కుటుంబంలో ఒక సమస్య వస్తే దానిని అధిగమించడానికి చేసే ప్రయత్నంతో పాటు, మరికొందరిని అదే సమస్య నుంచి గట్టెక్కించేందుకు పడే తపనకు చిరునామా ‘స్వీట్ సోల్స్.’ చిన్నారుల జీవితాల్లో చేదును నింపుతున్న తీపిని దూరం చేయడానికి వేసిన మొదటి అడుగు ఇప్పుడు మరికొందరిలో అవగాహన పెంచుతోంది.
సికింద్రాబాద్ యాప్రాల్‌లో ఉంటున్న నళిని సిరాంబి కన్సల్టింగ్ గ్రూప్‌లో ఉద్యోగినిగా రాణిస్తూనే టైప్ 1 డయాబెటిస్ చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆమె స్వచ్ఛందంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మా అమ్మాయి దిశన కు 12 ఏళ్ల కిందట టైప్1 డయాబెటిస్ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. అప్పుడు తన వయసు 12. నాకు అదో ఛాలెంజింగ్ కండిషన్ . ప్రతిరోజూ ఓ సవాల్‌లా ఉండేది. సాధారణంగా అన్నం, రోటీ అంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
ఆహారంలో మార్పులు చేయాలి. ప్రతిది మానిటరింగ్ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రాత్రిలోనే లైఫ్ మారిపోవచ్చు. ఆ సమయంలో ఎవరైనా ఊరట కలిగించే నాలుగు మాటలు చెప్పి, కాస్తంత ఓదార్పునిస్తే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు ఆలోచించాను. ‘మా పాపకే ఈ సమస్య వచ్చిందా, ఇలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా..’ అని వెతికాను. ఎవరూ తెలియలేదు.
‘స్వీట్ సోల్స్’ అని ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ చేశాను. ముందు ఓ ఐదుగురు జాయిన్ అయ్యారు. తర్వాత తర్వాత పదుల నుంచి వందలు.. వెయ్యికి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2012 లో మొదలుపెట్టిన ఓ చిన్న ప్రయత్నం చాలామంది తల్లితండ్రులను కలుసుకునేలా చేసింది. మా పాపకు ఉన్న సమస్య చాలా మంది పిల్లలకు ఉందని అర్థమైంది. రాను రాను ఇదో మంచి అవగాహన కార్యక్రమంగా మారిపోయింది.
అంకెలతో జీవనం..
టైప్ 1 డయాబెటిస్ పిల్లలను ఎలా చూసుకోవాలన్న విషయం మీద అవగాహన రావడానికే ఆరునెలల సమయం పడుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచే కాదు 24 గంటల వారి జీవనం అంతా అంకెలతో కూడుకున్నదే. ఏ సమయానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, మానసిక ఆరోగ్యం ఏంటి.. ప్రతీది చాలా జాగ్రత్తగా చూడాలి.
మా పాప ఎనిమిదేళ్ల వయసు నుంచి కథక్ నేర్చుకుంటోంది. మందులు, మానిటరింగ్‌తో పాటు తన చదువు, ఇతర హాబీస్‌ను కూడా కంటిన్యూ చేయించాలి. ఇవన్నీ జీవనంలో ఓ భాగమై పోయాయి. నెలరోజులకోసారి ఇలాంటి పిల్లలున్న వారిని కలవడానికి పార్క్‌లలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకునేవాళ్లం. నేనొక్కదాన్నే కాదు మిగతావాళ్లకు కూడా ఉంది అని తెలిస్తే పిల్లలు కూడా చెప్పినట్టు వింటారని, వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని అర్థమైంది.
సమస్యలను అధిగమిస్తూ..
స్వచ్ఛందంగా చేసే ఈ కార్యక్రమానికి డాక్టర్లు కూడా జత కలిశారు. దీంతో డాక్టర్లతో సెషన్స్ నిర్వహిస్తూ వచ్చాం. పిల్లలకు, పెద్దలకు విడి విడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. టైప్ 1 డయాబెటిస్ ఉన్న పిల్లలకు ఇన్సులిన్, ఇతర గ్యాడ్జెట్స్ కోసం నెలవారీ మందుల ఖర్చు ఆరు వేల రూపాయలకు పైనే పడుతుంది. సంపన్నులకు మాత్రమే ఈ ‘తీపి’ సమస్య వస్తుందనేమీ లేదు.
కూలి చేసుకునేవారి పిల్లలకూ రావచ్చు. ఈ ఖర్చు వారి జీవనాన్ని మరింత కుంగదీస్తుంది. అందుకని, పేదలకు సాయం చేసేలా, ప్రభుత్వం ఇన్సులినన్‌ను సబ్సిడీ మీద ఇచ్చేలా వర్క్ చేస్తున్నాం. ఇన్సులిన్‌ను నిల్వ చేయాలంటే ఫ్రిజ్ ఉండాలి. ఎవరికైనా ఆ సదుపాయం లేదంటే, ఆ విషయాన్ని గ్రూప్‌లో షేర్ చేస్తాం. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాటిని అరేంజ్ చేస్తారు.
పట్టణ ప్రాంతాల్లో పాటు గ్రామీణులకూ చేరువయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. కార్యక్రమాల్లో పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించేలా విడివిడిగా ప్రోగ్రామ్స్ ఆరేంజ్ చేస్తున్నాం. పిల్లలకు అర్థమయ్యేలా బొమ్మలను చూపిస్తూ వివరిస్తున్నాం. స్వీట్ సోల్స్ అనేది మా ఒక్క కుటుంబం కాదు, దేశమంతా టైప్1 డయాబెటిస్ ఉన్న వారందరిదీ.
జీవనం సాఫీగా..
ఇప్పుడు మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసి, జాబ్ చేస్తోంది. త్వరలో విదేశాలకు వెళ్లబోతోంది. కథక్ నృత్యకారిణి. తన జీవనాన్ని తను చూసుకోగల సమర్థత పెంచుకుంది. ఈ స్ఫూర్తి టైప్1 డయాబెటిస్ ఉన్న పిల్లందరిలోనూ కలగాలి. ఈ సమస్య ఉన్నప్పటికీ బాగా చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. తమ జీవితాలను అర్థవంతంగా మార్చుకుంటూ, మరికొందరికి ఆద ర్శంగా నిలుస్తున్నారు’’ అని వివరించారు నళిని.
ఇటీవల స్వచ్ఛందంగా నిర్వహించిన ‘స్వీట్ సోల్స్ కార్యక్రమానికి వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు నిత్యం తాము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు.
కోర్స్ చేశాను..
మా అమ్మాయికి 11 ఏళ్లు. ఆరేళ్ల క్రితం టైప్ 1 డయాబెటిస్ వచ్చింది. దీంతో డయాబెటిస్ పైన సర్టిఫైడ్ కోర్స్ చేశాను. స్వీట్ సోల్స్ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవడమే కాదు, నేను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కూడా వివరిస్తుంటాను. అందరం కలుస్తాం అనే చోట ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, నిర్వహణకు సంబంధించిన పనులు ఏంటి.. అని స్వచ్ఛందంగా చూస్తుంటాను. – శిరీష
అవగాహన అవసరం
ఇరవై ఏళ్ల క్రితం నాకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నాను. పిల్లలకు వారి తల్లిదండ్రులకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా వస్తుంటాను. కోవిడ్ టైమ్‌లో జూమ్ ద్వారా ప్రోగ్రామ్స్ చేశాం. ఒక్కో నెల ఒక్కో పార్క్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల లోపు కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాం. – ఆకుల శ్రీదివ్య
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment