‘హౌ టూ....’ అని గాలించేందుకు అప్పట్లో గూగులమ్మ లేదు. రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. ‘కాగితం కళ’పై చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న మేడా రజని ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో తనకు తోచిన రీతిలో రకరకాల డిజైన్‌లు చేసేది. ‘కాగితం కళ’ అనేది ఆమె బాల్య జ్ఞాపకం కాదు. బతుకు బాట వేసిన సాధనం. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఉత్తేజం....
ప్రకృతి పాఠశాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండికి చెందిన రజనికి ప్రకృతి ప్రసాదమైన పూలను చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. విరబూసిన పూల నుంచి స్ఫూర్తిపొంది, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టేది. ‘పేపర్ క్విల్లింగ్’ ఆర్ట్‌ని సాధన చేసేది. ఇది తన అభిరుచి మాత్రమే కాదు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది. తన పరిధిలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణప్రాంంతాలకు వెళుతూ పేద విద్యార్థులకు ‘పేపర్ క్విల్లింగ్’లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చేస్తోంది.
‘శ్రీ క్రియేషన్స్’ అనే సంస్థకు శ్రీకారం చుట్టి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ‘సింధు డిజైన్స్’ పేరుతో శుభకార్యాల కోసం అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ఫ్లవర్ వాజ్‌లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్‌తో చేసిన ఫొటో ఫ్రేమ్‌లు... మొదలైనవి తయారు చేస్తోంది.
‘కళ’కున్న గుణం ఏమిటంటే మనల్ని ఖాళీగా కూర్చోనివ్వదు! ఎప్పుడూ ఏదో తెలుసుకునేలా చేస్తుంది. నేర్చుకునేలా చేస్తుంది.‘పేవర్ ఆర్ట్ గురించి నాకు బాగా తెలుసు’ అని ఎప్పుడూ అనుకోలేదు రజిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది. విదేశీ కళలకు లోకల్ ఫ్లేవర్ జోడించడం
గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటుంది.
చండీగఢ్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన రజని ‘నా కళ నా దగ్గరే ఉండాలి’ అని అనుకోలేదు. తనకు తెలిసిన కళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మరీ కొత్త తరానికి పరిచయం చేస్తోంది.
‘క్రియేటివ్ హార్ట్స్– ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ’ జాతీయ స్థాయిలో నిర్వహించినపోటీలో రజని తయారు చేసిన రాధాకృష్ణ పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ గెలుచుకుంది. ఇలాంటి పురస్కారాలు ఆమె ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి.
‘అవార్డ్ అందుకున్నాను అనే ఆనందం కన్నా నా వల్ల పదిమంది ఈ కళలో ప్రాంవీణ్యం సాధించారనే విషయం గొప్పగా ఉంటుంది’ అంటుంది రజిని. తన ఆర్ట్‌వర్క్‌కు సంబంధించిన ప్రదర్శనలను దేశంలో ఎన్నోచోట్ల ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్న రజని పేపర్ ఆర్ట్‌లో మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.
‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు’ అనేది ఆమె నోటినుంచి వినిపించే మాట. నిజమే కదా! ఉత్సాహం ఇస్తుంది. ఉపాధి ఇస్తుంది. ఇతరులకు ఉపాధి కలిగించేలా చేస్తుంది.
ఎంతో ఇచ్చింది...
చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఉపాధి కల్పించింది. పేరు తెచ్చింది. నేను కన్న కలలు
నిజం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఈ కళలో రాణించేందుకు ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలి. నేర్చుకున్నచోటే ఉండి΄ోకుండా కాలంతో పాటు కొత్త కళలు, సాంకేతికతపై దృష్టి పెట్టాలి.
– మేడా రజని
– ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment