కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్‌ ప్రభావం.. | The impact of seasonal changes on Paralysis | Sakshi
Sakshi News home page

కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్‌ ప్రభావం..

Aug 17 2025 12:18 PM | Updated on Aug 17 2025 12:29 PM

The impact of seasonal changes on Paralysis

బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్‌ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్‌ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్‌ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...

స్ట్రోక్‌ రావడానికి ఆ సీజన్‌ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్‌కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్‌కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్‌ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్‌ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్‌ (బ్రెయిన్‌ స్ట్రోక్‌ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే... 
అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్‌ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 

1) ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్‌ను ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ అంటారు.   మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్‌ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 
2) హేమరేజిక్‌ స్ట్రోక్‌ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్‌ స్ట్రోక్‌ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 
3) ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్‌ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్‌ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్‌)లాగే... ఓ పెద్ద స్ట్రోక్‌ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్‌ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. 

ఇక స్ట్రోక్‌ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. 

చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్‌ ముప్పును తప్పించుకోవచ్చు.

వేసవిలోని వేడిమి...
డీ–హైడ్రేషన్‌ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్‌ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్‌కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్‌నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. 

వడదెబ్బ (హీట్‌స్ట్రోక్‌) : వడదెబ్బ కూడా స్ట్రోక్‌ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్‌లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. 

అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్‌ ఎగ్జర్షన్‌) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్‌ ముప్పు మరింతగా పెరుగుతుంది.

వర్షాకాలంలో...

ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్‌ / వైరల్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరగడం వల్ల. 

రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్‌ ప్రెషర్‌ ఫ్లక్చుయేషన్స్‌) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్‌) స్ట్రోక్‌ ముప్పును పెంచుతాయి. 

వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్‌ : మాన్‌సూన్‌ సీజన్‌లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్‌కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. 

ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్‌ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్‌ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్‌ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్‌ ముప్పును పెంచుతాయి.

చలికాలంలో...
వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్‌ తగ్గినా... అది స్ట్రోక్‌ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. 

వాసోకన్‌స్ట్రిక్షన్‌ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్‌స్ట్రిక్షన్‌ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. 

రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది.  ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్‌ పెరిగేలా చేసి స్ట్రోక్‌ ముప్పును పెంచుతుంది. 

చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్‌ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్‌ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. 

డీ–హైడ్రేషన్‌ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్‌ వచ్చే అవకాశాలను పెంచుతుంది. 

ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్‌ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. 

వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్‌)తో కలిసి ‘స్మాగ్‌’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు  ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్‌ కూడా స్ట్రోక్‌ ముప్పును పెంచేస్తుంది. 

నివారణ...

  • ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండటం. 

  • అన్ని సీజన్‌లలోనూ ఆయా సీజన్‌లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. 

  •  ఏ సీజన్‌లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. 

  • కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.

  • ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్‌ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. 

(చదవండి:  ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హెపటైటిస్‌ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement