Paper Art
-
కాగితం కళ: పేపర్ సూపర్
‘హౌ టూ....’ అని గాలించేందుకు అప్పట్లో గూగులమ్మ లేదు. రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. ‘కాగితం కళ’పై చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న మేడా రజని ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో తనకు తోచిన రీతిలో రకరకాల డిజైన్లు చేసేది. ‘కాగితం కళ’ అనేది ఆమె బాల్య జ్ఞాపకం కాదు. బతుకు బాట వేసిన సాధనం. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఉత్తేజం....ప్రకృతి పాఠశాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండికి చెందిన రజనికి ప్రకృతి ప్రసాదమైన పూలను చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. విరబూసిన పూల నుంచి స్ఫూర్తిపొంది, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టేది. ‘పేపర్ క్విల్లింగ్’ ఆర్ట్‌ని సాధన చేసేది. ఇది తన అభిరుచి మాత్రమే కాదు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది. తన పరిధిలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణప్రాంంతాలకు వెళుతూ పేద విద్యార్థులకు ‘పేపర్ క్విల్లింగ్’లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చేస్తోంది.‘శ్రీ క్రియేషన్స్’ అనే సంస్థకు శ్రీకారం చుట్టి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తోంది. ‘సింధు డిజైన్స్’ పేరుతో శుభకార్యాల కోసం అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ఫ్లవర్ వాజ్‌లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్‌తో చేసిన ఫొటో ఫ్రేమ్‌లు... మొదలైనవి తయారు చేస్తోంది.‘కళ’కున్న గుణం ఏమిటంటే మనల్ని ఖాళీగా కూర్చోనివ్వదు! ఎప్పుడూ ఏదో తెలుసుకునేలా చేస్తుంది. నేర్చుకునేలా చేస్తుంది.‘పేవర్ ఆర్ట్ గురించి నాకు బాగా తెలుసు’ అని ఎప్పుడూ అనుకోలేదు రజిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది. విదేశీ కళలకు లోకల్ ఫ్లేవర్ జోడించడం గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటుంది.చండీగఢ్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన రజని ‘నా కళ నా దగ్గరే ఉండాలి’ అని అనుకోలేదు. తనకు తెలిసిన కళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మరీ కొత్త తరానికి పరిచయం చేస్తోంది.‘క్రియేటివ్ హార్ట్స్– ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ’ జాతీయ స్థాయిలో నిర్వహించినపోటీలో రజని తయారు చేసిన రాధాకృష్ణ పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ గెలుచుకుంది. ఇలాంటి పురస్కారాలు ఆమె ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి.‘అవార్డ్ అందుకున్నాను అనే ఆనందం కన్నా నా వల్ల పదిమంది ఈ కళలో ప్రాంవీణ్యం సాధించారనే విషయం గొప్పగా ఉంటుంది’ అంటుంది రజిని. తన ఆర్ట్‌వర్క్‌కు సంబంధించిన ప్రదర్శనలను దేశంలో ఎన్నోచోట్ల ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్న రజని పేపర్ ఆర్ట్‌లో మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు’ అనేది ఆమె నోటినుంచి వినిపించే మాట. నిజమే కదా! ఉత్సాహం ఇస్తుంది. ఉపాధి ఇస్తుంది. ఇతరులకు ఉపాధి కలిగించేలా చేస్తుంది. ఎంతో ఇచ్చింది...చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఉపాధి కల్పించింది. పేరు తెచ్చింది. నేను కన్న కలలు నిజం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఈ కళలో రాణించేందుకు ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలి. నేర్చుకున్నచోటే ఉండి΄ోకుండా కాలంతో పాటు కొత్త కళలు, సాంకేతికతపై దృష్టి పెట్టాలి.– మేడా రజని– ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం -
మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ! ఆమె హాబీ.. ఆదాయ వనరుగా ఎలా మారిందంటే!
ఆమె వేలి కొసలు తాకిన కాగితం కుసుమమై పరిమళిస్తుంది. ఆమె చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు మనసులోని భావాలను కళ్లకు కడతాయి. కాగితం మీద రాస్తూ భవిష్యత్తుకు పునాది వేసుకోవడమే కాదు, అదే కాగితంతో అందమైన ఆకృతిని రూపుకడుతోంది హైదరాబాద్ వాసి మోపిదేవి నాగవాణి. ఇష్టమైన వ్యాపకాన్ని ఉపాధిగా మార్చుకుంది. అందమైన కళాకృతులతో పాటు రికార్డులతోనూ ప్రశంసలు అందుకుంటోంది. మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చేసిన నాగవాణి ఆరేళ్ల క్రితమే కాగితాన్ని అందంగా రూపుకట్టడంలో సాధన చేసింది. హాబీగానే మొదలైన వ్యాపకం ఆదాయ వనరుగా ఎలా మారిందో వివరించింది. ‘‘నే చేసిన కాగితం కళాకృతులు మొదట్లో మా స్నేహితులకూ నచ్చి, అడిగి తీసుకునేవారు. ఆ తర్వాత కాలేజీలో జరిగే ప్రోగ్రామ్స్‌కి మెమెంటోలు చేసిచ్చేదాన్ని. అక్కణ్ణుంచి ఈ ఆర్ట్‌లోనే ఒక్కో మార్పు జోడిస్తూ వచ్చాను. వాటిలో ఫొటో ఫ్రేమ్స్, ఆల్బమ్స్, రకరకాల పువ్వులు, లతలు, గిఫ్ట్ ఆర్టికల్స్ మెమొంటోలు, బాక్స్‌లు .. ప్రతీది కాన్సెప్ట్ వైజ్‌గా చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాను. దీంతో ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. మాతృత్వానికి అందమైన రూపం నా కళాకృతుల తయారీకి విదేశాల నుంచి కూడా కాగితం తెప్పించుకుంటాను. వాటిలో ఉండే రంగులు, క్వాలిటీ ప్రధానంగా ఎంపిక ఉంటుంది. బర్త్‌డే, మ్యారేజ్ డే వంటి సందర్భాలకు తగినట్టుగా, మాతృత్వపు మాధుర్యానికి రూపమిచ్చేలా, స్నేహితులకు, ప్రేమకు సందేశాలు ఇచ్చే విధంగా ప్రతి ఫ్రేమ్ అందమైన ఊహకి ప్రాణం పోసేదిగా ఉండాలని తపిస్తుంటాను. ఆ తపన వల్లే నా కళ నన్ను చాలా మందికి చేరువ చేసింది. ఆభరణాల తయారీ పేపర్‌తో రకరకాల కళాకృతులే కాదు ఆభరణాల తయారీ కూడా చేస్తాను. ఈ క్రాఫ్ట్‌లో చాలా రకాలు ఉన్నాయి. కానీ, నేను ఎంచుకునే పేపర్ క్వాలిటీ ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పటికీ వాడిపోనివి, మన జ్ఞాపకాలను అందంగా మరింత పరిమళభరితంగా జాగ్రత్తపరచుకునేలా డిజైన్ చేస్తుంటాను. దీంతో ఇవి చిరకాలం ఉండిపోతాయి. ఆర్డర్స్ కూడా నా ఇన్‌స్టా పేజీ, వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నాను. విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. ఫొటో ఫ్రేమ్స్.. పేపర్ ఆర్ట్‌ని ఫొటో ఫ్రేమ్స్‌కి అప్లై చేయడంతో ఇవి చాలామందిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కళలో బేసిక్ సాయం కావాలంటే కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటాను. కానీ, పూర్తిగా నేనే ఒక్కో ఆర్ట్ పీస్‌ను ప్రత్యేకంగా రూపుకడతాను. ఇందుకు అమ్మ నాగలక్ష్మి, నాన్న సత్యసాయిల ప్రోత్సాహం ఎంతో ఉంది. కాలేజీలు, స్కూళ్లలో ఈ పువ్వుల తయారీకి సంబంధించిన ప్రదర్శనలూ ఇస్తుంటాను. వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను’’ అని వివరించింది నాగవాణి. రికార్డులో పువ్వులు సరదాగా నేర్చుకున్న కళ పూర్తి ఉపాధిగా మారిపోవడంతో పాటు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒకేసారి 1000 రంగు రంగుల పువ్వులు తయారు చేసినందుకు ఈ ఘనత దక్కింది. ఇప్పుడు గిన్నిస్ బుక్‌లో నా కళ చేరడానికి కృషి చేస్తున్నాను. హాబీగా నేర్చుకున్న కళ ఆసక్తిని పెంచింది. సాధనతో కొత్త హంగులు పులుముకుంది. అదే ఉపాధిగా మారింది. రికార్డులూ తెచ్చిపెట్టింది. ప్రయత్నిస్తే హాబీ కూడా ఆదాయవనరుగా మారుతుంది అని తన కళ ద్వారా నిరూపిస్తుంది ఈ కాగితం కళాకారిణి. – నిర్మలారెడ్డి చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’ -
