పామ్ గోసల్, స్కాట్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ
ఇటీవలే మే 6 న స్కాట్లాండ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. బ్రిటన్‌లో భాగమైన స్వతంత్ర దేశం స్కాట్లాండ్. ప్రధాని ఉంటారు. పైన క్వీన్ ఎలిజబెత్ ఉంటారు. దేశంలో మూడు పార్టీలు ఉన్నాయి. స్కాటిష్ నేషనల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ లీడర్ నికోలా స్టర్జన్. ఆమే ఇప్పుడు ప్రధాని. అయితే ఆమె గురించి కాదు మన స్టోరీ. ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ నుంచి పామ్ గోసల్ (49) అనే అభ్యర్థి విజయం సాధించారు. రాణిగారి ఆస్థానంలో చోటు సంపాదించారు. గోసల్ భారత సంతతి మహిళ. అంతేకాదు, స్కాట్లాండ్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన తొలి భారతీయురాలు!
పామ్ గోసల్ ఈ నెల 13న స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1998లో ఆ దేశంలో వచ్చిన కొత్త చట్టంతో 1999 నుంచి ఐదేళ్లకోసారి పార్లమెంటు ఎన్నికలు జరగడం మొదలయ్యాక ఒక భారత సంతతి మహిళ స్కాట్లాండ్ ఎంపీ కావడం ఇదే ప్రథమం. మొన్న జరిగినవి ఆరో పార్లమెంటు ఎన్నికలు. వెస్ట్ స్కాట్లాండ్ నుంచి పామ్ గోసల్ గెలుపొందారు. ఆ ముందు నుంచే ఆమె స్కాట్లాండ్ ‘కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్’ (సి.డబ్లు్య.ఓ) కు డిప్యూటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. సి.డబ్లు్య.ఓ. అన్నది నూట రెండేళ్లుగా ఉన్న సంస్థ. ఇంగ్లండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్‌లలోని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మహిళలంతా ఇందులో సభ్యులుగా ఉంటారు. స్కాట్లాండ్ కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్.. సి.డబ్లు్య.ఓ.కు అనుబంధంగా ఉంటుంది. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో గోసల్ సభ్యురాలు అవడంతో.. పార్లమెంటు సభ్యురాలిగా ఆమె విజయానికి సహజంగానే ప్రాధాన్యం లభించింది. ఇక భారత సంతతి మహిళగా ఆమె విజయం మన దేశానికి కూడా గర్వకారణమే.
స్కాట్లాండ్ పార్లమెంటు భవనం ముందు పామ్ గోసల్
పామ్ గోసల్ పూర్వికులది పంజాబ్‌లోని భటిండా. సిక్కుల కుటుంబం. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోవ్ నగరంలో ఆమె జన్మించారు. డిగ్రీ చదివారు. కన్జూమర్ ‘లా’ లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం పిహెచ్.డి చేస్తున్నారు. స్లాట్లాండ్ కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న భారతీయ సభ్యులతో ఆమెకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. స్కాట్లాండ్‌లోని కన్జర్వేటివ్ పార్టీకి, బ్రిటన్ సంతతి భారతీయులకు మధ్య ఆమె ఒక వారధి అయ్యారు. వాళ్లంతా ఎంపీగా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతిచ్చి, ఆమె విజయానికి సహకరించారు.
ఎన్నికల్లో పోటీ చేసే ముందువరకు కూడా గోసల్ తన కుటుంబ వ్యాపారం లో తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నారు. ‘‘భారతీయ నేపథ్యంతో స్కాట్లాండ్ తొలి పార్లమెంటు మహిళా సభ్యురాలిగా ఎన్నికవడం నాకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. వెస్ట్ స్కాట్లాండ్ ప్రజలతో కలిసి పని చేసేందుకు త్వరపడుతున్నాను’’ అని గోసల్ ట్వీట్ చేశారు. ఆమె తన ప్రమాణ స్వీకారాన్ని ఇంగ్లిష్‌లోను, పంజాబీలోనూ చేశారు. ప్రమాణ స్వీకారం పార్లమెంటు సంప్రదాయం ప్రకారం క్వీన్ ఎలిజబెత్ పేరిట మొదలై, భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించేలా సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథంలోని పంక్తులతో పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment