గగన నేత్రాలు.. ముగ్గురు మహిళా పైలట్‌లు | Indian Navy Operationalises 3 Women Pilots On Dornier Aircraft At Kochi | Sakshi
Sakshi News home page

నేవీకి కొత్త నిఘా నేత్రాలు; దివ్య, శుభాంగి, శివాంగి.

Published Tue, Oct 27 2020 8:39 AM | Last Updated on Tue, Oct 27 2020 8:41 AM

Indian Navy Operationalises 3 Women Pilots On Dornier Aircraft At Kochi - Sakshi

మారిటైమ్‌ రికానిసెన్స్‌! పెద్ద బాధ్యత. సముద్ర గగనతలం నుంచి నలు దిక్కుల్లో నిఘా! అంతటి కీలకమైన విధుల్లోకి గురువారం ముగ్గురు మహిళా లెఫ్టినెంట్‌లు కొచ్చిలోని సదరన్‌ నేవల్‌ కమాండ్‌ (ఎస్‌.ఎన్‌.సి.) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారు. ఆ ముగ్గురూ దివ్యాశర్మ, శుభాంగి స్వరూప్, శివాంగి. నేవీ ఫస్ట్‌ బ్యాచ్‌ మహిళా పైలట్‌లు. ‘డోర్నియర్‌ ఆపరేషనల్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌’ (డి.ఓ.ఎఫ్‌.టి.)ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ మహిళల చేతికి నేవీ ఇప్పుడు డోర్నియర్‌ నిఘా విమానాలు నడిపే బాధ్యతను అప్పగించబోతోంది! ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’ కు ముఖ్య అతిథిగా హాజరైన రియర్‌ అడ్మిరల్‌ ఆంటోనీ జార్జి.. ‘నేవీకి ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని దివ్య, శుభాంగి, శివాంగిలను అభినందించారు. 

నేవీ పైలట్‌లుగా దివ్య (ఢిల్లీ), శుభాంగి (యు.పి.), శివాంగి (బిహార్‌) మొదట ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి ప్రాథమిక శిక్షణ పొందారు. గత ఏడాది డిసెంబరులో శివాంగి, ఈ ఏడాది ఆరంభంలో మిగతా ఇద్దరు ఎయిర్‌ ఫోర్స్‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం నేవీ ఈ ముగ్గురిని కొచ్చిలో డి.ఓ.ఎఫ్‌.టి. శిక్షణకు పంపింది. వీళ్లతోపాటు మరో ముగ్గురు పురుషులు ఆ ట్రైనింగ్‌ తీసుకున్నారు. నెల రోజులు గ్రౌండ్‌ ట్రైనింగ్, ఎనిమిది నెలలు ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌. గ్రౌండ్‌ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్‌ శివ, ఫ్లయిట్‌ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్‌ దివ్య ప్రథమ స్థానంలో నిలిచారు. ఎయిర్‌ఫోర్స్‌లో ముందుగా శిక్షణ పూర్తి చేసుకున్న శివాంగి స్వస్థలం ముజఫర్‌పుర్‌. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌. తల్లి గృహిణి. శివాంగి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి, ఎంటెక్‌లో చేరారు. నేవీలో అవకాశం రావడంతో మధ్యలోనే ఆపేశారు.

శుభాంగి స్వరూప్‌ స్వస్థలం యూపీలోని బరేలీ. భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌. 2017లో ఎళిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. తమిళనాడులోని వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌ చేశాక, హైదరాబాద్‌లోని ఎయిర్స్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి శిక్షణ పొంది, తర్వాత నేవీలోకి మారారు. కరాటే ఛాంపియన్‌ కూడా. శుభాంగి తండ్రి నేవీ అధికారి. తల్లి నేవీ స్కూల్లో టీచర్‌. దివ్య, శుభాంగి, శివాంగి.. ఈ ముగ్గురు పైలట్‌లు డోర్నియర్‌ బాధ్యతలను స్వీకరించనుండటంతో నేవీలో సందడి నెలకొంది. గత నెలలో కూడా రితీసింగ్, కుముదినీ త్యాగీ అనే నేవీ సబ్‌లెఫ్టినెంట్‌లు ‘అబ్జర్వర్‌’ కోర్సును పూర్తి చేసి యుద్ధనౌకల్లోని ఫైటర్‌ హెలికాప్టర్‌ల తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement