్కహాల్, స్మోకింగ్‌ వంటి అలవాట్లు ఉంటే మానేయమని చెబుతుంటాను. నెలకు ఒకసారి రెడీ మేడ్‌ మాస్క్‌ అయినా వేసుకోమని సజెస్ట్‌ చేస్తాను. ఆరోగ్యం బాగుంటే చర్మం, జుట్టు కూడా బాగుంటుంది. అప్పుడు మేకోవర్‌ కూడా హెల్దీగా కనిపిస్తుంది.

నాణ్యమైన ఉత్పత్తులు
మేకప్, డ్రెస్, హెయిర్, జ్యువెలరీ .. ఇవన్నీ సెట్‌ చేయడానికి 3–4 గంటల సమయం పడుతుంది. మేకప్‌కి వాడే ప్రొడక్ట్స్‌ క్వాలిటీ బట్టి ధర ఉంటుంది. ఉపయోగించిన మేకప్‌ 12 నుంచి 16 గంటల వరకైనా తాజాగా ఉండే ఖరీదైన ప్రొడక్ట్స్‌ వచ్చాయి. వీటితో ఫినిషింగ్‌ మాత్రమే కాదు చర్మం కూడా బాగుంటుంది.

కొన్ని ప్రొడక్ట్స్‌ ఉపయోగించినా మేకప్‌ చేసుకున్నట్టు తెలియదు. అంత నేచురల్‌గా ఉంటాయి. వేడుకల సమయాలను బట్టి మా వర్క్‌ ఉంటుంది. దీనిని అర్థం చేసుకునే కుటుంబం, పని పట్ల శ్రద్ధ, ఈ రంగంలో ఎదగాలన్న తపన ఉంటే ఈ రంగంలో ఎవరైనా రాణించవచ్చు’ అని వివరిస్తారు ఈ మేకోవర్‌ ఆర్టిస్ట్‌. 
– నిర్మలారెడ్డి

నేటి మేకప్‌ ట్రెండ్స్‌
►నేటి పెళ్లిళ్లలో చాలా వరకు వాటర్‌ ఫ్రూఫ్, గ్లాసీ, ట్రాన్స్‌పరెంట్‌ మేకప్‌ ఎక్కువ వాడుతున్నారు.
►పెళ్లి సమయంలో చమట పట్టే అవకాశం ఉంది. అలాగే, అప్పగింతలప్పుడు వారికి తెలియకుండానే ఏడ్చేస్తుంటారు.
►ఇలాంటప్పుడు మేకప్‌ చెదరకుండా, దాదాపు ఎనిమిది గంటల పాటు ఉండాలంటే వాటర్‌ఫ్రూఫ్‌ మేకప్‌ సరైన ఎంపిక అవుతుంది.
►నేచురల్‌గా హెల్దీ లుక్‌ కనిపించడంతో పాటు షైనీగా ఉండాలనుకునేవారు గ్లాసీ మేకప్‌ను ఎంచుకుంటారు.  
►ట్రాన్స్‌పరెంట్‌ కూడా అలాంటిదే. లిప్‌స్టిక్‌ పెట్టుకొని తిన్నా, వేటికీ అంటుకోకుండా ఉంటుంది.
►వేసవిలో వీటిని ఎక్కువ కోరుకుంటారు.
►నార్మల్‌ కెమరాతో కాకుండా హెచ్‌డి కెమరా పిక్సల్‌ సైజ్‌ బాగుంటుంది. అలాగే, హెచ్‌డీ క్వాలిటీ మేకప్‌ కూడా ఉంది.
►చేతులతో ముఖాన్ని టచ్‌ చేయకుండా మెషిన్‌తో ప్రొడక్ట్స్‌ స్ప్రే చేస్తూ మేకప్‌ చేస్తాం. దీనిని ఎయిర్‌బ్రష్‌ మేకప్‌ అంటాం.

 చదవండిAishwarya Bhagyanagar: మూడు వందలకు పైగా డాన్స్‌ ప్రదర్శనలు.. అంతేకాదు చిత్రకారిణి కూడా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement