ఆమె వేలి కొసలు తాకిన కాగితం కుసుమమై పరిమళిస్తుంది. ఆమె చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు మనసులోని భావాలను కళ్లకు కడతాయి. కాగితం మీద రాస్తూ భవిష్యత్తుకు పునాది వేసుకోవడమే కాదు, అదే కాగితంతో అందమైన ఆకృతిని రూపుకడుతోంది హైదరాబాద్ వాసి మోపిదేవి నాగవాణి. ఇష్టమైన వ్యాపకాన్ని ఉపాధిగా మార్చుకుంది. అందమైన కళాకృతులతో పాటు రికార్డులతోనూ ప్రశంసలు అందుకుంటోంది.
మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చేసిన నాగవాణి ఆరేళ్ల క్రితమే కాగితాన్ని అందంగా రూపుకట్టడంలో సాధన చేసింది. హాబీగానే మొదలైన వ్యాపకం ఆదాయ వనరుగా ఎలా మారిందో వివరించింది.
‘‘నే చేసిన కాగితం కళాకృతులు మొదట్లో మా స్నేహితులకూ నచ్చి, అడిగి తీసుకునేవారు. ఆ తర్వాత కాలేజీలో జరిగే ప్రోగ్రామ్స్‌కి మెమెంటోలు చేసిచ్చేదాన్ని. అక్కణ్ణుంచి ఈ ఆర్ట్‌లోనే ఒక్కో మార్పు జోడిస్తూ వచ్చాను. వాటిలో ఫొటో ఫ్రేమ్స్, ఆల్బమ్స్, రకరకాల పువ్వులు, లతలు, గిఫ్ట్ ఆర్టికల్స్ మెమొంటోలు, బాక్స్‌లు .. ప్రతీది కాన్సెప్ట్ వైజ్‌గా చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాను. దీంతో ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి.
మాతృత్వానికి అందమైన రూపం
నా కళాకృతుల తయారీకి విదేశాల నుంచి కూడా కాగితం తెప్పించుకుంటాను. వాటిలో ఉండే రంగులు, క్వాలిటీ ప్రధానంగా ఎంపిక ఉంటుంది. బర్త్‌డే, మ్యారేజ్ డే వంటి సందర్భాలకు తగినట్టుగా, మాతృత్వపు మాధుర్యానికి రూపమిచ్చేలా, స్నేహితులకు, ప్రేమకు సందేశాలు ఇచ్చే విధంగా ప్రతి ఫ్రేమ్ అందమైన ఊహకి ప్రాణం పోసేదిగా ఉండాలని తపిస్తుంటాను. ఆ తపన వల్లే నా కళ నన్ను చాలా మందికి చేరువ చేసింది.
ఆభరణాల తయారీ
పేపర్‌తో రకరకాల కళాకృతులే కాదు ఆభరణాల తయారీ కూడా చేస్తాను. ఈ క్రాఫ్ట్‌లో చాలా రకాలు ఉన్నాయి. కానీ, నేను ఎంచుకునే పేపర్ క్వాలిటీ ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పటికీ వాడిపోనివి, మన జ్ఞాపకాలను అందంగా మరింత పరిమళభరితంగా జాగ్రత్తపరచుకునేలా డిజైన్ చేస్తుంటాను. దీంతో ఇవి చిరకాలం ఉండిపోతాయి. ఆర్డర్స్ కూడా నా ఇన్‌స్టా పేజీ, వెబ్‌సైట్ నుంచి తీసుకుంటున్నాను. విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి.
ఫొటో ఫ్రేమ్స్..
పేపర్ ఆర్ట్‌ని ఫొటో ఫ్రేమ్స్‌కి అప్లై చేయడంతో ఇవి చాలామందిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కళలో బేసిక్ సాయం కావాలంటే కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటాను. కానీ, పూర్తిగా నేనే ఒక్కో ఆర్ట్ పీస్‌ను ప్రత్యేకంగా రూపుకడతాను. ఇందుకు అమ్మ నాగలక్ష్మి, నాన్న సత్యసాయిల ప్రోత్సాహం ఎంతో ఉంది. కాలేజీలు, స్కూళ్లలో ఈ పువ్వుల తయారీకి సంబంధించిన ప్రదర్శనలూ ఇస్తుంటాను. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను’’ అని వివరించింది నాగవాణి.
రికార్డులో పువ్వులు
సరదాగా నేర్చుకున్న కళ పూర్తి ఉపాధిగా మారిపోవడంతో పాటు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒకేసారి 1000 రంగు రంగుల పువ్వులు తయారు చేసినందుకు ఈ ఘనత దక్కింది. ఇప్పుడు గిన్నిస్ బుక్‌లో నా కళ చేరడానికి కృషి చేస్తున్నాను.
హాబీగా నేర్చుకున్న కళ ఆసక్తిని పెంచింది. సాధనతో కొత్త హంగులు పులుముకుంది. అదే ఉపాధిగా మారింది. రికార్డులూ తెచ్చిపెట్టింది. ప్రయత్నిస్తే హాబీ కూడా ఆదాయవనరుగా మారుతుంది అని తన కళ ద్వారా నిరూపిస్తుంది ఈ కాగితం కళాకారిణి.
– నిర్మలారెడ్డి
చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
Comments
Please login to add a commentAdd a comment