భళా వెంకటవర్షిత్: కాగితంతో బొమ్మలు తయారీ
చెన్నూర్: చిన్నారి కళా..భళాగా ఉంది. ఖాళీగా ఉంటే చాలు వివిధ రకాల కళాకృతులు తయారు చేస్తాడు. న్యూస్ పేపర్లు ఉంటే చాలు వాటితో ఏదైనా ఇట్టే తయారు చేయడంలో దిట్టా. న్యూస్ పేపర్లలో వివిధ రకాలు వాహనాలు, సెట్టింగ్‌లను తయారు చేసి అందరితో శేభాష్ అనిపించుకుంటున్నాడు. చెన్నూర్ పట్టణానికి చెందిన రెడ్డి మహేశ్, దీప్తి దంపతుల ప్రథమ కుమారుడు వెంకటవర్షిత్ కోటపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొత్త ఆలోచనలతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడంపై మక్కువ పెంచుకున్నాడు. కుమారుడిలోని సృజనాత్మకతను గమనించిన తండ్రి మహేశ్ ప్రొత్సహించాడు. తండ్రి ప్రొత్సహంతో వెంకటవర్షిత్ ముందుకు సాగుతున్నాడు. ఖాళీ సమయం సద్వినియోగం కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలో ప్రతేక్ష బోధన నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో పనికి రాని న్యూస్ పేపర్లు, రంగుపేపర్లతో వివిధ రకాల బొమ్మలను తయారు చేయడం ప్రారంభించాడు వెంకటవర్షిత్. చిన్న చిన్న బొమ్మలను తయారు చేసిన చిన్నారి ఏకంగా వివిధ మోడళ్లలో వచ్చి మోటార్ సైకిళ్లతో పాటు వివిధ రకాల సెట్టింగ్‌లను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలు.. న్యూస్ పేపర్లతో ప్రస్తుతానికి మోటార్ సైకిళ్లలో పాటు వివిధ రకాల వస్తువులను తయారు చేశా. కరోనా సమయంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న. ఎన్నో రకాల బొమ్మలను తయారు చేశా. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలతో పాటు దేవుని, జాతీయ నాయకులు బొమ్మలను తయారు చేస్తానని వెంకటవర్షిత్ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవు రోజుల్లో పెద్ద వాహనాల బొమ్మలను తయారు చేస్తా. న్యూస్ పేపర్లతో బొమ్మల తయారీలో రికార్డు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న. –రెడ్డి వెంకటవర్షిత్, విద్యార్థి, చెన్నూర్ -
కాగితం నగషీ
మగువ అందానికి పొందికగా ఒదిగిపోతాయి ఈ నగలు. ఆ ఆభరణాలు ఎక్కువ డబ్బు ఖర్చు, బరువు లేకుండా... ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు అల్లాణి రాధిక. అదీ పర్యావరణహితంగా! ఖాళీ సమయాన్ని క్రియేటివ్‌గా మార్చుకుని పేపర్‌తో జ్యువెలరీ చేస్తున్నారు ఈమె. ‘పర్యావరణాన్ని కాపాడటమంటే సింపుల్‌గా ఉండటం కాదు. ఎకోఫ్రెండ్లీగా ఉంటూనే చక్కని అలంకరణతో అందంగా కనిపించవచ్చు. ఆసక్తి ఉంటే ఏ శిక్షణా అవసరం లేదు’ అంటున్న రాధిక... ఇంటర్నెట్ ముందు కూర్చునే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ నేర్చుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఈమె భర్త ప్రైవేటు ఉద్యోగి. కాలేజీ లైఫ్‌లో పిల్లలు బిజీ. ఇంట్లో పని అయిపోయాక ఖాళీగా ఉన్న రాధిక... ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో నెట్టింట్లో సెర్చ్ మొదలు పెట్టారు. అప్పుడు తట్టిందే ఈ ఐడియా. నాలుగు నెలల్లోనే చేయి తిరిగిన ఆర్టిస్టుగా మారిపోయారు. ఫిల్లింగ్ పేపర్‌తో కమ్మలు, గొలుసుల వంటివి ఎంతో ఆకర్షణీయంగా, ముచ్చటగా రూపొందించారామె. చూడ్డానికి ఫ్యాన్సీ జ్యువెలరీలా ఉన్న ఈ ఐటెమ్స్ ఖరీదు కూడా తక్కువే. అన్నింటి కంటే ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయని ప్రొడక్ట్స్. వీటన్నింటినీ లామకాన్లోని ‘ఆర్గానిక్ బజార్’లో ప్రదర్శనకు ఉంచారు ఆమె. వచ్చిన వారందరూ వీటిని అపురూపంగా చూస్తున్నారు. ‘మనమేం చేయగలమనే కంటే ఆలోచనను ఆసక్తి ఉన్న వైపు మళ్లిస్తే ఇలా పర్యావరణం కోసం అందరూ ఎంతో కొంత చేయవచ్చు’ అనేది రాధిక అభిప్రాయం.